క్రెడిట్‌ చోరీలకు పాల్పడి అభాసుపాలు కావొద్దు

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి కౌంటర్ 

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

“జగనన్న భూ హక్కు – భూరక్ష”కు కేంద్రం నుంచి ప్లాటీన‌మ్ గ్రేడ్‌

అందులో భాగంగానే రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.397 కోట్ల రాయితీలు

పెమ్మ‌సానిది పూట‌కో మాట‌

ఎంపీ గురుమూర్తి ఆగ్ర‌హం

వెంక‌ట‌గిరి: వైయస్‌ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి  వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను క్రెడిట్ చోరీ చేసి అభాసుపాలు కావొద్ద‌ని వైయస్‌ఆర్‌సీపీ తిరుప‌తి ఎంపీ గురుమూర్తి కూట‌మి నేత‌ల‌కు హిత‌వు ప‌లికారు. “జగనన్న భూ హక్కు – భూరక్ష” ప‌థ‌కంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పార్టీ నేతలతో కలిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ప్రెస్‌మీట్‌లో ఎంపీ గురుమూర్తి ఇంకా ఏమ‌న్నారంటే..

“జగనన్న భూ హక్కు – భూరక్ష” పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచే ప్లాటినమ్ గ్రేడ్ రావడం వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషికి నిదర్శనం. ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.397 కోట్ల ప్రోత్సాహక నిధులు వచ్చాయి. గత రెండు రోజులుగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక రోజు రీసర్వే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందంటారు… మరుసటి రోజు మాట మార్చి కూటమి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు. ఇది పూర్తిగా క్రెడిట్ చోరీ రాజకీయమే.

● అందుకే ప్లాటినమ్ గ్రేడ్..

20 డిసెంబర్ 2023న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదికను పరిశీలించండి. దేశవ్యాప్తంగా 168 జిల్లాల్లో భూ డిజిటలైజేషన్ 90–95 శాతం పూర్తయిందని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే పేర్కొంది. అప్పటి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా, కచ్చితంగా రీసర్వే పూర్తి చేసింది. అందుకే ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చారు. ఈ పనుల ఫలితంగా  కేంద్ర‌ ఆర్థిక శాఖ 2024–25 సంవత్సరానికి రాష్ట్రానికి రాయితీలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే 19 ఫిబ్రవరి 2025న కేంద్రం నుంచి రూ.397 కోట్ల‌ నిధులు విడుదలయ్యాయి. ఇవన్నీ అధికారిక రికార్డులే. మీ మాటలూ రికార్డులే. కేంద్ర ప్రభుత్వ లేఖలూ రికార్డులే.

● అబ‌ద్ధ ప్ర‌చారం మానుకోండి

భూ వివాదాల్లో సివిల్ కోర్టుల అధికారాలు తొలగించారంటూ కూటమి నేతలు అబద్ధాలు ప్రచారం చేశారు. ఇది పూర్తిగా అసత్యం. మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లోని షెడ్యూల్–38 ప్రకారం సమస్యలు ఉంటే హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉంది. రైతులకు, భూ యజమానులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా వైయస్ జగన్ ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. చిన్న చిన్న భూ వివాదాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతినకూడదని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆలోచించి తీసుకొచ్చిన పథకం జగనన్న భూరక్ష. ఇది మీరు క్రెడిట్ చోరీ చేస్తే మాయమయ్యే పథకం కాదు. వైయస్ జగన్ గారు ఏ పని చేసినా నిజాయితీ, నిబద్ధతతో చేస్తారు. పదికాలాలు నిలిచే పథకాలను అమలు చేశారు. 

వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులను చెడుగా చూపించి, తామేదో గొప్పగా పాలన చేస్తున్నామనుకోవడం పెద్ద పొరపాటు. ప్రజలు అమాయకులు కారు. కాబట్టి ఇలాంటి క్రెడిట్ చోరీలకు పాల్పడి అభాసుపాలు కావద్దు అని ఎంపీ గురుమూర్తి కూట‌మి నేత‌ల‌కు హితవు పలికారు.

Back to Top