తాడేపల్లి: సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరిగే ఖర్చుల ఇన్‌వాయిస్‌లు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన రహస్య జీవోలను బయటపెట్టాలని వైయస్ఆర్‌సీపీరాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు మేలు చేస్తారనే ఆశతో ప్రజలు కూటమికి పట్టంగడితే విచ్చలవిడి దుబారా ఖర్చులు, జల్సాలతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రీ, ఏ బిజినెస్ మ్యాన్ కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు మాదిరిగా హైదరాబాద్ నుంచి షటిల్ సర్వీసులు చేయరని, ఏపీలో మంత్రి పదవులు వెలగబడుతూ వారం వారం హైదరాబాద్‌లో ఏం పని ఉంటుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు విమాన ప్రయాణాలకు ఏడాదిలో రూ. 56 కోట్లు ఖర్చు చేశారని జీఏడీ వెల్లడించిందని, అంతకన్నా ఎక్కువగా ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు ఎంత ఖర్చు అయ్యుంటుందని ప్రశ్నిస్తూ, వారికి ఆ డబ్బులు ప్రభుత్వం కాక ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ● 5 రోజుల్లో పవన్ కళ్యాణ్ 11 సర్వీసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజూ హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రత్యేక విమానాల్లోనే తిరిగాడని, ఒకే ఒక్క రాత్రి మాత్రమే విజయవాడలో బస చేశాడని శివశంకర్ వెల్లడించారు. ఈ ఐదు రోజుల్లోనే 11 సర్వీసెస్ రాను పోను, మధ్యలో ఒక హెలికాప్టర్ సర్వీస్.. ఉపయోగించుకున్నాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి వచ్చి మళ్లీ 7 గంటలకి వెళ్లిపోయాడని, కేవలం నాలుగు గంటలే ఇక్కడ ఉండి వెళ్లారని చెప్పారు. మళ్లీ 22వ తేదీన ఉదయం 10.42 గంటలకు ఇక్కడ దిగి, ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కోటప్పకొండకి వెళ్లి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఒక్క రోజు రాత్రి మాత్రమే విజయవాడలో స్టే చేసి మళ్లీ యథావిధిగా తర్వాత రోజు హైదరాబాద్‌కి వెళ్లిపోయాడని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేయడానికి వారికి అధికారం ఇస్తే, రాష్ట్రంలో ఒక్క రోజు కూడా నిద్రించడానికి తీరిక లేదా? సౌకర్యాలు లేవా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ని టూరిస్ట్ ప్లేస్‌గా మార్చేసి ప్రతిరోజూ ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరగడానికి వారికి ప్రభుత్వం నుంచి కాకుండా డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ● జెడ్పీటీసీల జీతాలకు డబ్బులు లేవట ఆటోలు, బస్సుల్లో తిరుగుతున్నట్టు హైదరాబాద్‌కి షటిల్ సర్వీస్ చేస్తూ వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్న పవన్ కళ్యాణ్.. తాను ప్రాతినిథ్యం వహించే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వచ్చే జెడ్పీటీసీలకు 2024 నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదని చెప్పారు. దానిపై వారు హైకోర్టుకెళ్లగా పంచాయతీరాజ్ శాఖ అకౌంట్‌లో డబ్బుల్లేవని కోర్టుకు సమాధానం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి మంగళవారం అప్పుల చేసి తమ జల్సాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ముగ్గురు నాయకులు జెడ్పీటీసీలకు జీతాలు చెల్లించడానికి డబ్బుల్లేవా? అని మండిపడ్డారు. లోకేష్, పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా? అందుకు సంబంధించిన జీవోలు, ఇన్‌వాయిస్ లు బయటపెట్టాలని శివశంకర్ డిమాండ్ చేశారు.