పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరమ‌ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అర‌కు నియోజకవర్గం పెదబయలు మండల కేంద్రంలోని సంత షెడ్డులో వైయ‌స్ఆర్‌సీపీ పెదబయలు మండల పార్టీ అధ్యక్షుడు పాంగి చంద్రుబాబు ఆధ్వర్యంలో శ్రేణుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ అరకు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ఏరువాక సత్యారావు గారితో కలిసి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం  మాట్లాడుతూ, గ్రామస్థాయిలో నిబద్ధత గల కార్యకర్తలను తయారు చేయాలనే లక్ష్యంతో పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల వివరాలతో పాటు ఓటర్ కార్డుల సేకరణ పూర్తయ్యిందని, త్వరలోనే రాష్ట్ర నాయకత్వ ప్రణాళికలో భాగంగా వారికి బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

గ్రామ కమిటీలతో పాటు పంచాయితీ స్థాయిలో మహిళా, రైతు, సోషల్ మీడియా, ఎస్టీ, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ, బీసీ జనాభా తక్కువగా ఉండటంతో ఆ విభాగాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఆయా విభాగాల్లో కనీసం 5 మందికి తగ్గకుండా, గరిష్ఠంగా 9 మంది సభ్యులను ఈ నెలాఖరులోగా నియమించాలని మండల స్థాయి టీమ్‌కు దిశానిర్దేశం చేశారు.  పంచాయ‌తీ స్థాయిలో సుమారు 54 మంది సభ్యులు, విభాగాల వారీగా మొత్తం 30 మంది సభ్యుల నియామకంతో గ్రౌండ్ లెవెల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ మరింత పటిష్టమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం పార్టీ పరిశీలకులు ఏరువాక సత్యారావు  మాట్లాడుతూ, రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని అన్నారు. ఎల్లప్పుడూ జగన్ గారికి వెన్నంటి ఉండి, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు భరోసాగా నిలుస్తామని తెలిపారు. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఏజెన్సీ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. 

Back to Top