జగనన్న సైన్యాన్ని నిర్మించేందుకు స‌మాయత్తం కావాలి

వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి పిలుపు

బనగానపల్లె నియోజకవర్గం  వైయ‌స్ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం  

నంద్యాల జిల్లా:  రెండేళ్ల‌ పాల‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైన్యాన్ని నిర్మించేందుకు పార్టీ శ్రేణులు స‌మాయ‌త్తం కావాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి   ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం శుక్ర‌వారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి , జిల్లా ప‌రిశీల‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, బాధ్యతగల ప్రతిపక్షంగా ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ స్థాయి నుంచే మరింత శక్తివంతంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు “జగనన్న సైన్యం”ను నిర్మించుకునేందుకు ఇది సువర్ణావకాశమని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని స్పష్టం చేశారు. పంచాయతీలను యూనిట్‌లుగా తీసుకొని గ్రామ కమిటీ నియామకాలు చేపట్టాలని సూచించారు. గ్రామ కమిటీల్లో 9 మంది సభ్యులతో పాటు 7 అనుబంధ కమిటీల్లో ఒక్కో విభాగానికి 5 నుంచి 10 మంది సభ్యులను నియమించాలని సూచించారు. కమిటీల్లో సోషల్ మీడియా కన్వీనర్ పాత్ర అత్యంత కీలకమని, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. ఈ విధంగా ఒక్కో పంచాయతీలో 70 నుంచి 100 మంది వరకు పార్టీకి సేవ చేసే అవకాశాలు కల్పించాలన్నారు.

ఫిబ్రవరి 18లోగా గ్రామ కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలని, ప్రతి రెండు పంచాయతీలకు ఒక కోఆర్డినేటర్‌ను నియమించాలని ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి దిశానిర్దేశం చేశారు. కమిటీల్లో నియమితులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యక్రమాలను వీరి ద్వారానే అమలు చేయిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు చల్లా విగ్నేశ్వర్ రెడ్డి , అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి , భూమా కిషోర్ రెడ్డి,  నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top