విశాఖపట్నం: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో విశాఖపట్నం జి.వి.ఎం.సి కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మా గాంధి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసులకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కె.కె. రాజు పాల్గొని మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల హక్కు అని, ఆ హక్కును అణిచివేయడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వాటిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ , జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకుటి రామచంద్రరావు , రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ్ , యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.