యల్లనూరు ఘటనలో పోలీసుల ఏకపక్ష వైఖరి.. 

వైయ‌స్ఆర్‌సీపీ జడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్ప‌డిన టీడీపీ నేత‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోని పోలీసులు

బాధితుల‌పైనే రివ‌ర్స్ కేసు..13 మంది అరెస్టు 

అనంతపురం: జిల్లాలోని యల్లనూరు ఘటనలో పోలీసుల ఏకపక్ష వైఖరి మరోసారి బట్టబయలైంది. జనవరి 1వ తేదీన వైయ‌స్ఆర్‌సీపీ జడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ఘటనలో దాడులకు పాల్పడిన టీడీపీ నేతలను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ దాడిలో నలుగురు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు.

మరోవైపు బాధితులైన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపైనే తిరిగి పోలీసులు కేసులు నమోదు చేయడం, 13 మంది వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడం పోలీసుల పక్షపాత ధోరణికి నిదర్శనంగా మారిందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మారణాయుధాలతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలపై మాత్రం పోలీసులు కన్నెత్తి కూడా చూడకపోవడం అన్యాయమని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 23 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల ఈ వైఖరిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, నూతన సంవత్సర వేడుకల వేళ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు రెచ్చిపోయిన ఘటనగా యల్లనూరు దాడి నిలిచింది. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యల్లనూరు వైయ‌స్ఆర్‌సీపీ జడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరగగా, ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలను హింసగా మార్చడం తగదని, దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Back to Top