తాడేపల్లి: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా, వాటిని ప్రశ్నించిన యువతపై కేసులు పెట్టడం, రౌడీ షీట్లు వేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని వైయస్‌ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. గుంటూరు గుంటూరు కలెక్టరేట్ ఎదుట వైయస్ఆర్ ఎస్‌యూ , ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్‌యూఐ, ఏఐవైఎఫ్, వైయస్ఆర్ యువజన విభాగం, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం హక్కు అని, ఆ హక్కును అణిచివేయడం ప్రజాస్వామ్యానికి ముప్పని వారు పేర్కొన్నారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జివిఎంసీ కార్యాలయం ఎదుట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలు అన్యాయమని ఆయన అన్నారు. కోనసీమ: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట వైయస్ఆర్ సీపీ యువజన–విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ నేతృత్వం వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఒంగోలు దర్శి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్, వైయస్ఆర్‌సీపీ యువజన–విద్యార్థి విభాగాలు పాల్గొన్నారు. విజయనగరం బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు నాయకత్వంలో బాలాజీ జంక్షన్‌లో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన నిర్వహించారు. కార్యక్రమంలో అల్లు అవినాష్, కారుమజ్జి సాయికుమార్, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీవైఎల్ సంఘాలు మరియు వైయస్ఆర్‌సీపీ యువజన–విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో కామిరెడ్డి నాని, రాజేష్, మోహన్ చాంద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య డిమాండ్లు: విద్యార్థి, యువజన నేతలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించాలి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచాలి ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి–యువజన సంఘాలు హెచ్చరించాయి.