కోడిని కోశారంటూ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై కేసు నమోదు

తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కోడిని కోసి ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారంటూ తిరుపతి ఈస్ట్ పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. డిసెంబర్ 21న జరిగిన ఈ ఘటన ప్రజల్లో భయాందోళనలు కలిగించి ప్రజాశాంతికి భంగం కలిగించిందని పేర్కొంటూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 21/2026 కింద BNS సెక్షన్లు 196(1), 351(2) r/w 3(5) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నలందుల బాలసుబ్రమణ్యం రెడ్డి అలియాస్ బాలు (A1), అమ్ముగుంట భువన్ కుమార్ (A2)లను నిందితులుగా పేర్కొన్నారు.

తిరుపతి కొర్లగుంట కట్టకిందపల్లి సర్కిల్ వద్ద కోడిని కోసి రక్తాభిషేకం చేయడం ద్వారా ప్రజలకు భయాందోళన కలిగించి ప్రజాశాంతికి భంగం కలిగించారని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్‌కు తరలించింది.  ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యగా అభివర్ణిస్తూ, చిన్న ఘటనను అతిశయోక్తిగా చూపించి కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో పోలీసుల తీరును నెటిజ‌న్లు త‌ప్పుప‌డుతున్నారు. చికెన్ షాపుల య‌జ‌మానులు ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Back to Top