భూకేటాయింపుల్లో లోకేష్ క‌మీష‌న్ రూ.400 కోట్లు

తిరుప‌తి వ‌న్ ప్రాజెక్టు ముసుగులో వంద‌ల కోట్ల అవినీతి

అడ్డ‌గోలు భూ కేటాయింపులు త‌క్ష‌ణం ర‌ద్దు చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్‌ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

తిరుప‌తి లోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్‌ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి 

ఎక‌రం రూ.50 కోట్ల భూమి ఎస్ఆర్‌వో రేటుకే ధారాద‌త్తం

వెయ్యి కోట్ల విలువైన భూమికి మ‌రో రూ.400 కోట్ల రాయితీలు 

భూకేటాయింపుల‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా అప్ప‌గింత‌ 

ఆ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల మీద ప్ర‌భుత్వానికి ఎందుకంత ప్రేమ‌?

ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టార్ హోటళ్లు, స్పాల ఏర్పాటు దారుణం

మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మండిపాటు 

తిరుప‌తి: తిరుప‌తి వ‌న్ ప్రాజెక్టు పేరుతో రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌కు జ‌రిగిన భూ కేటాయింపుల వెనుక వంద‌ల కోట్ల అవినీతి దాగి ఉంద‌ని, ఈ భూ కేటాయింపుల‌ను త‌క్ష‌ణం ర‌ద్దు చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుప‌తిలోని త‌న నివాసంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తి క‌లెక్ట‌రేట్‌కు స‌మీపంలో వెయ్యి కోట్ల విలువైన‌ 22 ఎక‌రాల భూమిని కేవ‌లం రూ. 94 కోట్ల‌కు కేటాయించ‌డమే కాకుండా మ‌రో రూ.400 కోట్లు రాయితీలు ఇవ్వ‌డం వెనుక ఎన్నో అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం నుంచి రూ.1400 కోట్ల రాయితీలు ఇస్తుంటే ఆ మేర‌కు జీవోలో ఎలాంటి క‌ఠిన నిబంధ‌న‌లేమీ లేవ‌న్నారు. అంతేకాకుండా ఈ భూములు టెండ‌ర్లకు ఎలాంటి ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేయ‌క‌పోవడం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌ని భూమ‌న ప్ర‌శ్నించారు. ఈ రియ‌ల్ ఎస్టేట్‌ సంస్థ‌లు లోకేష్ బినామీలేన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తూ, నారా లోకేష్ కి రూ.400 కోట్లు క‌మీష‌న్లు కూడా ముట్ట‌జెప్పార‌ని టీడీపీ నాయ‌కులే చ‌ర్చించుకుంటున్నార‌ని వివ‌రించారు. ప‌విత్ర‌మైన ఆల‌యానికి స‌మీపంలో స్పాలు, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ల‌కు స్థలాలు స్టార్ హోట‌ల్స్ స్థ‌లాలు ఇవ్వ‌డంపైనా ఆయ‌న మండిప‌డ్డారు.  

- వెయ్యి కోట్ల విలువైన భూమి రూ.94 కోట్ల‌కు 

క‌లెక్ట‌రేట్ ఆఫీసుకి కూతవేటు దూరంలో వెయ్యి కోట్లు విలువ చేసే 22 ఎక‌రాల‌ భూమిని కేవ‌లం రూ. 94 కోట్ల‌కు టూరిజం డెవ‌లప్‌మెంట్ పేరుతో రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌కు అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టేయ‌డం వెనుక వంద‌ల కోట్ల అవినీతి దాగి ఉంది. ఈ భారీ అవినీతి కుంభ‌కోణం వెనుక క‌ర్త, క‌ర్మ‌, క్రియ అన్నీ నారా లోకేష్ అని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. టూరిజం స్థ‌లాల‌ను ప్రైవేట్ సంస్థ‌ల‌కు అప్ప‌గించాలంటే లీజు ప్రాతిప‌దిక‌న లేదా పీపీపీ విధానంలోనే ఇవ్వాలి. కానీ అందుకు భిన్నంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వ‌డం దారుణం. దివ్య శ్రీ హోల్డింగ్స్ ప్రై లిమిటెడ్‌, సైబర్ సిటీ బిల్డ‌ర్స్ అండ్ డెవ‌ల‌ప‌ర్స్ అనే బెంగళూరు, హైదరాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్ వెంఛ‌ర్లు వేసే సంస్థలకు అమ్మేశారు. అంతేకాకుండా వ్యాపార ఒప్పందాల్లో భాగంగా 15 ఏళ్ల పాటు ఏపీ జీఎస్టీ ప్రోత్సాహకం, భూమి కొనుగోలుపై 100 శాతం స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్, ఐదేళ్ల‌పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణం. 

- లోకేష్ బినామీ సంస్థ‌ల‌ని అనుమానం 

ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి పేప‌ర్ ప్ర‌క‌ట‌న కూడా రాలేదు. వెయ్యి కోట్ల విలువైన భూముల‌కు అద‌నంగా మ‌రో రూ.400 కోట్లు రాయితీలు క‌ల్పిస్తూ మొత్తం రూ. 1400 కోట్లను రెండు రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌కు అప్ప‌నంగా దోచిపెడుతోంది. ఈ రెండు నిర్మాణ సంస్థలు ప‌క్క‌నే ఉన్న పొలాల‌ను భారీగా కొనుగోలు చేస్తూ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కి పాల్ప‌డుతున్నారు. ఇక్క‌డ నిర్మాణం జ‌రిగేవి మ‌ల్టీప్లెక్స్ లు, వెల్‌నెస్ సెంట‌ర్లు, ఓ పెద్ద కాన్ఫ‌రెన్స్ హాల్. వాటికి ఇంత అప్ప‌నంగా భూములు ఇస్తున్నారంటే, దానిమీద లోకేష్‌కి ఎందుకంత ప్రేమ‌? ఇదంతా చూస్తుంటే ఈ సంస్థ‌లు నారా లోకేష్ బినామీలేమోన‌ని అనుమానం క‌లుగుతోంది. తిరుచానూరుకు కూతవేటు దూరంలో ఆధ్యాత్మిక సెంటర్లో మ‌ల్టీప్లెక్స్‌లు, వెల్‌నెస్ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌డం భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకోవ‌డ‌మే. 1500 ఉద్యోగాలు వ‌స్తాయ‌నే పేరుతో రూ.1400 కోట్లు అప్ప‌నంగా ధారాద‌త్తం చేయ‌డం అవినీతికి బాట‌లు వేయ‌డ‌మే. త‌గు నిర్మాణాలు చేప‌ట్ట‌క‌పోతే చ‌ర్యలు తీసుకుంటామ‌ని జీవోలో పేర్కొన‌డం మిన‌హా ఎలాంటి నిబంధ‌న‌లు పెట్ట‌క‌పోవ‌డం కూడా భారీ అవినీతి జ‌రిగింద‌న్న అనుమానాల‌కు బ‌లం చేకూరుస్తోంది. 22 ఎక‌రాల భూకేటాయింపుల ముసుగులో నారా లోకేష్ రూ. 400 కోట్లు క‌మీష‌న్ తీసుకున్నాడ‌ని తెలుగుదేశం నాయ‌కులే మాట్లాడుకుంటున్నారు. 

- జీవోలో క‌ఠిన నిబంధ‌న‌లు ఎందుకు పెట్టలేదు?

తిరుప‌తిలో ప్ర‌భుత్వ స్థ‌లాలు దొర‌క‌డ‌మే అరుదైతే, వాటిని రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌కు పప్పు బెల్లాల‌కు ధారాద‌త్తం చేయ‌డంతో ప్ర‌భుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోతోంది. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఉల్లంఘించి నిర్మాణ సంస్థ‌లు అపార్టుమెంట్లు నిర్మిస్తే ప‌రిస్థితి ఏమిటి?  ప్ర‌భుత్వం కోర్టుకి వెళితే ఇప్పడ‌ల్లా తేలే విష‌యం కాద‌ని అంద‌రికీ తెలుసు. ప‌విత్ర‌మైన స్థ‌లాన్ని స్పాల ఏర్పాటుకు కేటాయించడం వెనుక దురుద్దేశం ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు. పైగా ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏమిటి? అస‌లే స‌్టార్ హోట‌ళ్ల రాక‌తో తిరుప‌తిలో ఉన్న చిన్నాచిత‌కా హోటళ్ల‌కు గిరాకీ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త‌గా 5 స్టార్, 3 స్టార్ హోటల్స్ వ‌స్తే వారి బ‌తుకులు ఏం కావాలి? ఈ భూముల‌ను ముంతాజ్ హోటల్ కు ఎందుకు కేటాయించలేదు? 3 వేల కోట్ల విలువైన భూమి టూరిజం నుంచి తీసుకుని టీటీడీ స్థలం ఎందుకిచ్చారు?  దాని వెనుకా వందల కోట్లు చేతులు మారాయి. విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను అప్ప‌నంగా దోచిపెట్టే కార్య‌క్ర‌మం ముసుగులో వంద‌ల కోట్లు చేతులు మారుతున్నాయి.  

- భూకేటాయింపులు ర‌ద్దు చేయాల్సిందే?

అమ్మ‌వారి ఆల‌యానికి కూత‌వేటు దూరంలో ఉన్న ప‌విత్ర‌మైన స్థ‌లంలో ఇలాంటి నిర్మాణాలు చేప‌ట్టడం దారుణం. రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించిన‌ స్థలాలు రద్దు చేసే వరకు వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున పెద్ద‌ ఎత్తున పోరాటం చేస్తాం. వాణిజ్య సముదాయం క‌డుతున్న రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌కు ఎస్.ఆర్.ఓ రేటు ప్రకారం భూములు కేటాయించడం దారుణం. దేవుడంటే చంద్ర‌బాబుకి నిజంగా భ‌యం భ‌క్తి ఉంటే ఆల‌యానికి స‌మీపంలో ఉన్న స్థ‌లాల‌ను అప్ప‌నంగా హోటల్స్, స్పాల నిర్మాణాల‌కు ఇచ్చేవాడు కాదు. దీనివెనుక భారీ అవినీతి దాగి ఉందని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

 

Back to Top