అనంతపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలో ప్రశాంతత పూర్తిగా కరువైందని, రోజురోజుకు కబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ… 18 నెలల కూటమి పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎవరి ఆస్తులు ఎప్పుడు కబ్జా అవుతాయో, ఎవరు తమ పేరిట బదలాయించుకుంటారోనన్న భయంతో ప్రజలు ఆర్థిక భారం అయినా సరే తమ స్థలాలకు ఫ్రీకాస్ట్ కాంపౌండ్ వాల్స్ నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఇది నగరంలో కబ్జాలు ఏ స్థాయికి చేరాయో స్పష్టంగా చూపుతోందన్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? వీటి వెనుక ఉన్నవారు ఎవరో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో ఎవరైనా బిల్డింగ్ నిర్మించాలంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధి కార్యాలయంలో అనుమతి తీసుకోవాలని అధికారులే చెప్పడం దురదృష్టకరమని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని, అధికారులు శాశ్వతమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభివృద్ధిని మరిచి అసత్యాలతోనే కాలం గడుపుతున్నారని, ఎక్కడికి వెళ్లినా వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్పొరేటర్లపై బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కబ్జాలు, దౌర్జన్యాలు, ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, బెదిరింపులకు ఎవ్వరూ భయపడరని, గతంలో ఇలాంటి బెదిరింపులు చేసిన వారి పరిస్థితి ప్రజలకు తెలుసని హెచ్చరించారు. ఒకవైపు ‘ఫ్రెండ్లీ పోలీస్’ అని ఉన్నతాధికారులు చెబుతుంటే, మరోవైపు నగరంలో పోలీసు యంత్రాంగం మాత్రం అధికార పార్టీ చెప్పిందే వేదంగా పాటిస్తోందని మేయర్ విమర్శించారు. గుల్జార్‌పేటలో మురుగు కాలువ నిర్మాణం సందర్భంగా టీడీపీ జెండా కట్ట అడ్డుగా ఉందన్న కారణంతో తొలగించి, తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఘటనలో, అక్కడ ఉన్నారన్న నెపంతో స్థానిక కార్పొరేటర్ కుమారుడిపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు వెళ్లిన తమపై కూడా సీఐ దురుసుగా వ్యవహరించి అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఎన్ని దౌర్జన్యాలు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఫ్రెండ్లీ పోలీస్ అంటే అధికార పార్టీకి మాత్రమే ఫ్రెండ్లీనా? దౌర్జన్యాలు, కబ్జాలను ప్రోత్సహించడమేనా? అని ప్రశ్నించారు. నగర పాలక సంస్థ నిధులతో, తమ పాలకవర్గం ఆమోదించిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమిపూజలు చేసి తన ఫోటోలు వేసుకుంటూ, మరోవైపు వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏమీ జరగలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో నగర ప్రజలకు బాగా తెలుసన్నారు. గతేడాది అక్టోబర్ 2 నాటికి డంప్‌యార్డ్ బయో మైనింగ్ పూర్తవుతుందని ఎమ్మెల్యే చెప్పారని, సంక్రాంతి సమీపిస్తున్నా ఇప్పటికీ ఎందుకు పూర్తి కాలేదో, త్వరలో ఆధారాలతో బయటపెడతామని స్పష్టం చేశారు. టీడీపీ 18 నెలల పాలనలో ముస్లింలకు చేసింది ఏమి లేదని, స్మశానవాటిక కాంపౌండ్ వాల్ కూడా మున్సిపల్ నిధులతోనే నిర్మించామని తెలిపారు. ముగ్గురికి కండువాలు కప్పి ఐదు వేల మంది పార్టీలో చేరారని, ముస్లింలకు ఎంతో చేశామంటూ పవిత్రమైన టోపీ పెట్టుకుని ఎమ్మెల్యే అసత్యాలు చెబుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా అసత్యాలు మానుకుని నగర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ కూటమి పాలనలో దళితులకు రక్షణ కరువైందని, దళిత హోంమంత్రి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. 18 నెలల్లో నగరానికి చేసింది ఏమిటో ఎమ్మెల్యే చెప్పాలని ప్రశ్నించారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ హయాంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు ఇషాక్, శ్రీనివాసులు, రహంతుల్లా, కమల్ భూషణ్, కోఆప్షన్ సభ్యుడు శంషుద్దీన్, నాయకులు దాదు, రామచంద్ర, దాదా ఖలందర్, రియాజ్, మాబ్బాషా, ముక్తియర్, కాకర్ల శీనా తదితరులు పాల్గొన్నారు.