తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలానికి చెందిన ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన బొమ్మనహళ్ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరించారని, వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలపై దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ బలవంతంగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్నారని ఎంపీటీసీలు వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికను అధికార పార్టీ నేతలు దౌర్జన్య పద్ధతుల్లో గెలుచుకోవడం ప్రజాస్వామ్యానికి తీరని నష్టం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన వైయస్ జగన్, ఎన్నికల ప్రక్రియను ఈ విధంగా అపహాస్యం చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ ఘటనను ఎన్నికల కమిషన్, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నేతలకు హామీ ఇచ్చారు. అలాగే, ఎంపీపీ ఎన్నిక రోజు రాయదుర్గం వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి వివరాలను ఆయన కుమారుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన వైయస్ జగన్, పార్టీ కార్యకర్తలు, నాయకుల భద్రతే లక్ష్యంగా న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి, బొమ్మనహళ్ మండల ఎంపీటీసీలు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.