వైయస్ఆర్ జిల్లా : రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కడపలో ఇంచార్జ్ మంత్రి సబితా అధ్యక్షతన నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక ప్రశ్నలు సంధించారు. అయితే ఈ అంశంపై చర్చను కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టించారని వైయస్ఆర్‌సీపీ ఆరోపించింది. ఈ సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, డీఆర్సీ సమావేశం మొత్తం ఆత్మస్తుతికే పరిమితమైందని, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చే జరగలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి కీలక అంశాన్ని లేవనెత్తితే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. బాబు, రేవంత్ ఇద్దరూ కలిసి సీమ గొంతు కోశారు ‘‘రాయలసీమ ఎత్తిపోతలపై మాట్లాడితే పక్కదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసే రాయలసీమ గొంతు కోశారు. ఒకవైపు ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ సాగు, విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులు నిర్మించుకుంటూ పోతుండగా, మరోవైపు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఇప్పటికే రూ. 950 కోట్ల మేర పనులు పూర్తి చేశారు. వరద సమయంలో రోజుకు 3 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా తరలించే సామర్థ్యం ఉంది’’ అని అవినాష్ రెడ్డి వివరించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పర్యావరణ అనుమతులు రద్దయ్యాయని ఆయన ఆరోపించారు. పొత్తులో ఉన్న చంద్రబాబు ఆ అనుమతులు తీసుకురావడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదని, రేవంత్ రెడ్డితో కలిసి కుట్రపూరితంగా ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారని విమర్శించారు. ‘‘రాయలసీమకు హక్కుగా రావాల్సిన 111 టీఎంసీల నీరు ఇప్పటికీ అందడం లేదు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ఈ ప్రాజెక్ట్ నిరర్థకమని ఇరిగేషన్ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 800 అడుగుల లోతులోనూ నీరు తీసుకునే అవకాశం కలిగించే ఏకైక ప్రాజెక్ట్ ఇదే. అయినా దాన్ని నిర్లక్ష్యం చేయడం సీమ రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది’’ అని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకురావాలని, ఆ పనులను తక్షణమే ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ ప్రాజెక్ట్ అమలు అయ్యే వరకూ వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆగదు. రాయలసీమ రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించాలి’’ అని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.