కర్నూలు జిల్లా: తాను చంద్రబాబును కోరినందువల్లనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ వైయస్‌ఆర్‌సీపీనాయకులు మండిపడ్డారు. తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై తక్షణం చంద్రబాబు స్పందించి సమాధానం చెప్పాలని, క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లు రేవంత్‌తో చేసుకున్న ఒప్పందాల వివరాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రదేశాన్ని సందర్శించిన రాయలసీమకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు అక్కడే మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో 85 శాతం వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి కాగా.. ఆ తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా, పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రాయలసీమ వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆక్షేపించారు. పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి ఇన్నాళ్లు రాయలసీమ లిఫ్ట్‌ను పక్కన పెట్టేసిన చంద్రబాబు, ప్రజలను మభ్య పెట్టారని దుయ్యబట్టారు. కానీ, రేవంత్ వ్యాఖ్యలతో ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిన దగా, వంచన బట్టబయలైందని గుర్తు చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని, రాయలసీమ ప్రాంతానికి మేలు చేసే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చే బాధ్యత చంద్రబాబుదే అన్న వారు, వెంటనే ఆ పనులు మొదలుపెట్టకపోతే రైతులు, రైతు సంఘాలు, సాగునీటి రంగ మేథావులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..: వైయస్‌ఆర్‌సీపీ హయాంలోనే 85 శాతం పనులు పూర్తి :కాటసాని రాంభూపాల్‌రెడ్డి. పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు. – రాయలసీమలో కరవు శాశ్వత నివారణ కోసం నాడు సీఎం శ్రీ వైయస్ జగన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులు మొదలుపెట్టారు. వరద వచ్చినప్పుడు రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లలో నిల్వ చేయాలన్న లక్ష్యంతో పథకాన్ని చేపట్టారు. దానిపై తెలంగాణ నాయకులు అడ్డు చెప్పినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆయన గట్టి సంకల్పంతో ముందుకు సాగారు. ఏపీకి కేటాయించిన నీటిలోనే తీసుకుంటామని, పైగా వరద నీరు సముద్రంలో కలిసే బదులు వాడుకుంటే మంచిదని పలుమార్లు స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తీసుకుంటున్నట్లే, తాము కూడా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం వద్ద నీటిని తీసుకుంటే తప్పేమిటని ఆయన గట్టిగా నిలబడి, ప్రాజెక్టులో 85 శాతం పనులు పూర్తి చేశారు. అయితే ఆ ప్రాజెక్టు ముందుకుసాగితే జగన్‌గారికి మంచి పేరొస్తుందనే కుట్రతో చంద్రబాబు కొంతమంది తెలంగాణకు చెందిన నాయకులతో జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ)లో కేసులు వేయించి అడ్డుకున్నాడు. రాయలసీమ ప్రాంతానికి నష్టం జరిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి చంద్రబాబు చేసిన కుట్రను ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ క్షమించరు. అమరావతి మీదున్న శ్రద్ధ రాయలసీమ మీద లేదా? :ఎస్వీ మోహన్‌రెడ్డి. పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. – రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రాయలసీమ కరువుకి శాశ్వత పరిష్కారం చూపిన విజనరీ వైయస్ జగన్ గారు. ఏపీ ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే, చంద్రబాబు కేసులతో అడ్డుకునే కుట్రలు చేస్తున్నాడు. ఇంకోపక్క ఎగువన ఉన్న తెలంగాణలో ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే వాటిపైనా చంద్రబాబు నోరు మెదపడం లేదు. పక్క రాష్ట్రాల్లో నిర్మాణం జరుపుకున్న చాలా ప్రాజెక్టులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగినవే. ఏపీ ప్రజలకు నష్టం జరుగుతున్నా ఆయన అభ్యంతరం చెప్పడమే ధీమాతోనే ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. తన స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్న చంద్రబాబు, రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతున్నా పట్టించుకోవడం లేదు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్టును ఆపేయించానని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలే ఈ కుట్రలకు నిదర్శనం. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు తక్షణం స్పందించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెంటనే రాయలసీమ లిఫ్ట్ పనులు తిరిగి మొదలు పెట్టాలి. రెండు కళ్ల సిద్ధాంతంతో రాయలసీమను నాశనం చేసే కుట్ర :సాకె శైలజానాథ్. మాజీ మంత్రి. – ఏనాడూ సాగునీటి ప్రాజెక్టుల గురించి, రైతు సంక్షేమం గురించి ఆలోచించని చంద్రబాబుని అపర భగీరథుడు అని పొగుడుతున్న రాయలసీమ తెలుగుదేశం నాయకులు.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించేలా ఒత్తిడి తేవాలి. చంద్రబాబు మరోసారి తన రెండు కళ్ల సిద్ధాంతంతో రాయలసీమ ప్రాంతాన్ని నాశనం చేసే కుట్రకు తెర లేపారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు. ప్రాజెక్టు పూర్తయితే వైయస్ జగన్ కి మంచి పేరొస్తుందనే ఆలోచనతోనే పక్కన పెట్టేశాడు. రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేయొచ్చు కదా?. :దారా సుధీర్. నందికొట్కూరు నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్. – రాయలసీమ రైతుల కన్నీటిని తుడిచే అద్భుతమైన ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే.. 2020, మే 5న ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి, వేగంగా కొనసాగించి 85 శాతం పూర్తి చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, కేవలం పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి ఆ ప్రాజెక్టును కావాలనే పక్కన పెట్టేశారు. అది రాయలసీమ ప్రాంతానికి ఉరి బిగించడమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్‌రెడ్డితో కలిసి ఈ ప్రాజెక్టును ఆపాలని కుట్ర చేశారు. నీరు లేకపోతే రాయలసీమకు పరిశ్రమలు కూడా రావు :పి.రామసుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ. – పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన తర్వాతనే మైలవరం రిజర్వాయర్‌కి నీరు చేరింది. దివంగత మహానేత వైయస్సార్ తీసుకున్న నిర్ణయంతో రాయలసీమ రూపురేఖలు మారిపోయాయి. రాయలసీమకు సమృద్ధిగా నీరు రాకపోతే సాగునీటి రంగమే కాదు, పరిశ్రమలు కూడా రావు. పరిశ్రమలు రాకపోతే ఉపాధి అవకాశాలు లేక యువత నష్టపోతుంది. వృథాగా సముద్రంలో కలిసిపోయే నీటిని రాయలసీమ వాడుకుంటే తప్పేంటి?. రాయలసీమకు మేలు జరిగితే చంద్రబాబుకి నచ్చదు :శివరామిరెడ్డి. ఎమ్మెల్సీ. – పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచుతుంటే చంద్రబాబు ఆనాడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ధర్నాలు చేయించాడు. రాయలసీమకు మేలు జరుగుతుంటే అడ్డుకోవాలని ఆనాడే కుట్ర పన్నాడు. నాడు జగన్‌గారు రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపడితే, తెలంగాణ టీడీపీ నాయకులతో ఎన్జీటీలో కేసులు వేయించి అడ్డుకున్నారు. రాయలసీమకు మేలు చేసే ఏ ఒక్క ప్రాజెక్టు చంద్రబాబుకు నచ్చదు. ఆ జీఓ అమలు చేయమన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. :శిల్పా చక్రపాణిరెడి. మాజీ ఎమ్మెల్యే. – 2004లో ముఖ్యమంత్రి కాగానే రాయలసీమలో ప్రాజెక్టులను శరవేగంగా మొదలుపెట్టి పూర్తి చేసిన రైతు బాంధవుడు డాక్టర్ వైయస్సార్. ఆయన చేసిన మేలును ఇప్పటికీ రాయలసీమ ప్రజలు మర్చిపోరు. దివంగత వైయస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచితే, ఆయన తనయుడిగా జగన్‌గారు ఆ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచారు. రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టను చేపట్టి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే దాదాపు 85 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయకపోవడం, చంద్రబాబు రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడమే. చివరకు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు కేటాయించేలా వైయస్సార్ తీసుకొచ్చిన జీవోను అమలు చేయమని నంద్యాలకు వచ్చినప్పుడు చంద్రబాబుని అడిగినా ఆయన పట్టించుకోలేదు. జగన్‌గారికి పేరొస్తుందనే రేవంత్‌తో కలిసి కుట్ర :శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే. – చంద్రబాబు ఏనాడూ రైతుల గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ఆయన జీవితంలో ఏ ఒక్క ప్రాజెక్టును మొదలుపెట్టి పూర్తి చేసింది లేదు. ఓటుకు కోట్లు కేసుకు భయపడిపోయి శ్రీశైలంలో నీటి వాటాను తెలంగాణకు తాకట్టు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు. తెలంగాణలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే ముఖ్యమంత్రిగా ఉండి కనీసం నోరు మెదపడం లేదు. వైయస్ జగన్ గారికి మంచి పేరువస్తుందనే దుర్మార్గ ఆలోచనతో రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసేలా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయించాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో చంద్రబాబు చేసిన కుట్రలు బహిర్గతం అయ్యాయి. రాయలసీమ ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి :కల్పలతా రెడ్డి. ఎమ్మెల్సీ. – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తక్షణం స్పందించాలి. క్లోజ్డ్ రూమ్ మీటింగ్‌లో చేసుకున్న ఒప్పందాలు ప్రజలకు చెప్పాలి. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసిన చంద్రబాబు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అదే ప్రాంతంలో పుట్టినా ఆయన, ఆ ప్రాంతంపై కుట్రలు ప్రదర్శిస్తున్నారు.