‘గీతం’ నిబంధనలను ఉల్లంఘించింది

కేంద్రమంత్రి రమేష్‌ పోఖ్రియల్, యూజీసీ చైర్మన్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

విశాఖ: గీతం యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించిందని యూజీసీ చైర్మన్‌ డీ.పీ.సింగ్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు.  గీతం డీమ్డ్‌ టు బి వర్సిటీ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, భూమి యాజమాన్య హక్కు పత్రాల సమర్పణలో వాస్తవాలు దాచారని, యూజీసీకి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ భూమిని కూడా చూపారని లేఖలో పేర్కొన్నారు. గీతం యూనివర్సిటీలో ఫార్మసీ, మెకానికల్‌ విభాగాలతో పాటు సివిల్‌ విభాగం నిర్మాణాల్లో కొంత భాగం ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయని, గీతం డీమ్డ్‌ టు బి యూనివర్సిటీగా ప్రజలకు వివరాలను బహిర్గతం చేయాలన్న నిబంధన పాటించలేదన్నారు. గీతం భూములకు సంబంధించిన డాక్యుమెంట్‌ ఆధారాలను సంబంధిత అధికారులు పొందుపరచలేదని పేర్కొన్నారు.

అదే విధంగా విద్యా విధానంలో లోపాలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ర్యాకింగ్‌ విషయంలో గీతం నిబంధనలు తుంగలో తొక్కిందని, తప్పుడు సమాచారంతో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంక్‌ పొందినట్టు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరులో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ల విషయంలో నిబంధనలు పాటించలేదని లేఖలో పేర్కొన్నారు. గీతం ఉద్యోగ నియామకాల్లో రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయలేదని, డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ గీతం డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్స్‌ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులు నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేషన్‌ తీసుకునే విధంగా ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు.  
 

Back to Top