విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్ధను పూర్తిగా నీరుగార్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు అందించే మధ్యాహ్నభోజన పథకం నిర్వహణలో నిలువెత్తు ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఫలితంగా గత రెండు నెలలుగా ప్రతిరోజూ విద్యార్ధులు అస్వస్ధతకు గురైన వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయన్నారు. ఈ రెండు నెలల కూటమి ప్రభుత్వ కాలంలో దాదాపు 2000 మంది అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. దీన్ని కూడా గత ప్రభుత్వానికే అంటగడతారా అని బొత్స సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక సంఘటన జరిగిన తర్వాత సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటివి పునరావవృత్తం కాకుండా అప్రమత్తం అయ్యేవారని.. కానీ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమవడంతో ఈ పరిస్ధతి దాపురించిందని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యకర్తలు, నేతలు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని బొత్స విజ్ఞప్తి చేశారు. అచ్యుతాపురం సెజ్ ఫార్మాకంపెనీలోని జరిగిన ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారిని ఆదుకుంటామని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇవాళ బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించినట్టు బొత్స సత్యనారాణయణ తెలిపారు. ఇందులో భాగంగా ప్రమాదంలో చనిపోయిన యలమంచలి, పాయకరావుపేట ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష అందజేశామన్నారు. మిగిలిన జిల్లాల్లో బాధిత కుటుంబాలకు కూడా పార్టీ నేతలు స్వయంగా వెళ్లి ఆర్దిక సాయం చేయనున్నట్లు బొత్స వెల్లడించారు. ఈ ఘటనలో 17 మంది చనిపోగా, గాయపడిన 38 మందితో సహా మొత్తం 55 మందికి రూ.1 కోటి 23 లక్షలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సాయం చేస్తున్నామని తెలిపారు. గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ బాలికల హాస్టల్ ఉదంతం వెలుగులోకి వచ్చి మూడు రోజులు గడుస్తున్నా… ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. హాస్టల్లో ఉంటున్న అమ్మాయిల తల్లిదండ్రుల క్షోభ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని నిలదీశారు. జరిగిన ఘటనపై తక్షణమే విచారణ చేసి… భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన ఎస్ఓపీ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వీటన్నింటిపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. విద్యాశాఖమంత్రి లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా సందర్శించిన కస్తూరిబా పాఠశాల ఫోటోలు చూస్తే… వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత అర్ధం అవుతుందన్నారు.