తాడేపల్లి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరా ఘటన చోటు చేసుకుందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రెస్‌మీట్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా రంగం అస్తవ్యస్తం అయిందన్న ఆమె, ఎక్కడికక్కడ పర్యవేక్షణ కొరవడిందని, దీంతో పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఘటన అనైతికం అన్న ఆమె, వాష్‌రూమ్‌ల్లో హిడెన్ కెమెరాలపై విద్యార్థినిలు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని, ఘటన వెలుగులోకి వచ్చినా, ప్రభుత్వం ఏ మాత్రం సక్రమంగా స్పందించడం లేదని, అసలు అలాంటిదేమీ లేదంటూ కితాబునివ్వడం అత్యంత హేయమని వరుదు కళ్యాణి ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రెస్‌మీట్. హిడెన్ కెమెరాలపై విద్యార్థినిలు ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం తొలి నుంచి, వారిని కట్టడి చేస్తూ కాలేజీ యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నం చేస్తోందని వరుదు కళ్యాణి మండిపడ్డారు. గత 29వ తేదీన హాస్టల్ వాష్‌రూమ్‌ల్లో షవర్లు రిపేర్ చేస్తుంటే, హిడెన్ కెమెరాలు బయట పడ్డాయని, వాటిపై ఫిర్యాదు అందినా, ఏ మాత్రం దర్యాప్తు చేయని పోలీసులు, అక్కడ అలాంటిదేమీ లేదని 30వ తేదీన ప్రకటించారని ఆమె గుర్తు చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో విద్యార్థినిల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా, వారందరినీ బలవంతంగా ఇళ్లకు పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు తమను కూడా హాస్టల్‌లోకి అనుమతించక పోవడాన్ని వరుదు కళ్యాణి తప్పు బట్టారు. ప్రభుత్వ వైఖరిని నిలదీసిన ఆమె, ఇకనైనా ఇలాంటి సంఘటలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ మొత్తం ఘటనకు కారణమైన విద్యార్ది తన సోషల్ మీడియా అకౌంట్లో పవన్ కళ్యాన్ ఫోటోలు ఉంటే, వాటిని మార్ఫింగ్ చేసి తమ పార్టీపై నెట్టే ప్రయత్నం చేశారని కళ్యాణి ఆగ్రహించారు. ఆ విద్యార్థినిలకు న్యాయం జరిగే వరకు పారాడతామని వరుదు కళ్యాణి ప్రకటించారు.