రుషికొండ రిసార్ట్స్‌పై నాడు కూటమి నేతల విషప్రచారం

వైయస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతలు

అవే నిర్మాణాలకు ప్రభుత్వ భవనాలని నేడు జీవో ఎలా ఇచ్చారు.?

గత ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారానికి క్షమాపణలు చెప్పాలి

మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్

విశాఖపట్నం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా 
అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖలో ఈవెంట్లు... అమరావతిలో పేమెంట్లు

స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై కూటమి నేతల ద్వంద్వ వైఖరి

వేలాది కార్మికులు రోడ్డున పడ్డా నోరుమెదపని చంద్రబాబు & కో

ఎన్నికల ముందు స్టీల్‌ ప్లాంట్ పై రామ్మోహన్ నాయుడు ప్రగల్భాలు

ఇప్పుడు కేంద్రమంత్రిగా నోరు మెదపలేని దౌర్భాగ్యం

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

విశాఖపట్నం:  విశాఖ నగరానికి తలమానికంగా గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్‌పై వైయస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతలు కూసిన కూటమి నేతలు ఈరోజు వాటిని ప్రభుత్వ భవనాలుగా పేర్కొంటూ జీఓ ఎలా జారీ చేశారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రిషికొండ రిసార్ట్స్‌పై చంద్రబాబు, పవన్, లోకేష్‌లు ఎలాంటి దుష్ప్రచారం చేశారో మరిచిపోయారా అని నిలదీశారు. ప్రభుత్వ పరంగా నిర్మించిన ఈ నిర్మాణాలపై సిగ్గు లేకుండా, ఇష్టారాజ్యంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు వాటిని ప్రభుత్వ భవనాలే అంటూ సమర్థించుకుంటున్నారని, గతంలో తాము చేసిన విష ప్రచారానికి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..

గతంలో మా ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ రిసార్ట్స్‌ కూటమి నేతలకు పొలిటికల్ టూరిజం డెస్టినేషన్ గా మారింది. ఏ పార్టీ నాయకులు వచ్చినా ఆ రిసార్ట్స్ టూర్ వేసి, బయట సెల్ఫీలు తీసుకుంటూ, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురదచల్లడం అలవాటుగా చేసుకున్నారు. స్థానిక శాసనసభ్యుడు దగ్గర నుంచి, మంత్రులు, రాష్ట్రంలో కూటమి పార్టీల అధినాయకులు, శాసన సభ్యులందరికీ ఈ రిసార్ట్స్‌ను అడ్డం పెట్టుకుని వైయస్ జగన్‌పై బుదరచల్లే కార్యక్రమాన్ని కొనసాగించారు.

● రిసార్ట్స్‌ లో పైభాగం ఊడిందా? కట్ చేసి పడేశారా?

 ఆ రోజు మా పార్టీ విధానం ప్రకారం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి, ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి పరిపాలన చేస్తామని చెప్పాం. ఒకవేళ విశాఖపట్నం నుంచి పాలన చేయాల్సి వస్తే అనుకూలమైన నిర్మాణాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆలోచన చేశారు. ముగ్గరు అధికారుల కమిటీ నిర్ణయం మేరకు రుషికొండ రిసార్ట్స్ ముఖ్యమంత్రికి, కాపులుప్పాడలో ప్రధాన పరిపాలన భవనాల నిర్మాణం చేస్తే బాగుంటుందని సిఫార్స్‌ చేశారు. దానికనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మేం అధికారం కోల్పోయాం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరగా వైయస్ జగన్‌పై తప్పుడు ప్రచారం చేయడమే ఎజెండాలో పాలన సాగిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ రుషికొండ రిసార్ట్స్‌ అంతా తిరిగారు. ఎక్కడో ఒకచోట సీలింగ్ బోర్డు పడిందని హంగామా చేశారు. వారు మీడియాకు ఇచ్చిన ఫోటోలను పరిశీలిస్తే... సీలింగ్ ఆయనకు ఓ ఏడెనిమిది అడుగులు దూరంలో ఉంటే... ఊడిన సీలింగ్ పెచ్చులు మాత్రం ఆయన కాళ్ల దగ్గర కనిపిస్తున్నాయి. అది పడిపోయిందా? లాగి పడేశారా ? స్పష్టంగా ఊడిపోయిన భాగంలో ఎవరో కట్ చేసినట్లు పైన కనిపిస్తోంది.. కింద మరో వ్యక్తి దీన్నంతా వీడియో షూట్ చేస్తున్నాడు. అంతా సినిమాటిక్ రికార్డింగ్. ప్రచారం కోసమే ఇది వారు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పనేనని స్పష్టమవుతుంది.

● రూ.200 కోట్ల పూరిగుడిసెలో చంద్రబాబు

రుషికొండ ఇంద్రభవనం అని, వైయస్ జగన్ ప్యాలెస్ అని ఇవన్నీ ఆయన సొంత భవనాలని ఎన్నికల ముందు నుంచి కూటమి నేతలు దుష్ర్పచారం చేస్తూనే ఉన్నారు. నేటి వరకు కేవలం రాజకీయ అవసరాల కోసమే ఈ భవనాన్ని వాడుకుంటున్నారు. రూ.200 కోట్లతో చంద్రబాబునాయుడు గారు జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు  కట్టుకుంటే మాత్రం వారికి అదొక చిన్న పూరిగుడిసెగా కనిపిస్తోంది. వారి దృష్టిలో అమరావతిలో చంద్రబాబు కొత్తగా 5 ఎకరాల్లో కడుతున్న రాజసౌధాలు పేదలు నిర్మించుకునే గవర్నమెంట్ స్కీమ్ ఇళ్ళు. కానీ వైయస్ జగన్ తాడేపల్లి సొంతగా ఇల్లు నిర్మించుకుంటే మాత్రం అది ప్యాలెస్, కూటమి నేతలంతా దానిపై నిత్యం ఏడవడమే పనిగా పెట్టుకున్నారు. గడిచిన కాలంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎప్పుడైనా ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో జనం మెచ్చుకునేలా కట్టిన ఓ మంచి నిర్మాణాన్ని చూపగలరా..? రూ.5 వేల కోట్లతో అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టారు. అవి ఎలా ఉన్నాయో.? వర్షం పడితో, ఎలా పైకప్పు నుంచి నీరు కారి జలమయం అవుతున్నాయో ప్రజలందరూ చూశారు. నిన్న పవన్ కళ్యాణ్ వారి శాసనసభ్యులు రుషికొండ రిసార్ట్స్‌కు వెళ్లి అబ్బురపడ్డారు. ఆ భవనాలు చూసిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి వినియోగించుకోవాలా? ఆయన కుమారుడు వాడుకోవాలా? లేక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాడుకోవాలా అన్నది తెలియని పరిస్థితుల్లో ఆ భవనాల కోసం పోటీ పడుతున్నట్టు వారి వైఖరి కనిపించింది. కానీ ముందే ఆ భవనం మీద తప్పుడు ప్రచారం చేశాం కాబట్టి వాటిని వినియోగించుకుంటే ఎక్కడ బూమరాంగ్ అవుతుందేమోనన్న భయంతో, రుషికొండ భవనాల వద్దకు వెళ్ళి ఫోటోలు తీసుకుని, యథాప్రకారం గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిన్న సాయంత్రం రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలో తేల్చడానికి ముగ్గురు మంత్రుల ఉపసంఘాన్ని నియమిస్తూ జీవో విడుదల చేసింది. అందులో చాలా స్పష్టంగా రుషికొండలో నిరుపయోగంగా ఉన్న రిసార్ట్స్‌ను ఎలా వినియోగించుకోవాలో తేల్చడానికి మంత్రివర్గ ఉపసంఘం నియామకం రాని రాశారు. 

● విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఏం చెప్పారో మరిచిపోయారా..?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 1200 మంది రెగ్యులర్ ఉద్యోగులతో వీఆర్ ఎస్ పెట్టించారు. నెలకు 150 మంది పదవీవిరమణ పొందుతుండగా... డిసెంబరులో మరో 1000 మందితో వీఆర్ ఎస్ చేయించే ప్రయత్నం జరుగుతోంది. 32 విభాగాలను స్టీల్ ప్లాంట్ లో ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పిలిచి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతోంది. అలా ఆసక్తి చూపిన సంస్థలకు నిన్న స్టీల్ ప్లాంట్ లో పోలీసు రక్షణతో ప్లాంట్ అంతా చూపించారు. కార్మికులు ఎవరైనా మాట్లాడితే వారిని ఇబ్బంది పెట్టడంతో పాటు సస్పెండ్ చేస్తున్నారు. పోరాట కమిటీ నిన్న ర్యాలీకి పిలుపునిస్తే  మీకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డగించారు. మరి స్టీల్ ప్లాంట్ మీద చంద్రబాబు, షాడో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు. తిరిగి పవన్ కళ్యాణ్ ఇవాళ సూక్తులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారో చూడండి. ఆ రోజు విశాఖ ఉక్కు మన ఆత్మ అంటూనే... మన ఆత్మను అమ్మితే ఉపేక్షిస్తారా అని అడుగుతూనే అందరం కలిసి కాపాడుకుంటాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు.  ఆ రోజు ఉక్కు గురించి గొంతు చించుకుని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ అవకాశం ఉండి  ఏం చేస్తున్నారు? 

● టీడీపీ ఎంపీలతో రాజీనామా ఎందుకు చేయించరు..?

కేంద్రంలో టీడీపీ సహకారంతో ప్రభుత్వం నడుస్తుంటే.. మీరు ప్రయివేటీకరణ చేస్తే మా ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటానని చంద్రబాబు హుకుం జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చంద్రబాబు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు.? రూ.2.50 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్, భూములను కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? మీకున్న లాలూచీ ఏమిటి ?  మీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు కొత్తగా పెడుతున్న ప్రయివేటు స్లీల్ ప్లాంటుకు గనులు కావాలని అడుగుతారే తప్ప, లక్షలాది మంది ఆధారపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయించండి అని అడగలేని స్ధితిలో మీ పార్టీ పార్లమెంటు సభ్యులు ఉన్నారంటే మీ చేతకాని తనం కాకపోతే మరేంటి  ?

● వైజాగ్‌లో ఈవెంట్లు - అమరావతిలో పేమెంట్లు 

మీ ప్రచార కార్యక్రమాలకు, మీరు బస్సులు ఎక్కి దిగడానికి, హోటళ్లలో సమావేశాలు పెట్టుకోవడానికి, మీ ప్రచార కార్యక్రమాలకు మాత్రమే విశాఖపట్నం కావాలి. మీ ఈవెంట్లకు విశాఖపట్నం, పేమెంట్లకు మాత్రం అమరావతి. విశాఖపట్నం ఏం పాపం చేసింది. విశాఖ పట్నానికి చెందిన సీనియర్ మంత్రి దీనిపై ఏం మాట్లాడడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ బహిరంగ సభ పెట్టారు.. కార్మికులకేం సమాధానం చెప్తారు? గతంలో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ ప్రతినిధులను చేతకాని వ్యక్తులు, మీరు పార్లమెంటులో ప్లకార్డు పట్టుకోగలరా ? అని అడిగారు. ఇప్పుడు ఎవరు చేతకాని వారు పవన్ కళ్యాణ్ గారు ? మీ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు పార్లమెంటులో ఉన్నారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీ భాగస్వామ్య పార్టీలకు చెందిన వారే కేంద్రంలో ఉన్నారు. ఈ ఏడాదిలో పలు దఫాలు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. ఎప్పుడైనా మీరు, మీ భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటులో ఒక్క ప్లకార్డు అయినా ప్రదర్శించారా  ? ఎవరి చేతకాని దద్దమ్మలు  ? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రంతో మాట్లాడలేం  ? వారు లాజిక్కుతో మాట్లాడతారు సమాధానం చెప్పలేమని చెబుతున్నారు. మరి ఆ రోజు ఎన్నికల అవసరాల కోసం, అధికారం కోసం ప్రజలకు హామీ ఇచ్చారా  ? ప్రజలను గమనించమని కోరుతున్నాను.

● కేంద్రమంత్రి గారు ఇప్పుడేం చెబుతారు ? 

2021 జనవరిలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి, 2025 ఆగష్టు 30 వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా స్టీల్ ప్లాంట్ మీద మా విధానంలో మార్పు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు మా పార్టీ ఎప్పుడూ వ్యతిరేకతమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్న కె రామ్మోహన్ నాయుడు ఆ రోజు ఎలా గొంతు చింపుకున్నారో చూస్తే... వాస్తవాలు అర్ధం అవుతాయి. ఆ రోజు అమ్మడానికి వారెవరు, కొనడానికి వీరెవరు అని గొంతు చించుకున్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్రమంత్రిగా ఏ ఏసీ రూముల్లో ఉన్నారో సమాధానం చెప్పాలి  ? ఇవాళ  ఉత్తరాంధ్రా ప్రాంతంలో అతిపెద్ద పరిశ్రమగా ఉన్న స్టీల్ ప్లాంట్ కు కష్టం వస్తే.. కేంద్రంలో మీరు, రాష్ట్రంలో మీ బాబాయి మంత్రులుగా ఉండి బంట్రోతు ఉద్యోగం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు కష్టం వస్తే ఆ రోజు అరిచినట్లు ఇవాళ ఎందుకు గొంతు రావడం లేదు.

● వైయస్ఆర్‌సీపీదీ ఒక్కటే నినాదం.. 

ఇదంతా ముందుగానే గ్రహించి ఆ రోజే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే  ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను, స్టీల్ ప్లాంట్ కార్మికులనుద్దేశించి.. మీరు కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే.. ప్రయివేటీకరణకు ఓటేసినట్లే అని చెప్పారు. మాకు బాధ్యత ఉంది కాబట్టే...  ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం, ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడి ఉద్యోగం కూడా పోకుండా చూసుకున్నాం. జీతాలు, ఇంక్రిమెంట్లు అంపకుండా చూసుకున్నాం. వీఆర్ ఎస్ లు కూడా లేవు. కానీ ఇవాళ  స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో రూ.50 పైసలు విద్యుత్ యూనిట్ ధర రూ. 8,9 చేశారు. ఆ రోజు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒప్పుకోలేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాలేదు.  అందుకే కేంద్రం వెనుకడుగు వేసింది. ఐదేళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగలేకపోవడానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రే అన్న విషయం గుర్తుపెట్టుకొండి అని ఆ రోజే చెప్పారు. గాజువాకలో టీడీపీకి ఓటు వేస్తే.. ప్రయివేటీకరణకు ఆమోదం తెలిపిన ఎన్టీయేకు ఓటు వేస్తే.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరు ఆమోదం తెలిపినట్టేనని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రయివేటీకరణ ఆగాలంటే వైయస్ఆర్‌సీపీకి ఓటేయాలని చెప్పారు. 

ఎన్నికల తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా చాలా స్పష్టంగా జనవరి 17 2025 నాడు చెప్పారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం 2020-21 లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు వారి అవసరాలకు మాత్రమే విశాఖపట్నం కావాలి తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది అంటే మాత్రం స్పందించరు. అందుకే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెబుతోంది.  స్లీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మా పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలో.. మాతో కలిసివచ్చే పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులను కలుపుకుని పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించబోతున్నాం. తద్వారా కార్మికులకు, ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులు, భూములిచ్చిన నిర్వాసితులకు అండగా నిలబడుతూ.. ప్రయివేటీకరణ జరగకుండా బాధ్యత తీసుకుంటామని అమర్నాథ్ స్పష్టం చేశారు.

Back to Top