తాడేపల్లి: రాష్ట్రంలోని పలు గురుకుల విద్యా సంస్థల్లో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థులవుతున్నా.. ప్రభుత్వ చర్యలు శూన్యం అని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక, విద్యా రంగం అస్ధవ్యస్తం అయిందని, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో నానాటికీ కలుషిత ఆహారం తీవ్రమవుతోందని, అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదని ఆయన ఆక్షేపించారు. పేద విద్యార్థుల జీవితాలను ప్రభుత్వం ఫణంగా పెడుతోందన్న ఆయన, అన్నింటా విద్యా శాఖ మంత్రి అత్యంత దారుణంగా విఫలమయ్యారని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి సర్కార్ కేవలం కక్ష సాధింపు, విపక్ష నాయకులను వేధించడం ఇలా డైవర్షన్ పాలిటిక్స్‌కే పరిమితమైందని మాజీ ఎమ్మెల్యే ఆక్షేపించారు. ఇంకా ప్రై వేట్ కాలేజీల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహించారు. ఎన్నికల ముందు ఎన్నో అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు ఆ హామీల ఊసే లేదని గుర్తు చేశారు. పిల్లల కోసం గతంలో జగన్‌గారు అమలు చేసిన పథకాలు కూడా అమలు చేయడం లేదని చెప్పారు. హాస్టల్స్‌లో గత ప్రభుత్వం చక్కటి మెనూ ఇస్తే ఇప్పుడు ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ.. అక్కడా ఇక్కడా అని కాకుండా.. అన్ని చోట్లా ఇదే పరిస్ధితి నెలకొందన్నారు. ఇటీవల పలు హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చోటు చేసుకున్న ఘటనలను కైలే అనిల్‌కుమార్ వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 79 మంది విద్యార్ధులు అస్వస్ధతకు గురయ్యారని, జూన్ 27న వైఎస్‌ఆర్ జిల్లా ముద్దనూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారం తిని ఏడుగురు విద్యార్ధులు అస్వస్ధతకు లోనయ్యారని, జులై 15న చిత్తూరు జిల్లా నాయుడుపేట గురుకుల పాఠశాలలో 139 మంది విద్యార్ధులు కలుషిత ఆహారంతో అస్వస్థతకు లోనయ్యారని, నంద్యాలలో కూడా ఇదే జరిగిందని కైలే అనిల్‌కుమార్ వెల్లడించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 750 మందికి పైగా అస్వస్ధతకు గురికాగా, ఈనెల 19న అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషిత ఆహారంతో 30 మంది చిన్నారులు అస్వస్ధతకు గురై, ముగ్గురు చనిపోయారని, ఈనెల 21న చిత్తూరు అపోలో కాలేజీలో కూడా అదే పరిస్ధితి కొనసాగిందని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. ఇంకా.. ఈ నెల 25న బాపట్ల సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ కేంద్రీయ విద్యాలయంలో ప్రయోగం వికటించి 25 మంది విద్యార్ధులు అస్వస్ధతకు గురి కాగా, 27న శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి మహిళా రెసిడెన్షియల్ కాలేజ్‌లో ఎలుకలు కరవడంతో ఐదుగురు విద్యార్ధులు అస్వస్ధతకు గురయ్యారని, ఈనెల 28న తాళ్ళూరు హైస్కూల్ విద్యార్ధులకు కుళ్ళిన కోడిగుడ్లు పంచారని, అదే రోజు నాయుడుపేట బీఆర్ అంబేద్కర్ బాలుర గురుకల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 15 మంది అస్వస్ధతకు గురయ్యారని తెలిపారు. తాజాగా, ఏఎస్‌ఆర్ జిల్లా జామిగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల 79 మంది విద్యార్ధులు అస్వస్ధతకు గురయ్యారని కైలే అనిల్‌కుమార్ వివరించారు.