పూర్వపరాలు తెలుసుకోకుండా ఎలా వచ్చారు..?

కోదండరామ్, హరగోపాల్‌కు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ ప్రశ్న

అమరావతి అవినీతి గురించి ఢిల్లీలో మేధా పాట్కర్‌ను కలవండి

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆరాటం

అమరావతి రైతులందరినీ సీఎం వైయస్‌ జగన్‌ అక్కున చేర్చుకున్నారు

చంద్రబాబు అనుకునే అమరావతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వాటా ఎంత..?

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమే వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యం

అమరావతిని అభివృద్ధి చేయమని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు

తాడేపల్లి: చంద్రబాబు నాయుడు బినామీల రాజధాని ఎన్నాళ్లు కొనసాగించాలని చూసినా అది జరిగేపని కాదని, మూడు ప్రాంతాల అభివృద్ధి వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ నందిగం సురేష్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు పిలవగానే పేరంటానికి వచ్చినట్టుగా అమరావతి 900 రోజుల సభకు వచ్చిన కోదండరామ్, హరగోపాల్‌.. అసలు అమరావతిలో ఏం జరిగిందో పూర్వపరాలు పరిశీలించారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు కట్టిన బినామీల రాజధానిని కోదండరామ్, హరగోపాల్‌ పరిశీలించాలని సూచించారు. లేదంటే ఢిల్లీకి వెళ్లి మేధా పాట్కర్‌ను కలిస్తే అమరావతిలో చంద్రబాబు చేసిన అవినీతి గురించి క్షుణ్ణంగా వివరిస్తారని సలహా ఇచ్చారు. నలుగురు రైతులు, బినామీలను అడ్డుపెట్టుకొని రియల్‌ ఎస్టేట్‌ కోసం చేస్తున్న ఆరాటం తప్ప.. నిజంగా అమరావతి రైతులకు జరిగిన నష్టమేమీ లేదన్నారు. అమరావతి  రైతులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అక్కున చేర్చుకున్నారని, కచ్చితంగా వారికి న్యాయం చేస్తారన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఇలాంటి పాలన లేదని అమరావతి 900రోజు దీక్షకు వచ్చిన మేధావులు ఉంటున్నారని, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా సీఎం వైయస్‌ జగన్‌.. సంక్షేమ పథకాల సాయం డైరెక్ట్‌గా అందిస్తున్నారని, సామాజిక న్యాయం పాటిస్తున్నారని దేశమంతా ఇదే మాట చెప్పుకుంటుందని స్పష్టంచేశారు. 

పేదలకు డబ్బులు ఇస్తే సోమరులు అవుతారని మాట్లాడుతున్న చంద్రబాబు లాంటి వ్యక్తి నడుపుతున్న అమరావతి 900 రోజుల దీక్షకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన హరగోపాల్, కోదండరామ్‌కు అమరావతిలో ఏం జరిగిందో తెలుసా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేదలకు 53 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. చంద్రబాబు లాంటి వ్యక్తులు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. అదే విధంగా పేద వర్గాల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదువును అడ్డుకున్నాడని ధ్వజమెత్తారు. ఇవన్నీ తెలుసుకోకుండానే చంద్రబాబు పిలవగానే పేరంటానికి వచ్చినట్టుగా వచ్చారా..? అమరావతి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు ఏం చేశారు..? అని ఎంపీ నందిగం సురేష్‌ ప్రశ్నించారు.

అమరావతిలో జరిగిన అవమానాలు, బాధల గురించి తెలియాలంటే.. కోదండరామ్, హరగోపాల్‌ ఢిల్లీలో మేధా పాట్కర్‌ను కలవాలని సూచించారు. మేధాపాట్కర్‌ అమరావతిని విజిట్‌ చేసి చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను మీడియాకు వివరించారని గుర్తుచేశారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి, తన పార్టీ నాయకులకు లాభపడే విధంగా అమరావతిని నిర్మించుకున్నాడని, పేద రైతులను నట్టేట ముంచాడని ధ్వజమెత్తారు.  

అమరావతిని మర్చిపోయారని, అభివృద్ధి చేయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా చెప్పలేదని, అన్ని ప్రాంతాలు బాగుండాలనే కోరుకునేదాంట్లో ముందుంటామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఏ హక్కులు ఉన్నాయో.. వైయస్‌ జగన్‌కు కూడా ముఖ్యమంత్రి అయ్యాక అవే హక్కులు వచ్చాయన్నారు.  అభివృద్ధి ఒక్కేచోట ఉండాలని చంద్రబాబు కోరుకున్నారు. అభివృద్ధి అంటే రాష్ట్రమంతా వ్యాపించాలి. రాష్ట్రం బాగుండాలని సీఎం వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఏది మంచి ఆలోచనో కోదండరామ్, హరగోపాల్‌ గమనించాలన్నారు.  

ఎంపీ నందిగం సురేష్‌ ఇంకా ఏమన్నారంటే..
53 వేల ఎకరాల భూములు తీసుకొని, రియలెస్టేట్‌ వ్యాపారం చేసి.. ఇవాళ అమరావతి రైతుల ముసుగులో బినామీలు, బిల్డర్స్, వ్యాపారులకు ఇక్కడే భూములు ఉన్నాయి. వారి రూపంలో ఇదంతా జరుపుతున్నారు. చంద్రబాబు అనుకునే అమరావతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వాటా ఎంత..? వెనుకబడిన వర్గాలు ఏమిచ్చారు..? ఆర్తనాదాలు ఏరోజు అయినా విన్నారా..? 

సీఎం వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత రాష్ట్రమంతా పరిపాలన బ్రహ్మాండగా సాగుతుంది. అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరగాలి.. అన్ని ప్రాంతాలు డెవలప్‌కావాలని చెబుతున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కచ్చితంగా విశాఖను ఎంచుకుంటే కొంత ఖర్చుతో మిగిలిన నగరాలకు తలదన్నేలా తీర్చిదిద్దొచ్చు అని సీఎం భావిస్తున్నారు. 

చంద్రబాబు పిలవగానే పేరంటానికి వచ్చినట్టు వచ్చారు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు వెళ్తున్నాం.. ఎందుకు పిలిచారు.. గతంలో ఏం జరిగిందని తెలుసుకోకుండా వచ్చారు. సీపీఎం, సీపీఐ నాయకులు పేదల పక్షాన నిలబడేవారని గతంలో చెప్పుకునేవారు. ఇవాళ చంద్రబాబు ఎక్కడ నష్టపోయినా, ఇబ్బందిపడినా నిలబడేందుకు రెడీ అయ్యారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు. చంద్రబాబు అనుకునే బినామీ రాజధాని కోరుకుంటున్నారా..? ప్రజలందరికీ ఆమోద యోగ్యంగా ఉండే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటారా..? 

నరేంద్రమోడీ అమరావతి శంకుస్థాపనకు వస్తుంటే దళితులను రానివ్వకుండా బారికేడ్లు కట్టించారు. చంద్రబాబు తన సామాజికవర్గానికి బోట్లు పెట్టి, పట్టువస్త్రాలు పెట్టి పిలిపించాడు. చంద్రబాబు దళితులను పట్టించుకున్న పాపానపోలేదు. ఇవన్నీ మీకు గుర్తుకురాలేదా..? తెనాలి శ్రవణ్‌కుమార్‌ను శంకుస్థాపన వేదికపైకి ఆహ్వానించలేదు. శిలాఫలకం మీద పేరు లేదు.. రాజధాని వేసిన కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటే.. మురళీమోహన్, పత్తిపాటి పుల్లారావు, నారాయణ ఇలాంటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వేల కోట్ల ఆస్తులు ఉన్నావారే.. స్థానిక ఎమ్మెల్యేకు కమిటీలో చోటు లేదు. అందరూ గందరగోళం చేసిన తరువాత లిస్టులో పేరుపెట్టారు కానీ, విలువ ఇవ్వలేదు. చంద్రబాబుకు దళితుల మీద ఉన్న విలువ ఏంటో తెలుసుకోండి.’’ అని ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top