మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?

ష‌ర్మిల‌ను సూటిగా ప్ర‌శ్నించిన ఏఏజీ పొన్నవోలు సుధాక‌ర్‌రెడ్డి

షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు

ఎమ్మెల్యే శంకర్రావు వల్లే  ఆనాడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు

టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారు

వైయ‌స్ఆర్‌ను కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని భావించి కేసులు వేశాను

నాతో ఎవరూ కేసులు వేయించలేదు.. అప్ప‌టికి  వైయ‌స్ జగన్‌ను చూడనేలేదు

చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు

విజయవాడ:  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని వేధించిన వారికి ఎదురొడ్డి తాను పోరాటం చేశా.. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంట‌ని ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు. మీ తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? అని  ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను నిల‌దీశారు. ష‌ర్మిల‌ రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారని, ఆమె పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ష‌ర్మిల‌ మాట్లాడారని విమర్శించారు.  తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందించారు. శుక్ర‌వారం సుధాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి ఏమ‌న్నారంటే..
 కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే  ఆనాడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని తెలిపారు. వైయ‌స్ఆర్‌ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు.  

వైయ‌స్ఆర్‌పై కేసులు పెడుతుంటే చూడలేక..
‘మహానుభావుడైన వైయ‌స్ఆర్‌ మీద ఆరోపణలు చేస్తుంటే, కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం వైయ‌స్ జగన్‌ను చూడనేలేదు.  వైయ‌స్ఆర్‌ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, వైయ‌స్‌ జగన్‌కు ఏం సంబంధం ఉందని పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు.
 
వాస్తవాలు తెలుసుకోవాలి..
వైయ‌స్ఆర్‌ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైయ‌స్ఆర్‌ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైయ‌స్ఆర్ ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైయ‌స్ఆర్‌ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.

నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..
షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. తండ్రి మీద షర్మిలకు ప్రేమ ఉంటే శంకర్రావు రాసిన లేఖ చదవాలి. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top