తాడేపల్లి: మొంథా తుపాన్ రైతులు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంటే, అధైర్యపడొద్దు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో ఏ ఒక్కరూ ఎందుకు చెప్పలేక పోతున్నారని కూటమి ప్రభుత్వాన్ని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు. తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుపాన్‌తో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క కూటమి ఎమ్మెల్యే కూడా పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడలేదని, అసలు ఈ రాష్ట్రానికి వ్యవసాయశాఖ మంత్రి ఉన్నాడా అనే సందేహం కలిగేలా అచ్చెన్నాయుడు రైతులను గాలికొదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యంకి మద్ధతు ధర అడిగితే వరి అన్నం తింటే షుగుర్ వస్తుందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైయస్ఆర్‌సీపీ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా అందించే రాగి పిండి, గోధుమ పిండిని ఎందుకు ఆపేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వైయస్ జగన్ చేసినట్టే ఉచిత పంటల బీమా అమలు చేసుంటే మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేదని, కానీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగా 60 లక్షల మంది రైతులు నష్టపోయారని మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులందర్నీ ప్రభుత్వమే ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేశారు. వరాలివ్వడానికి నేను ముఖ్యమంత్రిని కాదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కావాల్సిన పనిలేదని, ఆయన మాటలు చూస్తే బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● పొలంలోకి వెళ్లిన ఎమ్మెల్యే కూటమిలో లేడు చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయం దుర్భరంగా మారడం, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండే ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగిస్తున్నాడు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. మొంథా తుపాన్‌కి పంటలు దెబ్బతింటే ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్‌లో మొక్కుబడిగా తిరిగేసి వెళ్లడం మినహా ఏ ఒక్క కూటమి ఎమ్మెల్యే కూడా పొలంలోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల కష్టం చూసి పంట నష్టం అంచనా వేసిన పాపాన పోలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు తుపాన్ సమయంలో న్యూజిలాండ్‌లో విహరించి వచ్చారు. గత వైయస్ఆర్‌సీపీ హయాంలో తుపాన్‌ల సందర్భంగా పంట నష్టంపై హెలిక్యాప్టర్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేస్తే ఇలాగేనా చూసేది అని ఎద్దేవా చేసిన చంద్రబాబు, పొలాల్లో దిగకుండా హెలిక్యాప్టర్‌లో ఎందుకు వెళ్లినట్టు? వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఎక్కడా పంటలు పరిశీలన చేసినట్టు కానీ, రివ్యూ చేసినట్టు కానీ కనిపించలేదు. వ్యవసాయశాఖ మంత్రి ఎవరు.. ఎక్కడుంటాడో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. రైతుకు ఈ ప్రభుత్వం అండగా ఉందన్న ఒక్క మాట కూటమి నాయకులెవరూ చెప్పడం లేదు. ● బొటాబొటిగా ఎన్యుమరేషన్ వైయస్ఆర్‌సీపీ హయాంలో పంట కోతకు వస్తుందన్న సమయానికల్లా నాటి సీఎం వైయస్ జగన్ అధికారులతో సమావేశం నిర్వహించి మధ్ధతు ధరలపై అలెర్ట్ చేసేవారు. పంటల కొనుగోళ్లలో ప్రభుత్వమే జోక్యం చేసుకోవడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ పెరిగి రైతులకు మద్ధతు ధరలు దక్కేవి. ఆ విధంగా అడుగడుగునా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఈరోజున టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం రివ్యూ కూడా చేయకుండా రైతులను దగా చేస్తోంది. వైయస్ఆర్‌సీపీ హయాంలో పంట నష్టపరిహారం అదే సీజన్‌లో అందజేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో ఒక్క రూపాయి కూడా రైతుకిచ్చి ఆదుకున్న దాఖలాలు లేవు. ధాన్యం ఎకరా 40 బస్తాలు దిగుబడి ఇచ్చే పరిస్థితి నుంచి 20 బస్తాలు కూడా రావడం గగనమైపోయింది. ఎన్యుమరేషన్ సందర్భంగా పడిపోయిన పంటలనే నమోదు చేస్తున్నారు. కానీ తుపాన్ నేపథ్యంలో గింజలకు పాలు పోసుకోకుండా నిలబడిన పంటలను కూడా నమోదు చేయాలని అడిగినా నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెబుతున్నారు. పంట పెట్టుబడులు కూడా వెనక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ● ఒక పంటకి రెండుసార్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం వైయస్ఆర్‌సీపీ హయాంలో వ్యవసాయానికి పెద్ద పీట వేసి, రైతే వెన్నెముకగా భావించి అండగా నిలిచాం. పంటలు వేసే సమయంలోనూ ఈక్రాపింగ్ చేసి ఉచిత పంటల బీమాకి ప్రభుత్వమే డబ్బులు చెల్లించడం జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించకుండా రైతులను గాలికొదిలేయడంతో ఏకంగా 60 లక్షల మంది రైతులు నష్టపోయారు. బ్యాంక్ లోన్ తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే న్యాయం జరిగితే మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఒకేపంట రెండుసార్లు దెబ్బతింటే రెండుసార్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న రైతు పక్షపాతి వైయస్ జగన్. కానీ ఇప్పుడు, ధాన్యంకి మద్ధతు ధర చెల్లించమని రైతులు డిమాండ్ చేస్తుంటే వరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతులకు అడుగడుగునా అండగా నిలిచిన ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేసి దళారీ వ్యవస్థను తీసుకొచ్చి రైతుల్ని చంద్రబాబు దోచుకుంటున్నారు. మిర్చి, పొగాకు, టమాట, అపరాలు, కోకో, ధాన్యం, మామిడి, ఉల్లి, అరటి, చీనీ.. ఏ పంట చూసినా రైతులకు నష్టమే మిగిలింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటూ రైతుల పక్షాన కేంద్రంతో మాట్లాడటం లేదు. వైయస్ఆర్‌సీపీ ఆందోళన చేసినప్పుడల్లా మొక్కుబడిగా కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు రాయడం తప్పించి చేసింది శూన్యం. కూటమి పాలనలో కనీసం గన్నీ బ్యాగులు కూడా దొరకడం లేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? గతేడాది చెల్లించాల్సిన రవాణా చార్జీలు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకోపక్క యూరియాని డబుల్ రేట్లకు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి. ● ఆ బాధ్యత ప్రభుత్వానిదే పంటలకు ఈ క్రాపింగ్ చేసి ఇన్సూరెన్స్ చేసి ఉంటే మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం దక్కేది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇన్సూరెన్స్ చేయకుండా వదిలేసింది. దీంతో దాదాపు 60 లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోయారు కాబట్టి ఇన్సూరెన్స్ చేసి ఉంటే ఎంత పరిహారం అందేదో అంతమొత్తం రైతులకు ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్న విషయాన్ని ఇప్పటికైనా సీఎం చంద్రబాబు గుర్తించాలి. రైతుతో కన్నీరు పెట్టిస్తే ఆ ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండాపోదని హెచ్చరిస్తున్నా. ● తణుకులో యథేచ్ఛగా జంతు వధ తణుకులో యథేచ్ఛగా జంతు వధ జరుగుతోంది. రెండున్నర ఎకరాల్లో రెండు షెడ్ లలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 2019కి ముందు కూడా ఇలాగే కొనసాగినా మా హయాంలో దాన్ని నడవనీయకుండా అడ్డుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే మళ్ళీ జంతు వధ మొదలుపెట్టారు. పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి మరీ నడిపిస్తున్నారు. మొన్న విశాఖలో పట్టుబడిన గోమాంసానికి కూడా ఇదే మూలమని అన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. ● రేషన్ షాపుల్లో కంది పప్పు ఎందుకు ఆపేశారు? నా నియోజకవర్గంలో ప్రజలకు ఏదైనా కష్టమొస్తే వెంటనే సంబంధిత మంత్రితో, అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేసేవాడిని. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం సమస్యల గురించి అడిగితే వరాలివ్వడానికి నేను ముఖ్యమంత్రిని కాదని చెబుతున్నాడంటే.. ఇది బాధ్యతల నుంచి పారిపోవడమే. ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు నష్టపరిహారం ఇప్పించలేనప్పుడు ఆయన ఎందుకు వెళ్లినట్టు? రాష్ట్రంలో యథేచ్చగా రేషన్ బియ్యం పక్కదారి పట్టిపోతోంది. కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా జరుగుతోంది. మా హయాంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పంచదారతోపాటు కందిపప్పు, రాగిపిండి, గోధుమ పిండి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు బియ్యం, అరకొరగా పంచదార తప్ప ఇంకేమీ ఇవ్వడం లేదు. దీనికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలి. బియ్యం తింటే షుగర్ వస్తుందని చెప్పే ముఖ్యమంత్రి మేమిచ్చిన గోధుమ పిండి, రాగి పిండి ఎందుకు ఆపేసినట్లని కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు.