తాడేపల్లి: తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకునేందుకు సీఎం చంద్రబాబుగారు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలు చూపి, జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన చంద్రబాబుగారు, ఇప్పుడు కుతంత్రాలతో తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకుంటున్నారని ఆక్షేపించారు. అందుకు ఆ కేసులపై ఫిర్యాదు చేసిన, కేసులు నమోదు చేసిన అధికారులను బెదిరించి, ప్రలోభపెట్టి వారితోనే విత్ డ్రా చేయించుకుంటున్నాడని ధ్వజమెత్తారు. నిజాయితీగా విచారణ ఎదుర్కొనే ధైర్యం లేక, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతే తాను జైలుకు పోవడం ఖాయమని గ్రహించిన చంద్రబాబుగా ఇలా అడ్డదారులు తొక్కుతున్నాడని ఆక్షేపించారు. అందుకే ఇప్పుడు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయిందని గుర్తు చేశారు. నిజాయితీ అధికారులుంటే తన ఆటలు సాగవు కాబట్టే సీనియర్ ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. ఇంకా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి నీటి తరలింపు గురించి ఆలోచించకుండా లైనింగ్ పనుల్లో భారీ అవినీతికి తెర లేపారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏం మాట్లాడారంటే..: చట్టాలపై చంద్రబాబుకు గౌరవం లేదు: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు తనమీద నమోదైన కేసులను నీరుగార్చే కుట్రలకు తెర లేపారు. సీఐడీ అధికారులు అన్ని ఆధారాలతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే వ్యవస్థలు కూడా తప్పులు జరిగినట్టు నిర్ధారించిన తర్వాత కూడా.. ఏ సంకోచం లేకుండా కేసుల మాఫీకి వెనుకాడటం లేదంటే చట్టాలంటే చంద్రబాబుకి ఎంత గౌరవమో తెలిసిపోతుంది. ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరించి వారితోనే కేసులు వెనక్కి తీసుకునేలా పావులు కదుపుతున్నారు. ఈ దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మరో కఠోర వాస్తవం ఏమిటంటే.. దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి కూడా చంద్రబాబే. ఏలేరు స్కాం నుంచి నోటుకు కోట్లు కేసు వరకు అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికిపోయాడు. ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని, సైకిల్ గుర్తుని, ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ని ఎలాగైతే వ్యవస్థలు మేనేజ్ చేసి లాగేసుకున్నాడో ఇప్పుడు కూడా అచ్చం అదేవిధంగా తనపై నమోదైన అవినీతి కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారులను తన అధికార బలంతో భయపెట్టి, ప్రలోభపెట్టి దారికి తెచ్చుకుంటున్నాడు. ఇలాంటి విధానాల కారణంగానే ఏపీ పోలీస్ ర్యాంక్ దేశంలో అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధించడానికే పోలీసులను వాడుకుంటున్నారు. నిజాయితీగా పనిచేసిన సీనియర్ ఐపీయస్‌లకు ఏడాదిన్నరగా కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు వేధిస్తున్నాడు. అన్నీ ఆధారాలతో అడ్డంగా దొరికిన కేసులే: 2014–19 మధ్య అధికారంలో ఉండగా అడ్డగోలుగా రాష్ట్ర ఖజానాను తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టాడు. బార్లకు ప్రివిలైజ్ ఫీజును రద్దు చేసి రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టాడు. కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు సొంతంగా నిర్ణయం తీసుకుని మూడు చోట్ల సంతకాలు చేసి దొరికిపోవడమే కాకుండా వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించాడు. చంద్రబాబు నిర్ణయాన్ని ‘కాగ్’ కూడా తప్పు పట్టింది. ఇప్పుడు అదే లిక్కర్ కేసును కూడా నీరు గార్చే ప్రయత్నం జరుగుతోంది. ఇదే కాకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుని దక్షిణానికి మూడు కిలో మీటర్లు జరిపేశారు. లింగమనేని కుటుంబానికి, మంత్రి నారాయణ, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెట్‌కి చెందిన ఆస్తులు ఉండటంతో వాటికి లాభం చేకూర్చమే ధ్యేయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్డును జరిపేశారు. ఆయా వ్యక్తులు, సంస్థల ఆస్తుల విలువను పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇంకా టెరా సాఫ్ట్ అనే సంస్థలో పని చేసే వేమూరి హరికృష్ణ అనే వ్యక్తిని ఏపీ ఫైబర్ నెట్ కి డైరెక్టర్‌ని చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వం, ఆయన డైరెక్టర్ అయిన మూడు నెలల్లోనే అప్పటివరకు టెరా సాప్ట్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో రూ.321 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. రూ.121 కోట్ల అవినీతికి సంబంధించి సీఐడీ ఆధారాలు కూడా సేకరించింది. ఈ కేసులోనూ చంద్రబాబు ముద్దాయిగా ఉన్నాడు. దీన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసైన్డ్ భూముల కుంభకోణంలో దాదాపు రూ.4,239 కోట్ల విలువైన 1072 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు కాజేశారు. రాజధానికి భూసేకరణ సందర్భంగా రకరకాల కారణాలు చూపించి పేదలను భయపెట్టి ఆ భూములు లాగేసుకున్నారు. దీంతోపాటు మరో 328 ఎకరాలు ప్రభుత్వ భూమి చంద్రబాబునాయుడు ఆదేశాలతో టీడీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.5 వేల కోట్ల భూ కుంభకోణం జరిగింది. ఇందులో కూడా అప్పటి సీఎం పాత్ర ఉన్నట్టు సీఐడీ అధికారులు నిర్ధారించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నిబంధనలు ఉల్లంఘించి రూ.371 కోట్లు డిజిటెక్ అనే కంపెనీకి తరలించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని అప్పటి అధికారులు చెప్పినా సీఎంగా ఉన్న చంద్రబాబు వినకుండా 13 చోట్ల నోట్‌ఫైళ్లపై సంతకాలు చేసి నిధులు విడుదల చేయించాడు. ఈ కేసుల్లో చంద్రబాబు పాత్రను సీఐడీ అధికారులు ఆధారాలతో సహా నిర్ధారించి కోర్టు ముందుంచితే, కోర్టు ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అప్పుడు తీవ్ర అనారోగ్య కారణాలు సాకుగా చూపిన చంద్రబాబు, బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. యథేచ్ఛగా అధికార దుర్వినియోగం: బెయిల్ నిబంధనలూ ఉల్లంఘన: గత ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాగానే, కేసుల మురికిని అధికారంతో కడిగేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో రౌడీయిజం చేసి అధికారులను భయపెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఫిర్యాదు చేసిన వారితో విత్ డ్రా చేయించుకుంటున్నాడు. తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిందిపోయి విచారణ ఎదుర్కోకుండా అడ్డదారిలో కేసులు మాఫీ చేసుకుంటున్నాడు. చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసే సమయంలో కేసు దర్యాప్తులో కలగజేసుకోకూడదని కోర్టు స్పష్టంగా నిబంధనలు పెట్టినా అధికారులను దారిలోకి తెచ్చుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. కేసు దర్యాప్తులో సీఎం చంద్రబాబు కలగజేసుకోకపోతే ఆరోజున తప్పు జరిగినట్టు ఆధారాలతో ఫిర్యాదు చేసిన అధికారులకు.. ఈరోజున తప్పు కాదని ఎందుకనిపిస్తుంది? చంద్రబాబు ఒత్తిడి లేకుండానే అధికారులు కేసులు విత్‌డ్రా చేసుకుంటారా? ఈ దారుణాలను పవన్ ప్రశ్నించరా?: ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని సపోర్టు చేస్తూ ఇంకో 15 ఏళ్లు ఆయనే సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నాడు. అధికార దుర్వినియోగం చేసి కేసులు నీరుగారుస్తుంటే చంద్రబాబుకి అండగా నిలుస్తున్నాడు. అన్యాయాన్ని, దుర్మార్గాలను ప్రశ్నించలేనప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగడం విచారకరం. నకిలీ మద్యం తయారు చేసి విచ్చలవిడిగా అమ్ముతూ ప్రజల ప్రాణాలను హరిస్తుంటే నోరెత్తడం లేదు. నకిలీ మద్యం తయారు చేసిన తెలుగుదేశం నాయకులను వదిలేసి బస్సు ప్రమాదానికి బెల్ట్ షాపుల్లో అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జరపడమే కారణమని ప్రశ్నించిన వారిపై ఈ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. కూటమి పాలనలో తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై నోరెత్తడం లేదు. వైవీ సుబ్బారెడ్డి గారు ప్రెస్‌మీట్ పెట్టి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడించడంతోపాటు టీడీపీ తప్పులను ఎత్తి చూపితే పవన్ కళ్యాణ్ కిక్కురుమనడం లేదు. టీటీడీ బోర్డును పారదర్శకంగా నడిపిన మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారి మీద నిందలు మోపడం దారుణం. వెలిగొండ పనుల్లో అవినీతి బాగోతం: రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో అంచనాలు ఇష్టారాజ్యంగా పెంచేసి కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోంది. అలాగే ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు పనుల్లోనూ అవినీతికి తెరలేపారు. పశ్చిమ ప్రకాశానికి తాగునీరు, సాగునీరు ఇచ్చే ఆశయంతో దివంగత వైయస్సార్ జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రూ.600 కోట్లు ఖర్చు చేయడంతో పాటు, ప్రాజెక్టుకి అన్ని అనుమతులు తీసుకొచ్చారు. చంద్రబాబు 1995 లో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి 2004 వరకు దాని ముఖం చూసిన పాపాన పోలేదు. వైయస్సార్ తర్వాత వైయస్ జగన్ గారే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1100 కోట్లు వెచ్చించారు. వెలిగొండ ప్రాజెక్టులో దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ పనులు, లైనింగ్ వర్కులకు సంబంధించి, గత అక్టోబర్ 1న రూ.370 కోట్ల అంచనా పనులను రూ.387 కోట్లకు కట్టబెట్టేశారు. దాదాపు 4.59 శాతం ఎక్కువకి ఇచ్చారు. అదీ కాకుండా అర్హత లేని కేఎంవీ అనే కంపెనీకి అప్పగించారు. నిబంధనల ప్రకారం ఈ కాంట్రాక్టు పొందాలంటే 2014 నుంచి 2025 వరకు రూ.148 కోట్ల వరకు ఇలాంటి పనులు చేసి డైరెక్ట్ టెండర్ దక్కించుకున్న కంపెనీ అయి ఉండాలి. కానీ కేఎంవీ కంపెనీకి ఈ అర్హతలేవీ లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించారు. చంద్రబాబు బినామీ కంపెనీ జేడీఆర్ అనే కంపెనీకి జాయింట్ వెంచర్‌గా అవకాశం కల్పించడంలో భాగంగానే కేఎంవీకి ఈ పనులు ఇచ్చినట్టు తెలిసింది. నీళ్లు ఇవ్వకపోగా నిధులు దోచుకుంటున్నారు. అలా పశ్చిమ ప్రకాశం ప్రాంతంపైన చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. ఇంకా నాలుగు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఇచ్చామని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ, ఏ విధంగా ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారనేది మాత్రం చెప్పడం లేదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆక్షేపించారు.