ఏలూరు: హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో పట్టుబడిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్‌లో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొంటూ, టీడీపీ ఇప్పుడు రాజకీయ పార్టీగా కాకుండా “తెలుగు డ్రగ్స్ పార్టీ”గా మారిపోయిందని అభివర్ణించారు. ఏలూరు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్(జేపీ) , చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయ రాజు , నగర పార్టీ అధ్యక్షుడు గుడిదేశీ శ్రీనివాసరావు తదితరులతో కలిసి దూలం నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో దూలం నాగేశ్వరరావు ఇంకా ఏమన్నారంటే..: దేశ చరిత్రలోనే ఒక ఎంపీ డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం ఇదే తొలిసారి మోయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌పై తెలంగాణ పోలీసులు జరిపిన దాడిలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. డ్రగ్స్ పరీక్షల్లో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో డ్రగ్స్ కారణంగా యువత నాశనం అవుతున్నారని, తాను గెలిస్తే డ్రగ్స్ లేని ఏలూరు పార్లమెంట్‌గా తీర్చిదిద్దుతానని చెప్పి ప్రజల మద్దతుతో గెలిచిన వ్యక్తే ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం అత్యంత సిగ్గుచేటు. ఏలూరు పార్లమెంట్‌కు గతంలో సేవలందించిన ఎంతో మంది మహానుభావులను చూశాం. దేశ చరిత్రలోనే ఒక ఎంపీ డ్రగ్స్ పార్టీలో పట్టుబడి పరీక్షల్లో పాజిటివ్ రావడం ఇదే తొలిసారి. అది తెలుగు డ్రగ్స్ పార్టీ తెలుగు దేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా కాకుండా “తెలుగు డ్రగ్స్ పార్టీ”గా మారిపోయింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మిత్రులు రాజస్థాన్ చెందిన మాజీ ఎమ్మెల్యే నితీన్ శర్మతో కలిసి ఈ పార్టీ నిర్వహించారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, అందులో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి అవమానం. తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డ్రగ్స్ పార్టీపై దాడులు చేసిన పోలీసులపైనే కాల్పులు జరిగాయనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇది ఎంత ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎంపీని తప్పించేందుకు హాట్‌లైన్ ప్రయత్నాలు డ్రగ్స్ కేసు నుంచి ఎంపీ మహేష్ యాదవ్‌ను తప్పించేందుకు ఇప్పటికే హాట్‌లైన్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరెవరు ఈ వ్యవహారంలో ఉన్నారో ప్రజలకు బాగా తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. గుంటూరు, మంగళగిరి, విశాఖపట్నం, నెల్లూరు ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. పోలీసు వ్యవస్థను ప్రజల కోసం కాకుండా రెడ్‌బుక్ అమలు కోసం ఉపయోగిస్తున్నారు. హోం మంత్రి వైయస్ఆర్‌సీపీ నేతలను తిట్టడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రగ్స్ వ్యవహారాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు వినిపించడం రాష్ట్ర పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. చంద్రబాబు నాయుడు నిజంగా డ్రగ్స్‌పై చర్యలు తీసుకోవాలనుకుంటే పుట్టా మహేష్ యాదవ్‌ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుంచి రాజీనామా చేయించాలి. లేకపోతే ప్రజా సంఘాలతో కలిసి భారీ నిరసనలు చేపడతామని దూలం నాగేశ్వరరావు హెచ్చరించారు. పుట్టా మహేష్ ఏలూరు ఎంపీ కావడం మా దౌర్భాగ్యం : మామిళ్లపల్లి జయప్రకాశ్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడటం రాష్ట్రానికి, ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ ప్రజలకు తీవ్ర అవమానకరం. ఈ కేసులో ఎంపీని తప్పించేందుకు కూటమి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నాలు చేసినప్పటికీ, అక్కడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఉండటంతో అది సాధ్యం కాలేదు. గంజాయిని పూర్తిగా నియంత్రించామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి తరచూ ప్రకటనలు చేస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సాక్షాత్తూ ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇదే తొలిసారి , అలాంటి వ్యక్తి ఏలూరు ఎంపీగా ఉండటం ప్రజల దురదృష్టం. పుట్టా మహేష్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఏలూరులో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. బార్లలో 24 గంటలు మద్యం, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఇటీవల ఒక యూట్యూబ్ కథనం కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని జేపీ డిమాండ్ చేశారు. పుట్టా మహేష్‌కు డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయా? : కంభం విజయరాజు డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సిగ్గుచేటు విషయం. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం, ఆ ఎంపీ ఏలూరుకు చెందిన వ్యక్తి కావడం ఈ ప్రాంత ప్రజలను తలదించుకునే పరిస్థితికి తీసుకువచ్చింది. ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతూ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తే ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం అత్యంత దురదృష్టకరం. నైతిక విలువలు లేని వ్యక్తులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం కూటమి ప్రభుత్వ వైఖరిని బయటపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని కూటమి నేతలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. మహేష్ యాదవ్‌కు డ్రగ్స్ రాకెట్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా సమగ్ర విచారణ జరపాలి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కంభం విజయరాజు డిమాండ్ చేశారు.