ప్రొద్దుటూరు: ఒకప్పుడు అన్నపూర్ణగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ను కూటమి ప్రభుత్వం మత్తు పదార్ధాల నిలయంగా మార్చిందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఘటనే ఇందుకు నిదర్శనం అని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయని, వీటిపై ప్రశ్నిస్తే కూటమి నేతలు ఎదురుదాడి చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు పుట్టా మహేష్ ఘటనతో జాతీయ స్ధాయిలో మరోసారి రాష్ట్రం పరువు పోయిందన్నారు. ప్రెస్ మీట్ లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంకేమన్నారంటే.. మత్తుపదార్ధాల నిలయంగా ఆంధ్రప్రదేశ్: కూటమి ప్రభుత్వం అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను, ఆహారపదార్ధాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ ను మత్తుపదార్ధాలకు అడ్డాగా మార్చింది. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ అనేవారు. కానీ ఇకపై ఆ మాట అనరు. మత్తుపదార్ధాలకు నిలయం, అడ్డా, కర్మాగారంగా మార్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈనాటి వరకూ గంజాయి, మాదక ద్రవ్యాలు, మద్యం, మానభంగాలు నిత్యకృత్యంగా మారాయి. గుంటూరు, మంగళగిరి, విశాఖ ఇలా ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. మత్తు పదార్ధాలకు బానిసై విద్యార్ధులు, యువత నిర్వీర్యమవుతున్నారు. మత్తు పదార్ధాలకు బానిసై యువత శక్తి ఈ దేశానికి పనికిరాకుండా పోతోంది. ఒకప్పుడు స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటే.. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన వెయ్యి మంది యువతను తన చేతికి ఇస్తే ఈ దేశ స్వరూపాన్నే మారుస్తామని ఆయన చెప్పాడు. ఈనాడు చంద్రబాబు గంజాయి, హెరాయిన్, మద్యం యువతకు అందిస్తున్నాడు. ఇనుక కండలు, ఉక్కు నరాలు దేవుడెరుగు, యువత శారీరక శక్తి మందగించి తల్లితండ్రులకూ, సమాజానికీ శాపగ్రస్తులుగా మిగిలిపోయే పరిస్ధితిని ప్రభుత్వం తీసుకొస్తోంది. దొరికిపోతున్న కూటమి ప్రజా ప్రతినిధులు: స్వయంగా టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ లో పాజిటివ్ గా వస్తుంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. మొన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు, ఇవాళ ఏలూరు ఎంపీ డ్రగ్స్ లో పట్టుబడ్డారు. వీళ్లతో చంద్రబాబు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రం గౌరవ మర్యాదలు మంటగలిసి ఢిల్లీ పార్లమెంట్ గోడల్ని తాకాయి. చంద్రబాబు పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాదు, హెరాయిన్, కొకైన్, గంజాయికి అడ్డా అని ఢిల్లీ పార్లమెంట్ వరకూ తెలిసింది. ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పెరిగిపోయాయని మేం మాట్లాడితే హోంమంత్రి ఎదురుదాడి చేస్తారు. గంజాయి, డ్రగ్స్ అరికట్టడానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి రవాణా: పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ లో డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. వచ్చిన పోలీసుల మీద కాల్పులు జరపడం అంతకంటే దారుణం. అంటే గ్యాంగులు నిర్వహిస్తూ, హింసను ప్రేరేపిస్తున్నారు. బలవంతులకు తప్ప సామాన్యులకు ఈ సమాజంలో బతికే అవకాశం లేదని నిరూపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలు ఉన్నాయని ఇలాంటి పనులకు దిగుతున్నారు. గతంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడినా, ప్రొద్దుటూరు, విశాఖ, గుంటూరులో డ్రగ్స్ దొరుకుతున్నా అది చంద్రబాబు పుణ్యమే. ఇదంతా చూస్తూ ప్రజలు హర్షిస్తారా, డ్రగ్స్ కేసులో దొరకగానే ఎంపీ పుట్టా మహేష్ వెంటనే రాజీనామా చేయాలి. కానీ అలా జరగలేదు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మహిళతో దొరికిపోతే మీరు పట్టించుకోరు. మీరు పట్టించుకునేది కేవలం రెడ్ బుక్ మాత్రమే. అసాంఘిక కార్యకలాపాలను పట్టించుకోకపోగా ప్రోత్సహిస్తున్నారు. పుట్టా మహేష్ ఘటనపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు ?: హైదరాబాద్ లో పట్టుబడిన ఎంపీ వ్యవహారంలో పెద్ద గేమ్ మొదలుపెట్టారు. లోక్ సభకు ఎన్నికైన ఎంపీ మహేష్ యాదవ్ బాధ్యతను మరచి డ్రగ్స్ వ్యవహారంలో పాల్గొన్నా అది తీవ్రమైన నేరం కాదా, దానిపై చంద్రబాబు స్పందించరా ?, సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారో చెప్పాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.