విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నంలో అధికార పార్టీ అండతో సాగుతున్న భూ దోపిడీపై వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గీతం యూనివర్సిటీ సాగిస్తున్న బరితెగింపు చర్యలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. సీఎం బంధువు, అధికార పార్టీ ఎంపీకి చెందిన గీతం యూనివర్సిటీ రూ.5వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు మొద్దునిద్రపోతున్నారని మండిపడ్డారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణమని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... - రూ. 5వేల కోట్ల ప్రభుత్వ భూమిపై గీతం బరితెగింపు విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ₹5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించుకోవడం అరాచకానికి పరాకాష్ట. గడిచిన కొద్ది రోజులుగా గీతం ఆధీనంలో ఉన్న 54.49 ఎకరాల ప్రభుత్వ మరియు అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలన్న కలెక్టర్ ఆదేశాలను, విశాఖ కార్పొరేషన్ కౌన్సిల్ ఎజెండాలో చేర్చి ఎలాంటి చర్చ లేకుండా అప్రజాస్వామికంగా ఆమోదించడం సిగ్గుచేటు. ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నా, మేధావులు గొంతెత్తుతున్నా లెక్కచేయకుండా ఒక ఎంపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నాడు. - ఆగమేఘాల మీద అక్రమ నిర్మాణాలు.. ప్రభుత్వ భూమి అని గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను గీతం యాజమాన్యం బరితెగించి తొలగించింది. ప్రస్తుతం ఆ భూమిలో ప్రొక్లెయినర్లతో అక్రమ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. దీనిపై వందలాది మంది ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదు. 'మా నోటీసులో లేదు' అని కలెక్టర్ చెబుతున్నారంటే, అధికారుల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. రెండు వారాలుగా నిర్మాణాలు జరుగుతున్నా ఒక్క అధికారి కూడా అటువైపు చూడకపోవడం వెనుక భారీగా లంచాలు చేతులు మారాయని స్పష్టమవుతోంది. - జీవీఎంసీ కమిషనర్ 'మొద్దు నిద్ర' ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన జీవీఎంసీ కమిషనర్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ మొద్దు నిద్రపోతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత మీపై లేదా? మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటి? ఒక ఎంపీ భరత్ బెదిరింపులకు లొంగిపోతారా లేక లంచాలకు కక్కుర్తి పడి మౌనంగా ఉంటున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సర్వీసులో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోవడం ఖాయం. - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద భూ కుంభకోణం కేవలం గీతం మాత్రమే కాదు.. విశాఖలోని విలువైన భూములను బోగస్ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ₹10 కోట్లు కూడా పెయిడ్ కేపిటల్ లేని, కేవలం 40 మంది ఉద్యోగులున్న ఒక సెమీ కండక్టర్ కంపెనీకి ఎకరా కేవలం 99 పైసలకే 30 ఎకరాలు ఎలా కేటాయిస్తారు? ₹2,136 కోట్ల పెట్టుబడి అంటూ అబద్ధపు లెక్కలు చూపిస్తూ ఉర్సా, సత్వా, కపిల్, లూలూ వంటి బోగస్ సంస్థలకు భూములను ధారాదత్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద భూ స్కామ్. - గీతం ఆక్రమణలపై పోరాటం.. గీతం యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవాలి. తమ కళ్ల ముందే అక్రమాలు జరుగుతుంటే అధికారులు వారికి వంతపాడ్డం సిగ్గుచేటు. ఈ అక్రమాలను చూస్తూ అడ్డుకోలేని అధికారుల సర్వీసులో ఇది ఓ మాయని మచ్చగా మిగలడం ఖాయమని.. అలాంటి వారిపై విచారణ జరిపించి,వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమని కేకే రాజు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రాను భూ రాబందుల కబంద హస్తాల నుండి కాపాడటానికి మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి వైయస్ఆర్‌సీపీ భారీ పోరాటానికి సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. "కూటమి ప్రభుత్వం తన బంధువులకు, బోగస్ కంపెనీలకు విశాఖను దోచిపెడుతుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. గీతం అక్రమాలను ప్రపంచం ముందు ఉంచి తీరుతాం అని కే.కే. రాజు హెచ్చరించారు.