ఢిల్లీ: అమరావతికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని, దాని పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అని అన్నారు. అమరావతి బిల్లుపై లోక్‌సభలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ తరఫున చర్చలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. చర్చలో భాగంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు. 2014-19 వరకు రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసం తట్టుకోలేక రైతులు గుండె ఆగి చనిపోయారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి. అమరావతిలో ప్రతీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు?. అదనపు భూసేకరణకు అవసరం ఏముంది?. మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి. తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏంటి?. అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.5335 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. చదరపు గజానికి ఢిల్లీలో 4,000 ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. 8000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు వైయస్ఆర్‌సీపీ వాకౌట్ చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం. రాయలసీమ రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రస్తుత ఫార్మాట్‌లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు.