రాజమహేంద్రవరం: ఇసుక అక్రమ తవ్వకాలపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోటిలింగాలపేట ఇసుక ర్యాంపులకు వెళ్లే మల్లయ్యపేట రహదారిపై స్థానికులతో కలిసి మాజీ ఎంపీ భరత్ రామ్ ధర్నా నిర్వహించారు. “సేవ్ మల్లయ్యపేట” నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ, గోదావరి నది గర్భాన్ని విచ్చలవిడిగా తవ్వుతూ, గామన్ బ్రిడ్జి మరియు ధవలేశ్వరం బ్యారేజ్‌కు ప్రమాదం కలిగేలా ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. నగర ఈవీఎం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డ్రెడ్జింగ్ బోట్లతో అక్రమంగా ఇసుక తవ్వి వందల లారీల ద్వారా రవాణా చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారని విమర్శించారు. మల్లయ్యపేట ప్రాంతంలో రోజుకు 500 నుంచి 600 వరకు ఇసుక లోడుతో లారీలు తిరుగుతున్నాయని, దాంతో స్థానిక ప్రజలు దుమ్ము, కాలుష్యంతో ఊపిరితిత్తుల, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణనష్టం సంభవిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కోటిలింగాలపేటలో మొత్తం 15 ఇసుక ర్యాంపులు ఉండగా, వాటిలో కేవలం రెండింటికే అనుమతులు ఉన్నాయని, మిగతావి అన్నీ అక్రమంగా నడుస్తున్నాయని ఆరోపించారు. రెవెన్యూ, మైన్స్ శాఖ అధికారులు కళ్ళు మూసుకుని ఉండటంతో ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం నష్టమవుతోందని పేర్కొన్నారు. పేరుకు ఉచిత ఇసుక అని చెప్పినా, వాస్తవానికి వేల రూపాయలకు అక్రమంగా విక్రయిస్తున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాత్రింబవళ్లు తవ్వకాలు కొనసాగుతుండటంతో పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని చెప్పారు. ఈ ఇసుక దోపిడీని వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్, మైన్స్ శాఖ అధికారులను భరత్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.