డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: అయినవిల్లి మండలం కే జగన్నాధపురం గ్రామంలో అధికార పార్టీ ఆకృత్యాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. వైయస్ఆర్‌సీపీ మండల కన్వీనర్ మేడిశెట్టి శ్రీనివాస్‌కు చెందిన నిర్మాణాన్ని కూల్చివేయడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. బాధితుల వివరాల ప్రకారం, ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, ముందస్తు హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా నిర్మాణం కూల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అధికార పార్టీ నేతలకు రెవెన్యూ, పోలీస్ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు తీవ్రంగా విమర్శించారు. తాము రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నందుకే లక్ష్యంగా చేసుకుని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని, తక్షణమే ఈ చర్యలను నిలిపివేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.