మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం

 
తీవ్రంగా ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  

 ప్రజల్లో మావిగన్‌ ప్రతిపాదనపై చర్చను దారిమళ్లించేందుకే అసభ్యకర భాష 

రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు, మహిళలపై దూషణలు  

చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కుట్రల్లో ఇది భాగం 

రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని శాంతియుత నిరసనల మధ్య మా పార్టీ నేతల డిమాండ్‌  

ఆ వ్యాఖ్యలను సమర్థించడం చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌కు మహిళలపై ఉన్న ద్వేష భావానికి నిదర్శనం 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో ‘మావిగన్‌’ ప్రతిపాదనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారిమళ్లించేందుకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలను ఉద్దేశించి అసహ్యకర, దిగజారిన భాషతో వ్యాఖ్యలు చేశారని  వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదని, రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే కాకుండా కించపరిచేలా చేసిన దాడిగా భావించాలన్నారు. 

ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. రాధాకృష్ణ వివక్ష పూరిత జర్నలిజంతో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘రేపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముక లేని నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో ఉన్నారంటూ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. 

 
ఇది మహిళలను అవమానించడానికే కా­దు.. ప్రజల్లో ‘మావిగన్‌’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడా­నికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం. మావిగన్‌ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడి­యా కుట్రలో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూష­ణలకు దిగారు. మా పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసనలతో రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. కానీ, ఇటువంటి జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకపోగా చంద్రబాబు, నారా లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌లు మద్దతు ఇవ్వ­డం మహిళలపై వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని వైఎస్‌ జగన్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు.   

Back to Top