పి4 పథకం ద్వారా ఎంతమందికి న్యాయం జరిగింది

మాజీ మంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు

ప్ర‌కాశం జిల్లా: పి4 పథకం ద్వారా ఎంతమందికి న్యాయం జరిగింద‌ని మాజీ మంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు కూట‌మి ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. ఒంగోలు న‌గ‌రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పరిశీలకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరై మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి, కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తదితర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..కరోనా సమయంలో రైతులతో పాటు ప్రతి వర్గాన్నీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారని గుర్తుచేశారు. తాము చేసిన సేవలను సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయామని, అయితే ప్రస్తుత అధికార పార్టీనే ఇప్పుడు ఆ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తోందని అన్నారు. అందుకే ప్రజలు జగన్ వెంట నిలబడుతున్నారని, మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో పార్టీ నాయకత్వం కార్యకర్తలకు అండగా నిలుస్తూ అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటోందని కారుమూరి పేర్కొన్నారు. అమరావతికి జగన్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, గత ఐదేళ్లలో అక్కడ శాశ్వత భవనాల నిర్మాణం జరగలేదని, ఇప్పుడు అయినా నిర్మించాలని కూటమి నేతలకు సవాల్ విసిరారు.

పి4 పథకం ద్వారా ఎంతమందికి న్యాయం జరిగిందో చెప్పాలని, “సూపర్ సిక్స్” హామీల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ లోపల, బయట కూడా అధికార పార్టీ నేతలు జగన్ పేరును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోకుండా పరిపాలన గాలికొదిలేసి “రెడ్ బుక్ పాలన”తో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కూటమి నేతలను డిమాండ్ చేశారు. దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం రఘురామకృష్ణరాజు చేశారని, అందుకే ఆందోళనలు చోటుచేసుకున్నాయని అన్నారు. కులాల మధ్య విభేదాలు రేపే ప్రయత్నాలు మానుకోవాలని కూటమి నేతలకు సూచించారు. క్రైస్తవ మతానికి సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.
 

Back to Top