నెల్లూరు: మత్స్యకారుల ఆధీనంలో ఉన్న తమిళ జాలర్ల బోట్లను వారికి చెప్పకుండా అపహరించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఎంపీ బీదా మస్తాన్ రావు సహా టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని తోటయ్య వీడియోనే సాక్షిగా రుజువైందని, ఆ బోట్లను తక్షణం తెచ్చి యథాస్థానంలో ఉంచాలని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులు రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేరుగ మురళీధర్ లతో పాటు మత్స్యకార నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. బోట్ల అపహరణకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రణాళిక రూపొందించారని, దీనికి ముఖ్యమంత్రి సహా, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, జిల్లా ఎస్పీ, కావలి డీఎస్పీ, సీఐ అందరూ సమాధానం చెప్పాలన్నారు. మత్స్యకారులకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలబడి పోరాడుతుందని, వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక ఈ కుట్రపై పూర్తిగా విచారణ జరిపి దాని వెనుక ఇంకా ఎవరెవరున్నారో వాళ్లందర్నీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మత్స్యకారుల కష్టాలను చూసి చలించిపోయి వారి కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించడం దారుణమన్నారు. ఫిషింగ్ హార్బర్ భూముల్లో 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్‌కి కేటాయించడం మత్స్యకారుల కడుపుకొట్టడమేని మండిపడ్డారు. మత్స్యకారులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వారి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం త్వరలోనే సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళీధర్ స్పష్టం చేశారు. వారు ఇంకా ఏమన్నారంటే.. టీడీపీ నాయకులే కుట్ర చేసి తరలించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చి మన జలాల్లోకి ప్రవేశించి మన మత్స్యసందపను దోచుకునిపోతున్న బోట్లను జాలర్లతో సహా మన మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. 4 మెకనైజ్డ్ బోట్లను మన ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే తమిళ జాలర్లతో కుమ్మక్కైన టీడీపీ నాయకులు, మన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఆ బోట్లను విడిపించారు. ఇది రాజకీయాలకు అతీతంగా డీల్ చేయాల్సిన అతి సున్నితమైన ఈ అంశం. అందుకే మొన్న జువ్వలదిన్నె ప్రైవేటీకరణపై చేపట్టిన నిరసన సందర్భంగా కూడా ఈ విషయాన్ని వైయస్ఆర్‌సీపీ నాయకులెవరూ ప్రస్తావించలేదు. టీడీపీ నాయకుల సాయంతో పట్టుకెళ్లిన బోట్లను పోలీసుల సాయంతో తిరిగి యథాస్థానంలో తెచ్చి పెడతారని మూడు రోజులుగా చూశాం. కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఒకరిపైఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టదన్నట్టు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. వీడియో సాక్షిగా టీడీపీ కుట్ర బట్టబయలు నిబంధనల ప్రకారం మెకనైజ్డ్ బోట్లతో 22.2 నాటికల్ మైళ్ల దూరంలో వేట కొనసాగించాలి. కానీ తమిళ జాలర్లు తీరప్రాంతం వరకూ వచ్చి మనవాళ్లు కట్టుకున్న వలలను తెంచి పడేసి, వారి మెకనైజ్డ్ బోట్లతో మన వారి బోట్లను ధ్వంసం చేసి మత్య్య సంపదని దోచుకెళ్లి పోతున్నారు. దీంతో మన మత్స్యకారులు జీవన భృతికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఎంతోకాలంగా జరుగుతున్న ఈ దారుణాలపై పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకున్న పాపానపోవడం లేదు. పోలీసులు చేయాల్సిన పని చేయకపోయినా, మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఆ బోట్లను జాలర్లతో సహా నిర్బంధిస్తే వాటిని ఎవరికీ చెప్పకుండా వదిలేయడం దుర్మార్గం. మన మత్స్యకారుల కడుపు కొట్టడమే. ఈ బోట్లను అక్రమంగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన నాయకులెవరో ఇస్కపల్లెపాలెం గ్రామానికి చెందిన కాపు తోటయ్య స్పష్టంగా చెప్పాడు. మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు బోట్లు తరలిస్తున్నామని కావలి సీఐ ఫోన్ చేసి చెప్పాడని, దీంతోపాటు ఎంపీ బీదా మస్తాన్ రావు నాతో రెండు నెలలుగా మాట్లాడుతున్నాడని ఆ బోట్లను తప్పిస్తే ఒక్కో బోటుకు రూ.10 లక్షల చొప్పున రూ. 40 లక్షలు చెల్లిస్తామని చెప్పాడని వెల్లడించాడు. (ఇందుకు సంబంధించి తోటయ్య మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). రెండు రోజులు అరిచి గోల చేసి ఆ తర్వాత మత్స్యకారులే గమ్మునుంటారులే అని టీడీపీ నాయకులు భావించారు. అందుకే కుట్ర పన్ని అర్ధరాత్రి బోట్లను అక్రమంగా తరలించారు. ప్రధాన సూత్రధారి బీఎంఆర్, వ్యూహకర్త కొల్లు రవీంద్ర అక్రమంగా బోట్లు తరలించే కుట్రలో ప్రధాన సూత్రధారే బీదా మస్తాన్‌రావు. అయినా తనకే సంబంధం లేదన్నట్టు ప్రధాని, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, ముఖ్యమంత్రి పేర్లు మధ్యలోకి తీసుకొచ్చి కళ్లబొల్లి కబుర్లతో బిల్డప్ ఇస్తున్నాడు. తోటయ్య కాల్ డేటా చెక్ చేస్తే బీదా మస్తాన్‌రావు భండారం మొత్తం బయటపడి పోతుంది. వారిని ప్రలోభపెట్టి లోబర్చుకుని వారిని కుట్రకు ఉపయోగించు కోవడమే కాకుండా తీరా భండారం బయటపడ్డాక కాపు పెద్దను ఇరికించాలని చూస్తున్నాడు. దొంగిలించిన బోట్లను తెప్పించి వాటిని యథాతథ స్థానంలో ఉంచే ప్రయత్నం చేయకుండా తమిళనాడు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టరేట్‌లోనే ఈ కుట్రకు పథక రచన చేశాడు. చివరికి కావలి సీఐ, డీఎస్పీలపై మన మత్స్యకారులు అనుమానించినట్టే జరిగింది. లోకేష్ పర్యటన సందర్భంగా వాటిని టెస్ట్ చేసి పనిచేస్తున్నాయని నిర్ణయించుకున్న తర్వాత దొంగతనానికి వ్యూహ రచన జరిగింది. ఈ బోట్ల గురించి ఎవరైనా మత్స్యకారులు టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తే సీఐ, ఎస్సైలు బెదిరించేవాడు. మత్స్యకార గ్రామాల్లోకి పోలీసులు వెళ్లి దీనిపై ఎవరైనా మాట్లాడితే దొంగ కేసులు పెట్టి అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారు. ఇంతకన్నా మోసం ఉంటుందా? కాపాడాల్సిన ప్రభుత్వమే వేధించడం భావ్యమా? మత్స్యకారుల కలను నెరవేర్చిన వైయస్ జగన్ మత్స్యకారుల సంక్షేమం కోసం వైయస్ జగన్ గారు వారి ఎన్నో దశాబ్దాల కలను నెరవేరుస్తూ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ఏర్పాటు చేస్తే దాని పనులు పూర్తి చేయకుండానే శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా అందులో 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్‌కి కేటాయించారు. డిఫెన్స్ సిబ్బంది అక్కడప్రయోగాలు చేస్తే చేపలు చనిపోతాయని, తమను ఆ ప్రాంతంలోకి వారు అనుమతించరని మత్స్యకారులు మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. సాగర్ డిఫెన్స్ కంట్రోల్‌కి మత్స్యకారులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ ఛలో జువ్వలదిన్నె కార్యక్రమం నిర్వహిస్తే మమ్మల్ని అడ్డుకోవాలని చూశారు. నెల్లూరు జిల్లాలో మత్స్యకార గ్రామాల్లోకి పోలీసులను పంపించి బెదిరింపులకు దిగుతున్నారు. పోలీస్ మార్క్ రాజకీయం చేయడం మానుకోవాలి. మత్స్యకారుల బలం తెలియకపోతే తెలుసుకోవాలి. వైయస్ జగన్ గారు సీఎం కాకపోయుంటే ఈ ప్రాంతానికి ఇప్పటికీ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వచ్చేది కాదని మత్స్యకారులే చెబుతున్నారు. అలాంటిది ఆయన వేసిన శిలాఫలకం పగలగొట్టినంత మాత్రాన వైయస్ జగన్ గారు చేసిన మంచిపనిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. కూటమి ప్రభుత్వం వేసిన శిలాఫలకంలో ఎక్కడా స్థానిక జెడ్పీటీసీ, సర్పంచ్ పేరు కూడా లేదు. మత్స్యకారులంటే అంత చులకనా మీకు? ఆ బోట్లను తీసుకొచ్చి యథాతథ స్థానంలో పెట్టాల్సిందే ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అనేది మన మత్స్యకారుల హక్కు. మత్స్యకారులకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలబడి పోరాడుతుంది. వారికి నూటికి నూరు శాతం హక్కు కల్పించేలా పోరాడదామని ఆయన స్పష్టంగా చెప్పారు. మత్స్యకారుల కోసం ఎందాకైనా పోరాడదామని, ఈ పోరాటంలో ఆయన కూడా పాల్గొంటారని చెప్పారు. మత్స్యకారుల నిర్బంధంలో ఉండగా దొంగిలించిన బోట్లను తక్షణం తీసుకొచ్చి యథతథ స్థానంలో పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుది, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐలదే. తక్షణం బోట్లను తిరిగి తెప్పించకపోతే ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదు. మత్స్యకారుల ధ్యేయమే వైయస్ఆర్‌సీపీ లక్ష్యం. ప్రభుత్వం మారిన తర్వాతైనా ఈ కుట్రపై విచారణ జరిపించి అందుకు కారకులైన వారిని మత్స్యకారుల ముందు నిలబెడతాం. ● రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మత్స్యకారులకు వైయస్ జగన్ గారు ఇచ్చిన వరం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. మత్స్యకారులు చేపల వేటకు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా స్థానికంగానే వేట కొనసాగిస్తూ కుటుంబాలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించి 70 ఎకరాల్లో హార్బర్ నిర్మాణం చేపట్టారు. అటువంటి మత్స్యకారుల ఆస్తిని ప్రైవేటుపరం చేస్తూ 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కట్టబెట్టడం దారుణం. ఈ ప్రైవేటీకరణను వైయస్ఆర్‌సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక ప్రైవేటీకరణను రద్దు చేస్తాం. మన మత్స్యసందపను దోచుకుంటున్న వారిని, వారికి అండగా నిలుస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఈ సమస్యపై త్వరలోనే మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ● మేరుగ మురళీధర్, గూడూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త అండగా ఉండాల్సిన అధికారులే కుట్రలకు పాల్పడటం హేయం. ఇలాంటి దారుణాలు కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. మత్స్యకారులను ఇబ్బందిపెట్టే ఏ చర్యను వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. మత్స్యకారుల సంక్షేమమే వైయస్ఆర్‌సీపీ లక్ష్యం. భవిష్యత్తులో దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.