తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో ఐదేళ్ల పాటు ప్రజాసేవలో విశేష కృషి చేసిన సర్పంచ్‌లకు ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఏప్రిల్ 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న సందర్భంగా, వారి సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేశారు. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రజాప్రతినిధులను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్‌లు అధికారానికి కాదు, అభివృద్ధికి ప్రతీకలుగా నిలిచారని కొనియాడారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి అంత స్థాయిలో ఉందని, తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రారంభోత్సవాలు చేసుకునేంత పనులు మిగిలేలా చేశామని అన్నారు. చంద్రగిరిని అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిపామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్‌లు తమ కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేశారని అన్నారు. కష్టకాలాల్లోనూ, పండుగలలోనూ, విపత్తుల సమయంలోనూ అందరూ ఒకటిగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసి సర్పంచ్‌ల గౌరవాన్ని పెంచామని తెలిపారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, కళ్యాణ మండపాలు, మహిళా భవనాలు, యోగ కేంద్రాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. చంద్రగిరిలో జరిగిన అభివృద్ధి “నభూతో నభవిష్యత్తు”గా నిలిచిందని అన్నారు. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, గతంలో మంజూరు చేసిన పనులకే ఇప్పటికీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని విమర్శించారు. సర్పంచ్‌లుగా ఉన్నప్పుడు రాజకీయాలకు దూరంగా పనిచేసిన మీరు, ఇకపై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఓట్ల లెక్కింపులో జరిగిన విషయాలను ప్రజలు ఆలోచించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొనేందుకు అందరూ ఒక కుటుంబంలా పోరాడాలని పిలుపునిచ్చారు. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానం అత్యంత గౌరవనీయమని అన్నారు. చేసిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోందని, మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రస్తుత సర్పంచ్‌లే గెలుస్తారనే నమ్మకం ఉందన్నారు. భవిష్యత్తులో పార్టీకి సేవలు అందించేందుకు అందరూ సిద్ధం కావాలని కోరారు. ఈ సభలో పాల్గొన్న సర్పంచ్‌లు తమ పదవీకాలంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేయాలని సంకల్పించారు.