వైయస్ఆర్ జిల్లా: రాయచోటి నుంచి కడపకు వస్తున్న దారిలో గువ్వలచెరువు రెండవ ఘాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కోరారు. గువ్వలచెరువు ఘాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ, కారు ఢీకొని బద్వేలు మండలం చింతపుత్తయపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి మృతిచెందడం హృదయ విదారకమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. శనివారం పోరుమామిళ్ల పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీ గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా అకాల మరణం పొందడం బాధాకరమన్నారు. శోకసంద్రంలో ఉన్న మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణ కోసం గువ్వలచెరువు ఘాటుపై టన్నెల్ నిర్మాణం చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీకి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి , నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి , మున్సిపల్ చైర్మన్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాగం సుబ్బారెడ్డి, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు, రవి శంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నారాయణరెడ్డి, గంగయ్య, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధ పరామర్శ వైయస్ఆర్ జిల్లా గువ్వల చెరువు ఘాట్ దగ్గర లారీ కారు ను ఢీ కొట్టిన సంఘటనపై బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చింతపూత్తయ పల్లె కి చెందిన శ్రీకాంత్ రెడ్డి సతీమణి సునీత అక్కడిక్కడే మృతి చెందడంతో పాటు వారి వదిన పిల్లలు ఇద్దరు కూడా మరణించడం, బంధువులు మరో ఇద్దరు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన దాసరి సుధ కడప రిమ్స్ దగ్గరకు వెళ్ళి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్ కు సూచించారు అనంతరం మార్చురీలో భౌతిక కాయాలను సందర్శించారు.