విజయనగరం: ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరుఫున కూటమి ప్రభుత్వాన్ని వైయస్ జగన్ నిలదీస్తే, కనీసం దానిపై సమాధానం చెప్పే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలో హామీల అమలును అటకెక్కించిన ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకనేందుకు ప్రశ్నించిన వైయస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శల దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించేందుకే జూన్ 4న వెన్నుపోటుదినంను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అనుసరిస్తున్న విధానాలపై మీడియా ముఖంగా ప్రతిపక్షనేత వైయస్ జగన్ పలు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలపై తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరూ సూటిగా జవాబు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పులపై కూటమి నేతలు చెప్పిన అబద్దాలు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, వైయస్ఆర్‌సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై తప్పుడు కేసులు, బేతాళకథలు మాదిరిగా సృష్టించిన మద్యం స్కామ్‌లపై కూడా వైయస్ జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వాటిపై ఏ ఒక్క నాయకుడు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలతో మాట్లాడలేదు. దీనికి బదులుగా కూటమి పార్టీల నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలతో వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచారు ఈ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తోంది. హామీల అమలు జాడే లేదు. జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించి వైయస్ఆర్‌సీపీ నేతృత్వంలో ప్రజలతో కలిసి నిరసనలు తెలియచేయబోతున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోవడంతోనే ఈ నిరసనను చేపడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు లేవు. రాష్ట్రానికి భారీగా నిధుల వరదను తీసుకువస్తున్నాం, ఉపాధి హామీ నిధులను తీసుకువస్తున్నాం అని ప్రకటించారు. దేశ చరిత్రలోనే జరగని విధంగా ఏప్రిల్, మే నెలలకు సంబంధించి కూలీలకు వేతనాలను కూడా చెల్లించడం లేదు. ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు? ప్రజల గురించి ఈ ప్రభుత్వం కనీసం ఆలోచించడం లేదు. కూలీలకు చెల్లించేది రూ.800 కోట్లు వరకు ఉంటుంది. ఏడాదిలో దాదాపు రూ.1.40 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. దానిలోంచి కూలీలకు వేతనాలను కూడా చెల్లించలేరా? తరువాత కేంద్రం నిధుల నుంచి రీయింబర్స్ చేసుకోలేరా? సంపద సృష్టించడం తెలుసు అన్న పాలకులకు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించే పరిస్తితి లేదు. ఇలా ఉంది చంద్రబాబు పాలన. రైతులు అల్లాడిపోతున్నారు రైతులకు కూడా ఈ పాలనలో మేలు జరగ లేదు. పండించిన పంటలకు గిట్టుబాటుధరలు లేవు. తడిచిన ధాన్యంను కొనుగోలు చేసే వారు లేరు. పొగాకు రైతు పరిస్థితి దారుణంగా మారింది. పొగాకు, మిర్చి, ధాన్యం, టామాటా, మామిడి ఇలా ఏ పంటకూ సరైన మద్దతుధర లేక రైతుల అల్లాడిపోతున్నారు. కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఎక్కడా స్పష్టత లేదు. విశాఖలో కొన్ని కంపెనీలకు రూపాయి కంటే తక్కువకే వేల కోట్ల రూపాయల విలవైన భూములను కట్టబెట్టారు. లులూ వంటి సంస్థలకు కారుచౌకగా ఖరీదైన భూములను అప్పచెప్పడం దోపిడీ కాదా? అస్తవ్యస్త పాలనతో దోపిడీకి దిగారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ... విజయనగరంలో ఉగ్రలింకులపై పోలీస్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాం. ఇలాంటి భయాందోళనకర పరిస్థితులు ఏర్పడకూడదని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడా మతపరమైన విద్వేషాలు లేవు. వేర్వేరు మతాల పండుగలను అందరూ కలిసి చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ.