తాడేపల్లి: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది 'దగానాడు'గా చరిత్రలో నిలచిపోతుందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా చంద్రబాబు తన పాలనా కాలంలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. జిల్లాల్లో జరుగుతున్న తెలుగుదేశం మినీ మహానాడులు దీనికి అద్దం పడుతున్నాయని, ఎమ్మెల్యేలు, నాయకుల ఆక్రోశ మినీమహానాడులుగా మారిపోయాయని గుర్తు చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది, సంక్షేమానికి దూరమై, కస్టోడియల్ టార్చర్‌కు కేరాఫ్‌గా మారిపోయిందని అన్నారు. ఎటువంటి కనీస ఆధారాలు లేకుండానే కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే కక్షసాధింపుల్లో భాగంగానే వైయస్ జగన్‌పై లిక్కర్ స్కామ్ అంటూ నిందలు మోపుతుననారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే.... కడపలో మహానాడు పేరుతో దగానాడును నిర్వహించబోతున్నారు. ఇది ఏపీ ప్రజలకే కాదు, జెండా మోసిన ప్రతి టీడీపీ కార్యకర్తకూ దగానాడు. జిల్లాల్లో జరుగుతున్న మినీ మహానాడులు పార్టీ నేతల ఆక్రోశనాడులుగా మారిపోయాయి. ఒక టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఏ రకంగా మినీమహానాడులో ఆక్రోశం వెల్లబుచ్చారో రాష్ట్రం అంతా చూశారు. ఏడాది కాలంగా తమను నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఏమీ చేయలేకపోయామని, తమను క్షమించాలంటూ ప్రజలను, కార్యకర్తలను వేడుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్క మేలు కూడా చేయలేకపోయామంటూ మరికొందరు నాయకులు మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితం అంటున్న చంద్రబాబు, రెడ్‌బుక్ స్టార్ లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీరందరికీ సూపర్ బాస్ మోదీలు ఈ రాష్ట్రానికి ఏడాది పాలనలో చేసిన ఒక్క మేలును కూడా చూపలేని పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తులు తెల్లమొఖం వేస్తున్నారు. తెలుగుదేశం శ్రేణుల్లోనే నైరాశ్యం ప్రజలు మాకు ఓట్లు వేసి దగాపడ్డారంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలే మినీమహానాడుల్లో వాపోతున్నారు. పొత్తుల వల్ల తెలుగుదేశంకు సరైన పదవులు దక్కడం లేదు, కమ్యూనిస్ట్‌లు ఎలా అయితే పొత్తులతో కనుమరుగు అయ్యారో, తెలుగుదేశంకు కూడా అదే గతి పడతుందని మరో నాయకుడు బాహాటంగానే మినీ మహానాడులో వ్యాఖ్యానించడాన్ని ప్రజలు చూశారు. మరో జిల్లాలో మినీమహానాడుకు అధ్యక్షత వహించాల్సిన నాయకుడే ముఖం చాటేశాడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఉన్న తెలుగుదేశం వేరు, ఇప్పుడు ఉన్న పార్టీ వేరని ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాను అని చెప్పుకునే మరో సీనియర్ నాయకుడికి కనీసం బ్యానర్ కూడా వేయలేదని పార్టీ కార్యకర్తలు అల్లరి చేశారు. మరో జిల్లాలో కార్యకర్తలను కనీసం పలుకరించే వారే లేరని, జైలుకు వెళ్లిన వారికి ప్రాధాన్యత అన్నారు, కానీ నేడు చిల్లర కొట్టే వారికే పదవులు ఇస్తున్నారని కార్యకర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కుమారుడు మాట్లాడుతూ వైయస్ జగన్ ప్రభుత్వంలో మాకు మర్యాద దొరికింది, నేడు కూటమి పాలనలో మాకు కొద్దిపాటి గౌరవం కూడా దక్కడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాగానే పసుపు బిళ్లలు జేబులు తగిలించుకుని పోతే, కూర్చీవేసి, కాఫీ, టీలు ఇచ్చి పనిచేసి పంపుతారని ఒక నేత పిలుపునిచ్చారు. కానీ నేడు ప్రభుత్వ ఆఫీస్‌లకు వెడితే పురుగుల కంటే హీనంగా చూస్తున్నారని ఆ మాజీ మంత్రి కుమారుడు బహిరంగంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో రాష్ట్రానికి, ప్రజలకు, జెండా మోసిన కార్యకర్తలకు కూడా మోసాన్నే మిగిల్చారు. మినీ మహానాడుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాదాతప్త హృదయాలతో కన్నీరు మున్నీరయ్యారు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపుతున్న ఈనాడు కిరణ్ దివంగత సంపాదకుడు రామోజీరావు కుమారుడు కిరణ్ తన పత్రిక ఈనాడులో తెలుగుదేశం పార్టీ విధానంలోనూ సూపర్ సిక్స్ అంటూ జాకీలు పెట్టి చంద్రబాబును పైకి లేపే ఒక కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంను చూసి టీడీపీ కార్యకర్తలే నవ్వుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ పతనం మొదలయ్యిందీ అనేందుకు మినీ మహానాడుల్లో వ్యక్తమవుతున్న ఆక్రోశాలే నిదర్శనం. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్లుగా కనీసం ఆ పార్టీ కార్యకర్తలకు కూడా మేలు జరగలేదు. తండ్రీ కొడుకులు ప్రతిరోజూ మూటలు కట్టుకోవడానికే పరిమితమయ్యారు. ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు ఏపీలో తల్లికి వందనం పథకం అమలు జరుగుతోందని పచ్చి అబద్దం చెప్పారు. వారు సంపద సృష్టించుకోవడానికే పరిమితమయ్యారు. ప్రజల సొమ్ముతో హెలికాఫ్టర్‌లు, విమానాల్లో నెలకు రూ. 6 నుంచి 7 కోట్లు ఖర్చు చేసి, తమ ఇళ్ళలో వాడుకునే కాయగూరలు తెచ్చుకుంటున్నారు. జనం సొమ్ముతో సోకులు చేసుకుంటున్నారు. వైయస్ జగన్‌పై రాజకీయ కక్షతోనే లిక్కర్ స్కామ్ సృష్టి రాజ్యహింసకు, పోలీస్ వేధింపులకు కేంద్రంగా ఏపీ నిలబడుతోంది. చంద్రబాబు, పవన్, లోకేష్ ల నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్‌కు కేరాఫ్‌గా మారింది. కక్షసాధింపులకు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. ఆనాడు సోనియాతో కుమ్మకై, చీకట్లో చిదంబరాన్ని కలిసి వైయస్ జగన్‌ను పదహారు నెలలు జైలుకు పంపితే, ఎటువంటి అనుభవం లేని జగన్ తనను యాబై మూడు రోజుల పాటు జైలుకు పంపారనే కక్షతో చంద్రబాబు రగిలిపోతున్నారు. లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై ఉన్న ముద్దాయి చంద్రబాబు. లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి ప్రతీకార కేసులను పెట్టించే కార్యక్రమానికి తెగబడ్డారు. దీనిలో భాగంగా ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రోజుకో కథనం రాయిస్తున్నాడు. మొదట్లో విజయసాయిరెడ్డిపై కథనాలు రాశారు. ఆయన పార్టీ నుంచి దూరం కాగానే రాజ్ కేసిరెడ్డి ప్రధాన సూత్రదారి అంటూ కథనాలు రాశారు. తాజాగా లిక్కర్ స్కామ్‌లో నగదుతో బంగారం కొన్నారని, ఈ అవినీతి సొమ్ము విదేశాలకు తరలించారని, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఐఎఎస్ ధనుంజయరెడ్డి ఈ స్కామ్‌లో కీలకం అంటూ రాశారు. నేడు ఈ స్కామ్‌కు ఎంపీ మిధున్‌రెడ్డి కర్తా, కర్మా అంటూ రాసుకుంటూ పోయారు. వారికి సంబంధించిన పీఎల్ఆర్ కంపెనీకి ఈ నిధులు వెళ్ళాయంటూ మరో కథనం రాశారు. ఇలా రోజుకో రకంగా ఏది పడితే అది, ఎలా అనుకుంటే అలా తప్పుడు కథనాలు రాసుకుంటూ పోతున్నారు. చివరికి లక్షల పేజీల మెమరీని, కీలక ఆధారాలను నాశనం చేశారంటూ మరో విచిత్ర కథనం రాసుకున్నారు. ఈ కేసులో కోర్ట్‌లో బెయిల్ విచారణలు వస్తున్నప్పుడల్లా ఏదో ఒక విషపు కథనాన్ని ప్రచురించి, న్యాయస్థానాలను కూడా పక్కదోవ పట్టించాలనే కుట్ర దీనిలో ఉంది. నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపైన కూడా తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపారు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తన సినిమా కోసం థియేటర్ యాజమాన్యాలను బెదిరిస్తున్న పవన్ వైయస్ జగన్ ప్రభుత్వంలో తక్కువ రేట్లకే ప్రజలు సినిమాలు చూడాలని టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ జీఓ తెచ్చింది. దానిపై ఆనాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మా డబ్బుతో సినిమాలు తీసి, మా ఇష్టం వచ్చిన రేట్లకు టిక్కెట్లు అమ్ముకుంటుంటే అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటని ప్రశ్నించారు. నేడు తమ సమస్యలపై థియేటర్ యాజమాన్యాలు సినిమాలను ప్రదర్శించడాన్ని నిలిపివేస్తూ సమ్మె ప్రకటించాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సమ్మె ప్రకటించిన థియేటర్ యాజమాన్యాలపై కేసులు పెట్టాలని, చర్యలు తీసుకోవాలని జనసేన నుంచి ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న సినిమాటోగ్రఫీ మంత్రి ఏకంగా పోలీసులకు లిఖిత ఆదేశాలు జారీ చేశారు. ఇదీ పవన్ కళ్యాణ్ ద్వందవైఖరికి నిదర్శనం. ఆనాడు టిక్కెట్ రేట్లపై మీరెవరూ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ నేడు తన మంత్రి ద్వారా థియేటర్‌లను బెదిరించడం, జైళ్ళకు పంపుతామంటూ ఆదేశాలు ఇప్పించడం ఆయన దివాలాకోరుతనం కాదా? తన సినిమా రిలీజ్ అయిన తరువాత థియేటర్లు సమ్మెలోకి వెళ్లినా ఆయనకు అభ్యంతరం ఉండదు. మల్టీ ప్లెక్స్‌ల మాదిరిగా అద్దెతో పాటు షేరింగ్ కూడా ఇవ్వాలని థియేటర్‌లు అడగడంను జీర్ణించుకోలేక పోతున్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనకు రాజకీయ జీవితాన్ని కల్పించిన ఎన్డీఆర్‌కు అంత్యక్రియలు జరిపించిన ఘనుడు. వైయస్ఆర్‌సీపీ గురించి ప్రజలు చూసుకుంటారు. మంత్రి పదవి ఇవ్వలేదని ఎన్డీఆర్‌కు చేసినట్లుగా మరెవరికీ అంత్యక్రియలు చేయకుండా చూసుకోవాలని ఆయనకు సూచిస్తున్నాం. మంత్రి వాసంసెడ్డి సుభాష్ పిల్ల గాడిద. అదే అనుభవంతో ఆయన మాట్లాడుతున్నాడు.