కంకిపాడు: విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారు. కస్టడీ నిమిత్తం వంశీని కంకిపాడు తీసుకొచ్చారు. కస్టడీ అనంతరం స్టేషన్‌లోనే ఉంచారు. అస్వస్థతకు గురి కావడంతో వంశీని కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్‌లోనే వంశీ వాంతులు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని నడిపేవారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండి కానీ మనిషిని చంపి పైశాచికానందం పొందాలనుకోవడం సరికాదు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పుచేశాడంట. అప్పుడేమో చంద్రబాబుకి.. లోకేష్ కి సమ్మగా ఉందంట.. ఇప్పుడేమో పగలదీస్తారంట. తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరు. వేలాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కొట్టడం.. నడవలేకుండా చేస్తున్నారు. ఎవడ్ని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులను తెచ్చారు. రేపైనా ఇలాగే ఉంటుంది. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం కంకిపాడు ప్రభుత్వాసుపత్రి నుంచి వంశీని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీకి తరలించారు. కంకిపాడు పీఎస్‌లో వంశీ విచారణ బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్‌ను శుక్రవారం కంకిపాడు పోలీసుస్టేషన్‌లో పోలీసులు విచారించారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీని 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.