విశాఖ: వైయస్ఆర్ జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో మూడేళ్ళ బాలికపై హత్యాచారం ఘటన దారుణమని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. వరుదు కళ్యాణి ఏమన్నారంటే.. మూడేళ్ళ ముక్కుపచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేయడం ఎంత దారుణమైన సంఘటన, హృదయవిదారకం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ ఇలాంటి వార్తలు వినాల్సిన దుస్ధితి మనకు వచ్చింది. ఆ చిన్నారి తల్లి ఈ రోజు మాకు న్యాయం చేయండని ధర్నా చేస్తుంటే కనీసం మంత్రులు కానీ మహిళా హోంమంత్రి స్పందించలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. మంత్రులంతా కడపలో మహానాడు ఏర్పాట్లపై బిజీగా ఉన్నారు. చిన్నారిపై హత్యాచారం చేసిన కామాంధుడు మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడంటే కారణం విచ్చలవిడిగా బెల్టుషాపులు, మద్యం అమ్మకాలు కారణం కాదా?. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవడానికి మద్యం మహమ్మారి కారణం కాదా, రాష్ట్రంలో ప్రతిరోజూ 70-80 కేసులు మహిళలపై నమోదవుతున్నాయంటే గంటకు 3-4 కేసులు నమోదయ్యే పరిస్ధితి నెలకొంది. అయినా ఈ కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. మహిళల రక్షణ గాలిలో దీపంలా మారింది. హోంమంత్రి అనిత మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చన్నారు, అమ్మా హోంమంత్రిగారు ఏపీలో ఏ మహిళ ప్రశాంతంగా నిద్రపోతుంది సమాధానం చెప్పు, ఎక్కడైనా మహిళకు రక్షణ ఉందా, నాడు వైయస్ జగన్ ప్రవేశపెట్టిన దిశ వ్యవస్ధను మీరు నిర్వీర్యం చేశారు, అడుగడుగునా మహిళల రక్షణకు వైయస్ జగన్ పెద్దపీట వేస్తే మీ కూటమి ప్రభుత్వంలో కనీస రక్షణ కరువైంది. ఇప్పటికైనా సీఎం, హోంమంత్రి, మంత్రులు వెంటనే స్పందించి ఆ చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలి, నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఆ తల్లి కోరుకుంటున్నట్లుగా ఆ చిన్నారి కుటుంబానికి తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.