మద్యం కేసులో సొంత ట్రయల్‌కు ఎల్లో ముఠా ప్రయత్నం

వైయ‌స్ఆర్‌సీపీ నేత పోతిన వెంకట మహేష్‌ ధ్వజం

వాళ్లే ఆరోపణలు చేస్తారు. ఆధారాలున్నాయంటారు

మళ్లీ ఆ ఆధారాలు చెరిపేశారని కథనాలు రాస్తారు

కోర్టుల్లో బెయిల్‌ పిటిషన్లు వస్తే, కొత్త ఆరోపణలు

అలా వ్యవస్థల ప్రభావితం కోసం ప్రయత్నిస్తున్నారు

అందులో భాగంగా రోజుకో బేతాళ తరహా కథ

తాజాగా 350 టెరా బైట్ల డేటా ధ్వంసం అంటూ స్టోరీ

పోతిన వెంకట మహేష్‌ స్పష్టీకరణ

ఇవన్నీ చూస్తే కేసులో ఆధారాలు లేవని అర్థమవుతోంది

మనుషులను బెదిరించి, భయపెట్టి, లొంగ దీసుకుని.. 

ప్రలోభ పెట్టి తీసుకున్న తప్పుడు వాంగ్మూలాలు, స్టేట్‌మెంట్స్‌ 

అవి తప్ప కేసులో ఏ సరుకూ, ఎవిడెన్స్‌ లేదని తేలుతోంది

అందుకే ఇప్పటి వరకు ఏ ఆధారమూ చూపలేకపోయారు

తేల్చి చెప్పిన పోతిన వెంకట మహేష్‌ 

సజ్జల రామకృష్ణారెడ్డిగారిపైనా అదే తరహా కుట్ర

ఆయన భూకబ్జా చేశారంటూ ఆరోపణలు, కథనాలు

ఎల్లో మీడియా రాయడం, ప్రభుత్వం ఓవరాక్షన్‌ చేయడం

ఇదే తంతు అదే పనిగా చేస్తున్నారు 

నిజానికి ఆ భూములతో సజ్జలకు సంబంధం లేదు

ఇదే విషయాన్ని ఆయన పలుసార్లు స్పష్టం చేశారు

అయినా ఎల్లో ముఠా దారుణంగా ట్రయల్స్‌ చేస్తోంది 

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన పోతిన మహేష్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేత పోతిన వెంకట మహేష్‌ ప్రెస్‌మీట్‌.

తాడేపల్లి: లిక్కర్‌ స్కామ్‌ అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో ఎల్లో మీడియా ముఠా సొంత ట్రయల్స్‌ కోసం ప్రయత్నిస్తోందని, ఆ విధంగా వ్యవస్థలను ప్రభావితం చేయాలని చూస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నేత పోతిన వెంకట మహేష్‌ స్పష్టం చేశారు. అందుకే ఎల్లో ముఠా రోజుకో బేతాళ కధ రాస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డిగారిపైనా ఎల్లో ముఠా దారుణంగా కుట్ర చేస్తోందని పోతిన మహేష్‌ తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో పోతిన వెంకట మహేష్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

ప్రజల్లో విస్తృత చర్చ:
    లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో చంద్రబాబు , ఆయన ప్రభుత్వం వేస్తున్న కక్ష పూరిత కేసులు, దాని కోసం చట్టాన్ని ఉల్లంఘించి, దర్యాప్తు సంస్థలను చేతిలోకి తీసుకుని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు మీద జగన్ లేవనెత్తిన అంశాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో ప్రజలను పక్కదోవ పట్టించడానికి, చంద్రబాబు , ఆయన ముఠా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. 

ఎల్లో మీడియా ట్రయల్స్‌:
    తమకు తాముగా ట్రయల్‌ చేయడానికి ఎల్లో ముఠా ప్రయత్నిస్తోంది. ముందు వాళ్లే ఆరోపణలు చేస్తారు. ఆధారాలు ఉన్నాయంటారు. మళ్లీ వారే ఆ ఆధారాలు చెరిపేశారని రాస్తారు. కోర్టుల ముందుకు బెయిల్‌ పిటిషన్లు వస్తుంటే, మళ్లీ సరికొత్త ఆరోపణలు చేసి, వ్యవస్థలను ప్రభావితం చేయాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు.         అందులో భాగంగా ఒక్కోరోజు ఒక్కో బేతాళ తరహా కథను వండి వారుస్తున్నారు. తాజాగా డేటా డిలీట్‌ చేశారని చేస్తున్న ప్రచారం, దానిపై రాసిన కథనాలు చూస్తే.. ఇంకో బేతాళ కథ రెడీ అయ్యిందన్న విషయం అర్థమవుతోంది. 350 టెరా బైట్ల డేటాను డిలీట్‌ చేశారని, ఫోరెన్సిక్‌కు కూడా దొరక్కుండా చేశారని కొత్త బేతాళ కథలో రాశారు.  

ఏ ఆధారాలు లేనందునే..:
    ఈ బేతాళ కథ ద్వారా ఒక్కటే స్పష్టమవుతోంది. మీ (ప్రభుత్వం) దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని. మీరు మనుషులను బెదిరించి, భయపెట్టి, లొంగ దీసుకుని, ప్రలోభపెట్టి తీసుకున్న తప్పుడు వాంగ్మూలాలు, స్టేట్‌మెంట్స్‌ తప్ప, ఏ సరుకూ, సాక్ష్యాలు, ఆధారాలు లేవన్నది అర్ధమవుతోంది. అందుకే ఇప్పటివరకూ వివిధ కోర్టుల్లో, పలు విచారణ సందర్భాల్లో ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు.

అదే జరిగితే కేసులు ఎందుకు పెట్టలేదు?:
    ఎల్లో ముఠా రాసినట్లు రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ బీసీఎల్‌)లో డేటా ధ్వంసం చేస్తే, అది పెద్ద తప్పు అవుతుంది కదా? మరి అలాంటప్పుడు కేసు ఎందుకు పెట్టలేదు? ఒక సంస్థలో డేటా అలా ధ్వంసం చేస్తే, ఆ శాఖది కూడా తప్పు అవుతుంది కదా? మరి కేసులు ఎందుకు నమోదు చేయలేదు?.
    అంతే కాకుండా వివిధ కంపెనీలకు సంబంధించి లిక్కర్‌ సరఫరా, కొనుగోలు, ఎక్సైజ్‌ మినహాయింపులు, ఆ ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు కూడా మాయం అయ్యాయని అంటున్నారు. మరి అది కూడా నేరమే అయినప్పుడు ఆ కేసులు కూడా ఎందుకు పెట్టలేదు?.

ఎందుకంత దారుణంగా కట్టుకథ?:
    దేశంలో ఏదైనా కంపెనీని చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసినప్పుడు దాని కార్యకలాపాలు, ఉత్పత్తులు, సరఫరా, ఎండ్యూజర్లు.. ఇదంతా ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు. ప్రతి దశలోనూ డిజిటిలైజేషన్‌ ప్రక్రియ ఉంటుంది. ఆ మేరకు వారు పన్ను చెల్లింపులతో పాటు, మినహాయింపు కూడా పొందుతారు. కాబట్టి, ఒకవేళ ఇక్కడ డేటా డిలీట్‌ అయితే సంబంధిత శాఖల వద్ద, ఆయా ఏజెన్సీల వద్ద ఉంటుంది కదా? అలాంటప్పుడు అసలు డేటా లేకుండా చేశారని కట్టుకథ రాయడం ఎందుకు?.
    పైగా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే స్వయంగా మద్యం షాప్‌లు నిర్వహించింది కాబట్టి, మద్యం కంపెనీల నుంచి బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు, అక్కణ్నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు, తర్వాత యూజర్లకు మద్యం సరఫరా అయింది. ఈ మొత్తం ప్రక్రియలో క్యూఆర్‌ కోడ్‌ అనేది చాలా కీలకం. ఎంత సరుకు వచ్చింది? ఎంత సరఫరా అయింది? ఏ బ్రాండ్‌ ఎంతమేర వెళ్తోంది? అన్నదానిపై అధికారికంగా తెలిసేది. అలాంటి వ్యవస్థల్లో డేటా చెరిపేశారని, దొరకడం లేదని తప్పుడు రాతలు రాయడం వీరికే చెల్లంది. 

మిథున్‌రెడ్డికి ఏం సంబంధం?:
    లిక్కర్‌ స్కామ్‌ అంటూ కొనసాగిస్తున్న వేధింపులో మొన్నటి వరకు రాజ్‌ కేసీ రెడ్డి కీలకం అన్నారు. ఆ తర్వాత రిటైర్డ్‌ ఐఏఎస్‌ కె.ధనుంజయరెడ్డి, ప్రభుత్వ మాజీ అధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు మళ్లీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అంటున్నారు. లోక్‌సభ సభ్యుడైన మిథున్‌రెడ్డికి రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలతో ఏం సంబంధం?

బెవరేజెస్‌ కార్పొరేషన్‌తో ఆయనకు ఏ సంబంధం ఉంటుంది?
    అప్పుడు రాష్ట్రంలో అమలు చేసిన లిక్కర్‌ పాలసీతో తనకు సంబంధం లేదని, తాను ఏనాడూ ఎలాంటి సమావేశాల్లో పొల్గొన లేదని.. దాన్నే మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి, గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా నిరూపించాలని మిధున్‌రెడ్డి సవాల్‌ చేశారు. దానిపై ఇప్పటి వరకు ఎవరూ నోరు మెదపడం లేదు. మిథున్‌రెడ్డికి చెందిన సంస్థలోకి డబ్బు బదిలీ అయ్యిందని అంటున్నారు. సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు సహజమే కదా? అది చట్టబద్ధంగా జరిగిందా? లేదా? అన్నది చూడాలి కానీ, ఇష్టానుసారం ఆరోపణలు చేస్తారా?.
    తీసుకున్న డబ్బు తిరిగి వెళ్లిందని వాళ్లు చెబుతున్నారు. మరి అలా డబ్బు తీసుకుని, తిరిగి చెల్లిస్తే.. ఇందులో తప్పు ఏముంది? స్కాం ఎక్కడ ఉంటుంది? స్కాం చేసేవాళ్లు తిరిగి చెల్లిస్తారా? డబ్బు వచ్చిన విషయం చెప్పి, తిరిగి చెల్లించన విషయాన్ని దాచేస్తున్నారు. ఇప్పుడు ఈ కథనాలన్నీ ఎందుకు రాస్తున్నారంటే.. మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొద్దిరోజుల్లో హైకోర్టు ముందుకు రాబోతుంది. అందుకనే న్యాయవ్యవస్థను, చట్టాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

సజ్జలపై కుట్ర:
    సజ్జల రామకృష్ణారెడ్డి  కటుంబీకులకు సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా ఎల్లో మీడియా రాయడం, ప్రభుత్వం ఓవర్‌ యాక్షన్‌ చేయడం చూస్తున్నాం. ఆయన 1993లో కొనుగోలు చేసిన భూమి అది. ఆ తర్వాత చంద్రబాబుగారు మూడు సార్లు సీఎం అయ్యారు. అప్పుడు ఏ తప్పూ కనిపించలేదు. కానీ ఇప్పుడు అక్కడేదో జరిగినట్లు, అధికారుల మీద ఒత్తిడి తీసుకు వచ్చి, తప్పుడు ఆరోపణలు చేసి, తమ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు.
    నిజానికి 2000వ‌ సంవత్సరం నుంచి ఆ భూములతో సజ్జల రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అదే విషయాన్ని ఆయన అనేకసార్లు స్పష్టం చేశారు. అయినా కూడా ఆ భూములపై రాస్తూ, ఆయన ఫోటో వేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అలా ఎల్లో ముఠా  మొత్తం ట్రయల్‌ చేసి, తప్పులు చేయకపోయినా.. వారికి నచ్చని వ్యక్తులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇలాంటి కుట్రలేవీ ఎల్లకాలం చెల్లవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పోతిన వెంకట మహేష్‌ స్పష్టం చేశారు.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
    సినిమాలు, టికెట్ల ధరలపై పవన్‌ గతంలో ఏమన్నారు.. సినిమా వాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ల బతుకేదో వారు బతుకుతారు. సినిమా టికెట్ల ధరలు నిర్ణయించడానికి మీరెవ్వరు? అన్నారు. వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. ఎవరూ జోక్యం చేసుకోకూడదని పవన్‌ గతంలో మాట్లాడారు.
    మరి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతోంది. ఈ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్‌ ఉన్నారు కదా? ఈయన జనసేనకు చెందిన మంత్రి కదా?. ప్రభుత్వమే ప్రభుత్వంపై దర్యాప్తు చేస్తుందా? ఆయన కూడా ప్రభుత్వంలో ఒక భాగమే కదా? ఆయన ప్రభుత్వంలో ఉన్నారా? లేదా?  ఎవరు, ఎవరి మీద దర్యాప్తు చేస్తారు? హోం శాఖ కార్యదర్శికి వీరు చెబుతారా? అని పోతిన మహేష్‌ సూటిగా ప్రశ్నించారు.

Back to Top