రాజధానికి దూరం సమస్య కాదు.. అభివృద్ధి ముఖ్యం

టీడీపీని బతికించుకోవడం కోసమే చంద్రబాబు జోలె పట్టుకున్నాడు

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వేరువేరు కాదు..ఇద్దరు ఒక్కటే  

 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

 తాడేపల్లి: రాజధానికి దూరం అన్నది సమస్య కాదు.. అభివృద్ధి ముఖ్యమని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  వెంటిలేటర్‌ మీద ఉన్న తమ పార్టీని బతికించుకోవడం కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోలె పడుతున్నారని  విమర్శించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టడానికే చంద్రబాబు చందాలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు చంద్రబాబు జోలె పట్టలేదని ధ్వజమెత్తారు. లక్ష కోట్ల రాజధానికి రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.  రాష్ట్ర డీజీపీ ఉత్తరాది ప్రాంతానికి చెందిన వాడంటూ ఆరోపణలు చేస్తున్న  చంద్రబాబు తన హయాంలో ఉత్తరాదికి చెందిన అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంత రైతులు బాబు ఉచ్చులో పడొద్దని, వారి సమస్యలను హైపవర్‌ కమిటీకి వినిపించండని ఆయన విఙ్ఞప్తి చేశారు. రాజధానికి దూరం అనేది సమస్య కాదు అభివృద్ధి ముఖ్యం.. రోడ్డు, సీ, ఎయిర్ కనెక్టివిటీ అన్ని విశాఖపట్నంలో ఉన్నాయన్నారు. దక్షిణాదిలో ఉన్న నాలుగు రాష్ట్రాల ప్రజలకు రాజధానులు దూరంగానే ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

చంద్రబాబు యాత్రలకు ప్రజల నుంచి స్పందన లేదని, రాజధాని జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే ప్రజల నుంచి ఆయనకు మద్దతు కరువైందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు రాజధానిపైనా మాటలను వక్రీకరించారని మండిపడ్డారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం అని మాట్లాడుతున్న చంద్రబాబు.. మోదీ శంకుస్థాపన ప్రాంతంలో శాశ్వత కట్టడమైననా నిర్మించారా అని ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ ఎందుకు వెళ్లాడో తెలియదని, కానీ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వేరువేరు కాదని.. ఇద్దరిదీ ఒకే మాట అన్నారు. బీజేపీ నాయకులు కూడా రాజధానిపై తలో మాట మాట్లాడుతున్నారు.. రాజధాని అమరావతిగా పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం పెట్టారా అని  ప్రశ్నించారు. అమరావతి పెట్టేటప్పుడు కనీసం రాజకీయ పార్టీల అభిప్రాయం అయినా చంద్రబాబు నాయుడు తీసుకున్నారా.. ఇప్పుడు రాజధానిపై అన్నిపార్టీలు కలిసి రావాలని చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతారని ఆయన మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

Back to Top