వైయస్‌ఆర్ జిల్లా: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం కూడా లేదన్నారు. 2014 మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తరువాత మూలన పడేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
చరిత్ర హీనుడు చంద్రబాబుః
చంద్రబాబు రాజకీయ చరిత్ర మొత్తం హీనాతి హీనమేనని చెప్పాలి. మామకు వెన్నుపోటు పొడవడంతోనో.. మరే ఇతర కారణాలతోనో గతంలో మూడుసార్లు అధికారాన్ని చేపట్టినా, ఈరాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రి అనే పేరును తెచ్చుకోలేకపోయాడు. బాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల రాష్ట్రప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. బాబు అధికారంలో ఉన్న 14 ఏళ్ళలో.. 13 ఏళ్లపాటు రాష్ట్రంలో కరువు తాండవిస్తే.. మరో ఏడాది వరదలతో ముంచెత్తిపోయింది. ఇది ఆయన పాదం మహిమ అని కూడా చెప్పాలి. ప్రజాసేవ చేయలేనోడు ప్రజాక్షేత్రంలో సుదీర్ఘకాలం ఉండటమనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఖర్మగానే చెప్పుకోవాలి.
ప్రగల్భాలతో భ్రమలు కల్పించడమే బాబు రాజకీయమా..?ః
"గాలిని ఆపాను.. తుపానులను నేనే అడ్డుకున్నాను. దేశానికి ప్రధానుల్ని చేశాను. సెల్లుఫోను నేనే కనిపెట్టాను" అంటూ రకరకాల సొల్లుకబుర్లు చెప్పుకునే చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు మేలు చేయలేకపోయాడో ఎవరికీ అంతుబట్టని విషయం. అసలు, ఈ విషయం ఇప్పుడెందుకు నేను చెబుతున్నానంటే.. ప్రస్తుతం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌లు పర్యటనలు చేస్తూ ప్రజలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకోలేకపోతున్నారని గుర్తుచేస్తున్నాను. ప్రగల్భాలు పలకడం, ప్రజల్లో భ్రమలు కల్పించడమే రాజకీయంగా ఆ తండ్రీ కొడుకులు భావిస్తున్నారు. ఇదంతా పాత చింతకాయపచ్చడని పాపం బాబుకు అర్ధంకావట్లేదు.
మేనిఫెస్టో అంటే బాబు దృష్టిలో చిత్తుకాగితంః
ఎన్నికల మ్యానిఫెస్టో అంటే ఆయన దృష్టిలో ఒక చిత్తుకాగితం. పైగా, మ్యానిఫెస్టో హామీలపై ప్రజలు ఎక్కడ తనను నిలదీస్తారనే భయంతో గతంలో దాన్ని మాయం చేసిన ఘనుడు ఈ చంద్రబాబు. బాబు మ్యానిఫెస్టోలో చెప్పేది కొండంత. చేసేది మాత్రం గోరంత కూడా ఉండదనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో దాదాపు 650కి పైగా హామీలతో మ్యానిఫెస్టోను ప్రజల ముందుకు తెస్తే.. దానిలో కనీసం ఆరు హమీలనైనా నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు మిగిలిపోయాడు.
హవాయి చెప్పులతో తిరిగిన బాబు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు?:
తన సొంత ప్రాపకం చూసుకోవడానికి మాత్రమే అధికారాన్ని అడ్డం పెట్టుకునే చంద్రబాబుకు పేదలకు మేలు చేయడమంటేనే తెలియదని చెప్పాలి. తన హయాంలో రైతురుణమాఫీ, డ్వాక్రారుణమాఫీ, నిరుద్యోగభృతి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా బాబు మార్కు పాలనను ప్రజలకు రుచి చూపించాడు. తన పాలనలో ప్రజలకు గుర్తుండిపోయే విధంగా, అద్భుతమైన పథకం ఒక్కటైనా తెచ్చానని చంద్రబాబు గుండెలమీద చెయ్యేసుకుని చెప్పగలడా..? అని ప్రశ్నిస్తున్నాను. దీనికి ఆయన సమాధానం చెప్పాలి. లంచాలు, అవినీతి దందాలతోనే బాబు పాలనంతా నడిచింది కనుకనే రాష్ట్ర బడ్జెట్‌ను దోచుకున్న ముఠాగా ముద్రపడ్డారు. చిత్తూరులో హవాయి చెప్పులతో తిరిగిన చంద్రబాబు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు గడించాడంటేనే ఏ విధమైన దోపిడీకి పాల్పడ్డాడో ప్రజలకు అర్థమవుతోంది.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అవినీతి చక్రవర్తి చంద్రబాబుః
కార్పొరేట్ కంపెనీలు, బినామీల్ని పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ఖజానాను దోచుకున్న దోపిడీ దొంగగా చంద్రబాబును చెప్పాలి. అభివృద్ధి పేరుతో ఎక్కడా ఒక్క కొత్త ప్రాజెక్టునైనా చేపట్టకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అవినీతి చక్రవర్తిగా చంద్రబాబు పెరెన్నికబడ్డాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బాబు చేసిన దోపిడీ దురాగతాలతోనే దేశవ్యాప్తంగా మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ అవినీతి రాష్ట్రంగా కీర్తించబడిందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో బాబు ప్రజల ముందుకు వస్తే ఆయన్ను ఖచ్చితంగా నిలదీస్తారని భయపడి.. ఈరోజు ఆయన కొడుకు లోకేశ్‌ను యాత్రల పేరుతో పంపుతున్నాడు. లోకేశ్ రాజకీయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మంగళగిరి పేరును మందలగిరి అని పలికే లోకేశ్‌ను నేనొకటి అడుగుతున్నాను. మంగళగిరిలో ఒక వీధి పేరు చెబుతావా..? అని అడుగుతున్నాను. కనీసం, ఒక్క ఊరిపేరు చెప్పలేనోడివి నువ్వొక పులివా..? పిల్లివా..? అని ప్రశ్నిస్తున్నాను. కడప, పులివెందుల, కమలాపురం అభివృద్ధి గురించి మాట్లాడటానికి లోకేశ్ ఎవరు అని నిలదీస్తున్నాను. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి, తాను మంత్రిగా ఉండి, మంగళగిరిలో పోటీచేసి దాదాపు రూ.120 కోట్లు ఖర్చుపెట్టినా గెలవలేని చవట లోకేశ్. నాలుగు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేశ్ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డాడు. లోకేశ్.. ఐటీశాఖను కుంభకోణాలకు పుట్టిల్లుగా మార్చాడు. ఫైబర్‌నెట్ కుంభకోణంలో కొన్ని వందల కోట్లు దోచుకున్నారని ఎంక్వైరీలో తేలింది. ఈ కేసులో లోకేశ్ రేపోమాపో జైలుకు పోవడం ఖాయం. ఇదొక్కటే కాకుండా అన్ని శాఖల్లో హోల్‌సేల్ కమీషన్లకు లోకేశ్ కేరాఫ్‌గా నిలిచాడు. దేవాలయాల్లో టాయిలెట్ల శుభ్రం చేసే కాంట్రాక్టు దగ్గర్నుంచి ఇసుక అమ్ముకోవడం వరకు అంతా లోకేశ్‌మయంగానే టీడీపీ హయాంలో నడించింది.
తండ్రీకొడుకులిద్దరూ చంద్రగిరిని వదిలి పారిపోయారుః
రాజకీయ పిల్లి లోకేశ్‌ను చూసి ఎవన్నా భయపడతారా. ఎవరయ్యా నిన్ను చూసి భయపడేది..? అని అడుగుతున్నాను. కనీసం, సర్పంచ్‌గా గానీ వార్డు మెంబర్‌గానైనా గెలవని నిన్ను చూసి ఎవరో భయపడతారని నీకునువ్వే తొడలు కొట్టుకుంటావా..? దమ్ముంటే, మీ సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీచేయి. అక్కడ పోటీకి దిగే ధైర్యం తండ్రీకొడుకులకు లేదు. చంద్రగిరిని వదిలేసి, ఎక్కడ్నో ఉన్న మంగళగిరికి పోతానంటున్నావు. అసలు, చంద్రగిరిలో చంద్రబాబుకే ఠికాణా లేదని కుప్పంకు పారిపోయాడు. పోనీ, కుప్పంను ఏమైనా అభివృద్ధి చేశాడా..? అంటే అక్కడ బాబు చేసిందేమీ లేదు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాకనే కుప్పం రెవెన్యూ డివిజన్ జరిగింది. కుప్పంను మున్సిపాల్టీగా మార్చింది కూడా జగన్ గారి హయాంలోనే అని బాబు సైతం ఒప్పుకోవాల్సిందే.
జగన్ గారి ప్రభంజనానికి బాబులో భయంః
మాయమాటలు చెప్పి ప్రగల్భాలు పలికి ప్రజల్లో భ్రమలు కలిగించడమే రాజకీయమనుకున్న చంద్రబాబుకు... ఈరోజు రాష్ట్రంలో జగన్ గారికి ఉన్న జన ప్రభంజనాన్ని చూసి భయం పట్టుకుంది. అందుకే, బాబు రోజుకోతీరుగా బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.2.11 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. సింగిల్ గా పోటీ చేసి 151 స్థానాలు సాధించిన లీడర్ జగన్ గారు. అలాంటి మా నాయకుడిని విమర్శిస్తే.. బాబుకు, ఆయన కొడుకు లోకేశ్‌కి ప్రజల నుంచి పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నాను.