చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు

లైలా తుపాన్‌ పరిహారం సిగ్గులేకుండా ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు

బాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ధ్వజం

అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజలకు జరుగుతున్న మేలు చూసి ఓర్వలేక చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రైతులకు ఎగ్గొట్టిన డబ్బులను చంద్రబాబు ఆస్తులు అమ్మి కట్టించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉండగా రైతులకు సున్నావడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టాడన్నారు. గతంలో లైలా తుపాన్‌కు సంబంధించి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బాధ్యత ఉంటే.. తనకు సంబంధం లేదని, గత ప్రభుత్వంలో జరిగిందని సిగ్గులేకుండా చేతులు దులుపుకున్న వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నివర్‌ తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారని చెప్పారు. డిసెంబర్‌ 15వ తేదీ వరకు పంట నష్టం అంచనాలను రూపొందించాలని, 31వ తేదీలోపు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. పరిహారం మాత్రమే కాకుండా సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా ఇంత త్వరగా నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు ఉన్నాయా.. అని ప్రశ్నించారు. 

Back to Top