ప్రాజెక్టులపై మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది

శ్రీకాంత్ రెడ్డి
 

అనంతపురాన్ని బతికిస్తున్న హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇదే వ్యక్తులు గతంలో రాయలసీమ ప్రాంతాన్ని విపరీతంగా ద్వేషించారు. అసలు ఆ ప్రాంతానికి నీళ్లెందుకన్నారు. HNSS కు 40  టీఎమ్‌సీలకు జీవో ఇచ్చినా ఏమీ ఖర్చుపెట్టలేదు. అన్ని టీఎమ్‌సీలు అవసరం లేదని దాన్ని 5 టీఎమ్‌సీలకు కుదించిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. అది నిజమో కాదో సభలో రికార్డులతో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. 5 టిఎమ్‌సీలకు కుదించిన దాన్ని మా ప్రియతమ నాయకుడు వైయస్సార్ తిరిగి 40 టీఎంసీలకు చేసి తన ఐదేళ్ల పాలనా కాలంలో అనంతలో నీళ్లు పారించి, కరువును పారద్రోలారు. నేడు అనంతపురం జిల్లా హార్టీకల్చర్ హబ్ అయినా, ఈ ప్రాంతం నుంచి 400-500 టన్నుల కూరగాయలు హైదరాబాద్‌ కి రవణా అవుతున్నాయన్నా అందుకు కారకుడు దివంగతనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన నిర్మించిన ఆ ప్రాజెక్టుపైన ఆ తర్వాత వచ్చి 5కోట్లు, 6 కోట్ల మేర పెండిగ్ ఉన్న వర్కులను వందల కోట్లకు ఎస్టిమేషన్లు పెంచుకుని దోచుకున్నారు తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదు.
పోతిరెడ్డు పాడు సామర్థ్యం 10,000 క్యూసెక్కులు మాత్రమే. దాన్ని ఒకేసారి 46000 క్యూసెక్కులకు పెంచుంతుంటే ఇదే చంద్రబాబు నాడు వచ్చి బ్యారేజ్ మీద ధర్నాలు చేసింది నిజం కాదా? రాయలసీమకు అన్ని నీళ్లు ఎలా ఇచ్చేస్తారని అడ్డం పడింది వాస్తవం కాదా? నాటి ముఖ్యమంత్రి వైయస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా చూడలని చెప్పి పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచడమే కాకుండా, దానికి అనుబంధంగా కాల్వలు కూడా ఏర్పాటు చేసారు. వైయస్సార్ మరణించిన తర్వాత ఈ పదేళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానీ, చంద్రబాబు ప్రభుత్వం కానీ ఇక్కడ ఒక్కపని కూడా చేపట్టలేదు. కానీ వందల కోట్లకు టెండర్లు పిలిచి, సీఎం రమేష్ అనే బినామీకి టెండర్లు కట్టబెట్టారు. అతను ఇక్కడ దోచుకున్న ఆ సొమ్ముతో దుబాయ్ లో డాన్సులు వేయడం అందరూ చూసారు.
రాయలసీమకు నీళ్లివ్వద్దన వాళ్లే నేడు వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమ ప్రాజెక్టుల మీద చిత్త శుద్ధి లేదనడం హాస్యాస్పదంగా ఉంది. ఆగస్టు 13న వరద వచ్చిన దగ్గర నుంచీ పోతిరెడ్డి పాడు ద్వారా 56000 క్యూసెక్కులు వదిలాము. కేవలం చంద్రబాబు వైఫల్యం వల్ల, కాల్వల సామర్ధ్యం గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కెనాల్ కేరాయింగ్ కెపాసిటీ లేకుండా పోయింది.
గండికోట ప్రాజెక్టులో కూడా కాల్వల్లో కేరియింగ్ కెపాసిటీ లేదు. అయినా సరే ఎంత నీరు వచ్చినా తీసుకోండని ముఖ్యమంత్రి ఆదేశించడంతో 200 టీఎమ్‌సీలు తీసుకోగలిగాం. మొట్టమొదటిసారిగా సోమశిల ప్రాజెక్టు 75 టీఎమ్‌సీలు నిండింది, కండలేరు 46 టీఎమ్‌సీల వరకూ వెళ్లింది. ఆ ప్రాజెక్టుల చరిత్రలోనే ఇది ప్రప్రధమం. ఇదే కాకుండా బ్రహ్మం సాగర్ కు వెలిగోడు నుంచి సరైన కాలవ లేదని ఐదేళ్లుగా మేం ధర్నాలు చేసాం. అయినా ఏరోజూ చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైయస్ జగన్ అధికారంలోకి రాగానే వచ్చే ఏడాదైనా బ్రహ్మం సాగర్ ను 20 టీఎమ్‌సీలు నింపాలని చెబుతూ నిధులు విడుదల చేసారు. ఇవాళ బ్రహ్మం సాగర్ లో 6 టీఎంసీలు నింపగలిగాం.
చంద్రబాబు పులివెందులకు వెళ్లి పులివెందులకు నేను నీళ్లిచ్చా అంటాడు. గండికోట ప్రాజెక్టును 3 టీఎమ్‌సీలకు కుదించి, అక్కడ కృష్ణా నీళ్లు రావు, పెన్నా బేసిన్ చేద్దామని జీవో ఇచ్చిన పెద్దమనిషి ఈ చంద్రబాబు. కానీ వైయస్సార్ మాత్రం కడప, రాయలసీమ ప్రజల గుండెలు లబ్ డబ్ అని కొట్టుకోదు, గండికోట గండికోట అని కొట్టుకుంటుందని చెప్పి గండికోటను 26 టీఎమ్‌సీలకు పెంచారు. ఆ గండికోట పూర్తి చేసిన తర్వాత అక్కడినుండి పులివెందులకు పైడిపాలానికి, చిత్రావతికి ఎలా నీళ్లివ్వాలో మొత్తం డిజైన్ చేసి, ప్రాజెక్టు పూర్తి చేస్తే చంద్రబాబు వచ్చి గేట్లెత్తి నే పులివెందులకు నీళ్లిచ్చా అంటాడు. కడప జిల్లాలో మైమైతే కళ్లు తెరుచుకున్నాం. రాజకీయ నాయకులు ఇలా ఉంటారా అని ఆశ్చర్యపోయాం.
5లేక 10 శాతం పెండింగ్ ఉన్న వర్కులను వందల వేల కోట్లకు అంచనా వ్యయం పెంచి టెండర్లలలో దోచుకోవడమే చంద్రబాబు చేసిన పని.
పోలవరానికి 26 అనుమతులు కావాల్సి ఉంటే 24 అనుమతులు తెచ్చి వైయస్సార్ కాలవలు తవ్విస్తుంటే కోర్టుకుపోయి అడ్డుపడిన పెద్దమనుషులు ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏ ప్రాజెక్టు గురించీ మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు.
శ్రీశైలంలో 850 లెవల్ ఉన్నంత వరకూ నాలుగు జిల్లాలకు ఎంత వరకూ నీటిని అందించగలుగుతాం అనే ఆలోచన చేస్తున్నాం. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీ నింపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎన్నివేల క్యూసెక్కులకు ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచితే పూర్తి స్థాయిలో నీటిని వాడుకోవడం సాధ్యపడుతుందో అని ఆలోచించి, డిజైన్ చేసి వాటిని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనుకుంటున్నారు.
ప్రాజెక్టుల గురించి మా ప్రభుత్వాన్ని ఎవరూ శంకించాల్సిన పనిలేదు. ఈ సభ ద్వారా రాయలసీమ ప్రజలకు ఓ మాటిస్తున్నాం. శ్రీశైలంలోని ప్రతి నీటి చుక్కనూ వాడుకుంటామని, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తిగా నింపుతామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడి చిత్తశుద్ధిని చూసే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. రాయలసీమ మాత్రమే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి చూపుతాం. తెలిసీ తెలియని భాషతో ప్రాజెక్టుల గురించి అవాకులూ చెవాకులూ మాట్లాడవద్దని టీడీపీ నాయకులకు సూచిస్తున్నాను.

Read Also: ట్రిబ్యున‌ల్ నిబంధ‌న‌ల  ప్ర‌కారమే వైఎస్సార్ న‌డుచుకున్నారు

Back to Top