ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు బుద్ధిరాలేదు

మొన్న చిత్తుగా ఓడిన బాబు..జమిలి ఎన్నికల గురించి మాట్లాడటం విడ్డూరం

వైయస్‌ జగన్‌ లక్షలాది ఉద్యోగాలిస్తే..చంద్రబాబు తీసేస్తామంటున్నారు

చంద్రబాబుకు ధైర్యముంటే స్టేలు వెకేట్‌ చేయించుకొని విచారణకు సిద్ధం కావాలి

ప్రపంచంలో చంద్రబాబు అంతటి అవినీతిపరుడు ఉండరు

ఇంగ్లీష్‌పై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: చంద్రబాబును ప్రజలు ఎన్నికల్లో ఛీ కొట్టిన బుద్ధి రావడం లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సార్వాత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు కడపలో జమిలి  ఎన్నికల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు ఏం చేశారని వైయస్‌ఆర్‌ కడప జిల్లాకు వెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏసంఘటన జరిగినా రాయలసీమ గుండాలు, రౌడీలు అంటూ అగౌరవంగా మాట్లాడిన వ్యక్తికి వైయస్‌ఆర్‌ జిల్లా, చిత్తూరు జిల్లాలో పర్యటించడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ పదే పదే అబద్దాలు ఆడుతున్నారన్నారు. ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కడపలో చంద్రబాబు మాట్లాడుతూ..త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు జమిలీ ఎన్నికల్లో గెలుస్తారట అని ఎద్దేవా చేశారు. గతంలో 23 సీట్లు మాత్రమే వచ్చాయని, మళ్లీ ఎన్నికలు జరిగితే ఇన్ని సీట్లు కూడా రావన్నారు. మొన్ననే ప్రజలు తీర్పు ఇస్తే..మళ్లీ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు మాటలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది కాబట్టి చెబుతున్నామన్నారు. మాతో పెట్టుకుంటే మటాష్‌ అయిపోతావంటున్నారని, గతంలో చంద్రబాబు అసెంబ్లీలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి ఇవే మాటలు అన్నారని, ఆ తరువాత రెండు రోజులకే వైయస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మాకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగాలు ఉండవని చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు 1.40 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 2 లక్షలకు పైగా గ్రామవాలంటీర్‌ పోస్టులు భర్తీ చేస్తే ఇవేవి ఉండవని చంద్రబాబు హెచ్చరించడం దుర్మార్గమన్నారు. యువత చంద్రబాబు మాటలను గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు అంత అవినీతిపరుడు ఎవరు ఉండరని తేహెల్కా చెప్పిందన్నారు. అన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబుకు తన కేసులపై నమ్మకం ఉంటే కేసులు వెకెట్‌ చేసుకొని విచారణకు సిద్ధం కావాలన్నారు. వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. అన్ని కూడా బయటకు వస్తాయని, విచారణ నిక్కచ్చిగా జరుగుతుందన్నారు. నీ వల్లే చనిపోయిన  ఎన్టీ రామారావు కేసును కూడా విచారణ చేయిస్తామన్నారు. ఆంబోతు అంటే చంద్రబాబు అని కరెక్ట్‌గా సరిపోతుందన్నారు. విద్యార్థులు వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నతంగా చదివి విదేశాలకు వెళ్తుంటే..అది తన గొప్ప అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం బాధాకరమన్నారు. 
మేం ఏ రోజు కూడా ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించలేదన్నారు. నారాయణ, శ్రీచైతన్యలకు అప్పగించవద్దని ఆ రోజు వ్యతిరేకించామన్నారు. డబ్బులున్న వారు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారని, అందరికి ఆంగ్ల మాద్యమం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు ఇంగ్లీష్‌ మీడియంపై యూటర్న్‌ తీసుకున్నారని తెలిపారు. తెలుగు భాషపై మాకు ఉన్న గౌరవం మరొకరికి ఉండదన్నారు. పేదవారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
ప్రధానినీ తప్పుపడుతారేమో అంటూ చంద్రబాబు పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. మోదీపై వ్యక్తిగత ఆరోపణలు చేసింది మరిచిపోయావా బాబూ అంటూ ప్రశ్నించారు. బాలకృష్ణతో మోదీని తిట్టించలేదా అన్నారు. ఈ రోజు ప్రధానిపై పల్లెత్తు మాట మాట్లాడలేకపోతున్నావని విమర్శించారు. గతంలో సోనియాగాంధీ, ఇతర పార్టీ నేతలతో కలిసి మోదీకి వ్యతిరేకంగా తాను పోరాడుతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడేందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తీరు మార్చుకోకపోతే చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

Read Also: భారత రాజ్యాంగం మనల్ని బలోపేతం చేస్తోంది

Back to Top