ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు అధికారంలోకి రాలేడు

తెలుగుదేశం పార్టీ పతనం దిశగా పరుగులు పెడుతోంది

చంద్రబాబు సొల్లు విమర్శలు, ట్వీట్లను ప్రజలు ఎవరూ నమ్మొద్దు

ప్రజలకు మేము జవాబుదారీ.. బాబు ట్వీట్లు, జూమ్‌ మీటింగ్‌లకు కాదు

గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో రూ.15 వేల కోట్లు తీర్చాం

కరోనా టెస్టుల్లో ఏపీ రోల్‌మోడల్‌గా ఉందని కేంద్రం ప్రశంసించింది

సీఎం వైయస్‌ జగన్‌ ఏడాది పాలనను ప్రజలంతా మెచ్చుకుంటున్నారు

సీ–ఓటర్‌ సర్వేలో సీఎం వైయస్‌ జగన్‌ 4వ స్థానంలో నిలిచారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: ఏడాదికాలంలోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలన అందించారని, ఏడాదిపాలన తీరును ప్రజలంతా మెచ్చుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏడాది క్రితం వైయస్‌ఆర్‌ సీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ రోజు రోజుకు పతనం దిశగా పరుగులు పెడుతోందని విమర్శించారు. ఆ పార్టీని నడుపుతున్న చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ అయిపోయాడని, ఆయన కొడుకు లోకేష్‌ అప్‌డేట్‌ కాలేకపోతున్నాడని, అందుకే టీడీపీ ప్రజల మధ్యకు రాలేక నానా అగచాట్లు పడుతోందన్నారు. అందువల్ల వైయస్‌ఆర్‌ సీపీని చిత్రవిచిత్రంగా విమర్శించడంతో కొంతమేరకైనా లబ్ధిపొంది పార్టీని కాపాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిప‌డ్డారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి రహితమైన పాలన తీసుకురావాలనే తాపత్రయంతో సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారని, విప్లవాత్మక మార్పులతో ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. దేశంలోనే ఆంధ్రరాష్ట్రం ఆదర్శవంతమైన పాలన అందిస్తుందనే మాట ప్రజల చేత అనిపించుకోవాలనే తాపత్రయం, చిత్తశుద్ధితో సీఎం పరిపాలన చేస్తున్నారన్నారు. మళ్లీ నాలుగు సంవత్సరాల తరువాత ప్రజల ముందుకు వెళ్తామని, ప్రజలకు మేము జవాబుదారీ తప్ప.. చంద్రబాబు ట్విట్టర్, జూమ్‌ మీటింగ్‌లకు జవాబుదారీ కాదన్నారు.  

ఇంకా ఏం మాట్లాడారంటే..
ఈ సంవత్సరకాలంలో రాష్ట్రం ఆర్థికంగా చాలా ఒడిదొడుకుల్లో ఉంది. దీనికి కార‌ణం రాష్ట్ర విభజన ఒక్కటే కాదు.. ఐదేళ్ల చంద్రబాబు దౌర్భాగ్యపు దుబారా పాలన. దాన్నే అద్భుతం అనిపించుకోవడం కోసం తనకున్న మీడియా బలాన్ని ఉపయోగించుకున్నాడు. చంద్రబాబుది ప్రజావ్యతిరేక పాలన కాబట్టే కనీవిని ఎరుగుని రీతిలో టీడీపీ ఓటమి పొందింది. 

అధికారంలో ఉన్నప్పుడు విదేశీ పర్యటన పేరుతో ప్రత్యేక విమానాల కోసం రూ.100  కోట్లు ఖర్చు చేశాడు. ఏపీ సీఎం అయి ఉండి హైదరాబాద్‌లో ఉంటానని చెప్పి ఎన్‌ బ్లాక్‌లోని సీఎం కార్యాలయానికి రూ.14.63 కోట్లు ఖర్చు చేశాడు. హెచ్‌ బ్లాక్‌కు రూ.6.29 కోట్లు, ఫర్నిచర్‌ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశాడు. లేక్యూ గెస్ట్‌హౌస్‌ రిపేర్‌ కోసం రూ.947 కోట్లు ఖర్చు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు దుబారా అంతా ఇంతా కాదు.. గోదావరి పుష్కరాల ప్రచారం కోసం రూ.వందల కోట్లు, కృష్ణా పుష్కరాల ప్రచారాలకు రూ.వందల కోట్లు ఖర్చు చేశాడు. తాబేదారులందరికీ ప్రచారం కోసం ప్రకటనలు ఇచ్చి కమీషన్లు తీసుకునే పరిస్థితికి చంద్రబాబు దిగజారాడు. 

ఈ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చాక.. దుబారా ఖర్చు తగ్గింది. పారదర్శకమైన పాలన సాగుతోంది. ఐదేళ్లలో చంద్రబాబు పెట్టిన వేల కోట్ల రూపాయల బకాయిలను సీఎం వైయస్‌ జగన్‌ తీరుస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ కోసం చంద్రబాబు పెట్టిన రూ.960 కోట్లను వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం తీర్చింది. విత్తన సబ్సిడీకి పెట్టిన బకాయిల్లో రూ.384 కోట్లు తీర్చాం. ఎంఎస్‌ఎంఈలకు రూ.963 కోట్లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌లో రూ.1,880 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.685 కోట్లు, రైతుల విద్యుత్‌ సబ్సిడీలో రూ. 20 వేల కోట్లు చంద్రబాబు అప్పు పెడితే.. సీఎం వైయస్‌ జగన్‌ సర్కార్‌ రూ.8,655 కోట్లు తీర్చింది. అగ్రిగోల్డ్‌ బాధితులకు సీఎం వైయస్‌ జగన్‌ రూ.264 కోట్లు చెల్లించారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే ముందు పెట్టిన మొత్తం బకాయిల్లో రూ.15 వేల కోట్ల పైచిలుకు బకాయిలను వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైయస్‌ జగన్‌ తీర్చారు. 

ఏ అంశమైనా సరే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద, సీఎం వైయస్‌ జగన్‌ మీద బురదజల్లాలనే తాపత్రయంతోనే చంద్రబాబు ట్విట్టర్‌లో ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు చేస్తున్నారు. చంద్రబాబుకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్రవేసుకునేలా చక్కటి పాలన సీఎం వైయస్‌ జగన్‌ అందిస్తున్నారు. అది చూసి భరించలేక చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబు అధికారంలోకి రాలేరు.

వైయస్‌ఆర్‌ చనిపోబట్టి, వైయస్‌ జగన్‌ను చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి ఇబ్బందులు పెట్టబట్టి టీడీపీకి ఒక్కఛాన్స్‌ వచ్చింది. ఇక చంద్రబాబు, లోకేష్‌కు అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ అసలే లేదు. 

 కరోనా కట్టడిలో ఏపీ రోల్‌ మోడల్‌గా ఉందని కేంద్రం చెప్పిన మాట చంద్రబాబు వినపడడం లేదా..? ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిగ్గుగా అనిపించడం లేదా..? 4 లక్షల పైచిలుకు టెస్టులు ఇవాల్టికి చేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 48.51 ఉంటే.. ఏపీలో 64 శాతం ఉంది. వైరాలజీ ల్యాబ్‌లు అంతకు ముందు ఒక్కటి కూడా లేదు.. సీఎం వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత వాటిని 14కు పెంచడం జరిగింది. ప్రతి మిలియన్‌ జనాభాకు 7,419 వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఇన్‌ఫెక్షన్‌ రేట్‌ దేశంలో సుమారు 5 శాతం ఉంటే.. ఏపీలో కేవలం 0.96 శాతం మాత్రమే ఉంది. 

ఈ మధ్యకాలంలో దేశంలోని ముఖ్యమంత్రుల పాలన తీరు, పథకాల అమలుపై నిర్వహించిన సీ–ఓటర్‌ సర్వేలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోస్టు పాపులర్‌ సీఎంల జాబితాలో 4వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సంవత్సరకాలంలో రూ.40,139 కోట్లతో సుమారు 3.57 కోట్ల మందికి సీఎం వైయస్‌ జగన్‌ లబ్ధిచేకూర్చారు. ఒక్కపైసా అవినీతి లేకుండా డైరెక్టుగా లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లకే డబ్బు చేర్చగలిగాం. తెలుగు ప్రజల కీర్తిని బ్రహ్మాండంగా పెంచే కార్యక్రమం చేసిన ఘనత వైయస్‌ జగన్‌ది. రాబోయే 4 సంవత్సరాల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకొని మళ్లీ ప్రజల ముందుకు వెళ్తాం. చంద్రబాబు సొల్లు విమర్శలు, ట్వీట్లను ప్రజలు ఎవరూ నమ్మొద్దు’ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top