డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా?

నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి

దమ్ముంటే వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో చర్చకు రావాలి: మాజీ మంత్రి కాకాణి

డీఎస్సీ అవకతవకలపై నెల్లూరు కలెక్టర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతల వినతిపత్రం

నెల్లూరు: డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని కొనసాగిస్తోంది. డీఎస్సీ వ్యవహారంపై పారదర్శకంగా సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేతలు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడా?

ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. పైగా తిరిగి ఎదురుదాడికి దిగుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటివరకు ఈ వ్యవహారంపై సరైన సమాధానం చెప్పలేదు. పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు.

స్పోర్ట్స్ కోటాలో నిబంధనలకు పాతర

డీఎస్సీ నియామకాల్లో నిబంధనలకు పాతర వేసి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల అమ్మకాలకు పాల్పడ్డారు. జీవోలతో మాయ చేసి అభ్యర్థులను మోసం చేశారు. నిజంగా క్రీడల్లో పాల్గొని అర్హత సాధించిన వారికి ద్రోహం చేసి, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ అవినీతి సొమ్ము కోసం అక్రమాలకు పాల్పడ్డారు.

దమ్ముంటే చంద్రశేఖర్‌రెడ్డితో చర్చకు రావాలి

డీఎస్సీ అక్రమాలపై లోకేష్‌ను ప్రశ్నిస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చర్చకు రావాలంటూ అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్‌కు నిజంగా దమ్ముంటే వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో బహిరంగ చర్చకు రావాలి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయో లేదో ఆధారాలతో నిజనిరూపణకు సిద్ధం కావాలి.

సీబీఐ విచారణకు సిద్ధమై రాజీనామా చేయాలి

డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోంది? మంత్రి లోకేష్‌కు ఏ మాత్రం నైతిక బాధ్యత ఉన్నా సీబీఐ విచారణకు సిద్ధమై, విచారణకు సహకరించేందుకు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, డీఎస్సీ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top