తాడేపల్లి: బీసీలు రాజకీయంగా ఎదగడం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. నారా వారి నకిలీ కేసులో కారుమూరి సునీల్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా మారిందని, బీసీ నాయకులను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కారుమూరి సునీల్‌పై పెట్టిన కేసులు నిలవవని, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడు, బీసీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ దస్తగిరితో కలిసి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఏమన్నారంటే - నారా వారి నకిలీ కేసులో మరో బీసీ బలి నారా వారి నకిలీ కేసులో మరో బీసీని బలి చేశారు. వైయస్ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. బీసీలను అణచివేయటమే చంద్రబాబు లక్ష్యం. బీసీలు రాజకీయంగా ఎదగడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కరకట్ట ప్యాలెస్‌లోని కమిషన్ రాయుళ్లను ప్రశ్నిస్తే అరెస్టులు చేయటం దుర్మార్గం. నకిలీ మద్యం తయారీ గుట్టును రట్టు చేసిన బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. ఇప్పుడు కారుమూరి సునీల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. లేని కేసును ఉన్నట్టు చూపించి అరెస్టులు చేయటం దుర్మార్గం. - నాడు పారదర్శకంగా లిక్కర్ అమ్మకాలు అసలు జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు పారదర్శకంగా జరిగాయి. అప్పట్లో మద్యం దుకాణాలు, మద్యం విక్రయాలు బాగా తగ్గాయి. అలాంటప్పుడు కమీషన్లు ఎలా వస్తాయి? లిక్కర్ విక్రయాలు, షాపులను భారీగా పెంచిన ఈ కూటమి ప్రభుత్వంలోనే భారీ స్కాంలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా కొత్తగా అనుమతి ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు కమీషన్లు ఎలా వస్తాయి? 33 శాతం మద్యం షాపులను తగ్గించిన ఘనత జగన్‌ది. రూ.99లకే మద్యం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.120లకు అమ్ముతూ చంద్రబాబు కమీషన్లు గుంజుతున్నారు. కారుమూరి సునీల్‌పై పెట్టిన అక్రమ కేసు నిలవదు. ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఎంత అణచివేయాలని చూసినా బీసీలు భయపడరు" అని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. -బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు: రమేష్ గౌడు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ బాండ్లు, వందలాది హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పేదలు, బడుగు బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. గత 40 ఏళ్లుగా చంద్రబాబు బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో రజకులపై దాడులు జరిగాయి. కుప్పంలో బీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. భీమవరం ప్రాంతంలో బీసీ నాయకుడిని హత్య చేశారు. పల్నాడులో బీసీ యువకుడిపై దాడి జరిగింది. నిన్న ప్రకాశం జిల్లా ఈదరమూడిలో యాదవులను దూషిస్తూ మహిళలను అవమానించేలా దాడులకు పాల్పడ్డారు. సాధారణ బీసీలతో పాటు రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నాయకులను కూడా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. బీసీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. - బీసీల పక్షాన వైయస్సార్‌సీపీ పోరాటం మా నాయకుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం, అభివృద్ధి అందించారు. రాజకీయంగా ప్రోత్సహించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చే ప్రతిసారి చంద్రబాబు బీసీలను మోసం చేయడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలోని బీసీలంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తీవ్రంగా ఉంటుంది. జగన్ నాయకత్వంలో ప్రజల గొంతుకగా నిలబడి ప్రభుత్వ హామీల అమలు కోసం పోరాటం కొనసాగిస్తాం. జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రంలో పేదవాడి అభివృద్ధి సాధ్యమవుతుంది" అని రమేష్ గౌడు పేర్కొన్నారు.