డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందే

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పెద్దిరెడ్డి, భూమ‌న డిమాండ్‌

 తిరుపతి, కుప్పంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు

 తిరుపతి​: మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తిరుపతి, కుప్పంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. తిరుపతిలో పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో తిరుపతి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి భూమన అభినయ్, తిరుపతి–చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. తిరుపతిలో రౌడీయిజం పెరగడానికి అధికార పార్టీ స్థానిక నాయకత్వమే కారణమని విమర్శించారు. దీక్ష‌ల‌కు మాజీ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు సంఘీభావం తెలిపారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో రెండో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతిపురం మండల అధ్యక్షుడు బుల్లెట్ దండపాణి మాట్లాడుతూ, 2029 ఎన్నికల్లో కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించి, ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు.

Back to Top