న్యాయపరమైన పోరాటంలో పార్టీ శ్రేణులకు లీగల్ సెల్ అండగా నిలవాలి

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి 

 నంద్యాలలో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ విస్తృత స్థాయి సమావేశం

నంద్యాల: నంద్యాల: న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా నిలిచి, ప్రతి అంశాన్ని చట్టపరంగా ఎదుర్కొనేలా సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సూచించారు. నంద్యాల పట్టణంలో వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ విస్తృత స్థాయి సమావేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.  ఈ సమావేశానికి నంద్యాల అసెంబ్లీ సమన్వయకర్త శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి హాజరై న్యాయవాదులతో పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ న్యాయవాదులకు పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజాస్వామ్య, న్యాయపరమైన మార్గాల్లో ఎండగట్టాలని సూచించారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితుల్లో లీగల్ సెల్ మరింత చురుగ్గా పనిచేయాలని శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులకు ఎలాంటి న్యాయపరమైన సమస్య ఎదురైనా వెంటనే అండగా నిలిచి, అవసరమైన న్యాయ సహాయం అందించాలని సూచించారు. ప్రభుత్వ చర్యలపై చట్టపరమైన మార్గాల్లో పోరాడుతూ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేయాలని కోరారు.
 

Back to Top