అనంతపురం జిల్లా: యల్లనూరు మండలం మల్లగుండ్ల గ్రామంలో ప్రభుత్వ ఇసుక రీచ్ ఏర్పాటుపై నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామసభకు మల్లగుండ్లతో పాటు కల్లూరు, వెన్నపూసపల్లి, చిలమకూరు తదితర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయొద్దని స్పష్టం చేశారు. “ఇసుక రీచ్ మాకొద్దు.. మా ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి ఇసుకను తరలించనివ్వం” అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను, వారి అభ్యంతరాలను అధికారులు గౌరవించాలని సూచించారు. ఇసుక తవ్వకాల వల్ల వ్యవసాయం, భూగర్భ జలాలు, పర్యావరణంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని కోరారు. ఇసుకను భారీ స్థాయిలో తరలించడం వల్ల వ్యవసాయంపై ప్రభావం పడటంతో పాటు భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని, భారీ వాహనాల రాకపోకలతో గ్రామీణ రహదారులు దెబ్బతిని ప్రజలకు ఇబ్బందులు కలగవచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇసుకను లోతుగా తవ్వడం వల్ల భవిష్యత్తులో తలెత్తే నష్టాలను ముందుగానే అంచనా వేయాలని శైలజానాథ్ కోరారు. అనంతరం గ్రామస్తులు ఇసుక రీచ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు డాక్టర్ సాకే రిత్విక్ హృదయ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగతి ప్రతాపరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు సాయి ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ గంగాదేవి, మండల కన్వీనర్ శివశంకర్, వైయస్ఆర్‌సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అధికారుల తరఫున పొల్యూషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అధికారులు, ఆర్డీఓ ప్రేమ్‌నాథ్‌కుమార్, ఏడి ఓబుల్‌రెడ్డి, తహసీల్దార్ సింధు, డీటీ రాము తదితరులు హాజరయ్యారు.