ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం.. ప్రజల్లోకి మరింతగా వెళ్దాం

 వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి, కూటమి రెండున్నరేళ్ల పాలనకు తేడాను ప్రజలు గుర్తించారు.

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

 గ్రేటర్‌ విశాఖ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం

 మ్యానిఫెస్టోను పవిత్రంగా భావించి 99 శాతం అమలు చేశాం

తాడేపల్లి: ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని రాజకీయాల్లో విశ్వసనీయతకు కొత్త అర్థం తీసుకొచ్చింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబరు 23న తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వానికి, కూటమి రెండున్నరేళ్ల పాలనకు మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గమనించారని పేర్కొన్నారు. గతంలో మ్యానిఫెస్టో కేవలం ఎన్నికల సమయంలో విడుదల చేసే పుస్తకంగా ఉండేదని, ఎన్నికలు పూర్తయ్యాక దాన్ని పక్కన పెట్టే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మాత్రం మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి 99 శాతం హామీలను అమలు చేసిందని, తద్వారా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను తీసుకొచ్చామని చెప్పారు.

శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం..

ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం

“రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి అన్నది మనందరికీ తెలుసు. గత మన ప్రభుత్వానికి, ఈ రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారు. దేవుడి దయతో ఎవరూ చేయని విధంగా పరిపాలన చేశాం. రాజకీయ నాయకులపై విశ్వసనీయత తీసుకొచ్చింది మనమే. గతంలో మ్యానిఫెస్టో అంటే ఎన్నికల ముందు విడుదల చేసే పుస్తకం మాత్రమే. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చూశాం. కానీ మనం మ్యానిఫెస్టోను ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీతగా భావించి 99 శాతం అమలు చేశాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను తీసుకొచ్చాం.”

ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాం

“విద్యారంగంలో ఎవరూ చేయగలరా అని అనుకున్న పనులను చేసి చూపించాం. నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చాం. ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ, బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలు, ఆరో తరగతి నుంచే డిజిటల్‌ బోర్డులు, ఎనిమిదో తరగతి నుంచే ట్యాబ్‌లు ఇచ్చాం. ఈ మార్పుల తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం డిమాండ్‌ పెరిగింది. చివరకు సీటు కోసం ఎమ్మెల్యేల సిఫారసులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి మార్పులను చేసి చూపించిన ఘనత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానిదే.”

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేశాం

“వైద్య ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్ల సంఖ్యను 1000 నుంచి 3300కు పెంచాం. వైద్యం కోసం ఇచ్చే పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచాం. నాడు–నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. ఖాళీ పోస్టులను భర్తీ చేశాం. సూపర్‌ స్పెషలిస్టుల కొరతను కూడా గణనీయంగా తగ్గించాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణమైన మందులను అందుబాటులో ఉంచాం. గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌, ప్రతి పీహెచ్‌సీలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ప్రతి మండలానికి 104 అంబులెన్స్‌ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేశాం.”

రైతు దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాం

“వ్యవసాయ రంగంలో కూడా కనీవినీ ఎరుగని మార్పులు తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. వాలంటీర్లను నియమించి లంచం లేకుండా ప్రభుత్వ సేవలు అందించాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌లో నమోదు చేశాం. ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా అమలు చేశాం. ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను నియమించాం. ఎక్కడైనా రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వెంటనే అధికారులు అప్రమత్తమై సీఎం–యాప్‌ ద్వారా పంటల కొనుగోలు చేసే విధానం తీసుకొచ్చాం. మన ఐదేళ్ల పాలనలో రెండున్నరేళ్లు కోవిడ్‌ ఉన్నా ఏ రోజూ సాకులు చెప్పలేదు. అన్ని కార్యక్రమాలను కొనసాగించాం.”

ఇప్పుడు అంతా రివర్స్‌.. అస్తవ్యస్తంగా మారింది

“ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అంతా రివర్స్‌ అయిపోయింది. అంతా అస్తవ్యస్తంగా మారింది. రూపాయికి చాక్లెట్‌ వస్తుందో లేదో తెలియదు కానీ 99 పైసలకే విశాఖలో భూములు ఇచ్చేస్తున్నారు. ప్రతి ఊరిలో మద్యంతో పాటు గంజాయి కూడా దొరుకుతోంది. గుడి, బడి పక్కన కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి. నాడు గ్రామాల్లో మహిళా పోలీసుల ద్వారా వీటిని నియంత్రించగలిగాం. ఇప్పుడు యథేచ్ఛగా అన్నీ దొరుకుతున్నాయి. ప్రతి పనికీ లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నాడు వాలంటీర్లు ఇంటికొచ్చి సేవలు అందించే వారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుచేసి ఎవరైనా ప్రశ్నిస్తే సహించని పరిస్థితి ఏర్పడింది.”

అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేశారు

“గతంలో మనం ఇచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. జగన్‌ ఇచ్చేది రూ.15 వేలు మాత్రమే.. చంద్రబాబు వస్తే కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద అమ్మకు రూ.18 వేలు, మరో మహిళకు రూ.18 వేలు, పిల్లలకు రూ.36 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.4 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. 2024 జూన్‌ నుంచే అన్నీ అమలు చేస్తామని బాండ్లు పంపారు. ఇప్పుడు ఆ హామీలపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.”

డీఎస్సీపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి

“డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద అంశంపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఒకవైపు సూపర్‌సిక్స్‌ అమలు చేయకపోయినా అన్నీ చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అనుకూల మీడియా ద్వారా అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం అని ప్రజలు నమ్మేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు మాత్రం వాస్తవాలను గమనిస్తున్నారు.”

విశాఖ అభివృద్ధికి మన ప్రభుత్వం పునాది వేసింది

“విశాఖ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన హయాంలో ఏం చేశామో మీ అందరికీ తెలుసు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాం. ఏకంగా 1.30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించాం. కేజీహెచ్‌ను అభివృద్ధి చేశాం. ఎవరూ పట్టించుకోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు పరిష్కారంగా హీరమండలం నుంచి సుమారు రూ.600 కోట్లతో తాగునీటి సరఫరా చేపట్టాం. ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు, మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. విశాఖలో అభివృద్ధి అంటే అది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది.”

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

“చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. విశాఖలో మేయర్‌ను మార్చిన తీరే అందుకు ఉదాహరణ. స్థానిక ఎన్నికలు కూడా సాఫీగా జరగనివ్వకపోవచ్చనే పరిస్థితి ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందో చూశాం. కానీ ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలు వేరే తీర్పు ఇచ్చారు. మన హయాంలో ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. పోలీసులను ఉపయోగించుకోలేదు. మనం చేసిన మంచి పనులు, అమలు చేసిన పథకాల మీదే ఆధారపడి ప్రజల తీర్పు కోరాం. చంద్రబాబు మాత్రం పోలీసు వ్యవస్థపై ఆధారపడుతున్నారు.”

విశాఖను దోచే చర్యలపై ప్రజలు ప్రశ్నించాలి

“గీతం వర్సిటీకి సంబంధించిన 55 ఎకరాల భూమి విలువ కనీసం రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని నేను చెబుతున్నాను. ఆ భూమిని అడ్డగోలుగా నచ్చిన వారికి, లోకేష్‌ తోడల్లుడికి ఇచ్చేశారు. ఇంత స్థాయిలో బరితెగించి అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వం ఇది. కానీ ఇవన్నీ ఊరికే ఎక్కడికీ పోవు. చేసిన తప్పులకు ఎప్పటికైనా జవాబు చెప్పాల్సిందే.”

విశాఖ నీటి సమస్యకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి

“విశాఖలో తొలిసారిగా నీటి ఎద్దడి కనిపిస్తోంది. పోలవరం ఎత్తు 45.72 మీటర్లుగా ఉంటే మరో 75 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు దాని ఎత్తు తగ్గించారు. ఒకవైపు గోదావరి నీటిని నిల్వ చేసుకునే అవకాశాన్ని కోల్పోతూ, మరోవైపు విశాఖ ప్రజలకు మూడు రోజులకు ఒకసారి కూడా నీరు అందని పరిస్థితి వచ్చింది. ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి.”

గట్టిగా నిలబడండి.. పోరాడండి

“ఎన్నికల్లో గట్టిగా పనిచేయండి. పార్టీ మీకు పూర్తిగా తోడుగా ఉంటుంది. ఏ పోలీస్‌ అయినా దౌర్జన్యం చేస్తే ముందు విజ్ఞప్తి చేయండి. అప్పటికీ వినకపోతే జరిగిన విషయాలను డిజిటల్‌ డైరీలో నమోదు చేయండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డైరీని తెరిచి చర్యలు తీసుకుంటాం. మనం ప్రజల వద్దకు వెళ్లాలి. వారి సమస్యలపై పోరాడాలి. ఈ ఎన్నికలు నాయకులు, కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలు. అందుకే గట్టిగా నిలబడండి. పోరాడండి. జగన్‌ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. మీ అందరికీ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.”

Back to Top